Politics

భాజపా వైపు సుమలత చూపు…?

భాజపా వైపు సుమలత చూపు…?

మండ్య నియోజకవర్గానికి స్వతంత్ర ఎంపీగా కొనసాగుతున్న సుమలతా అంబరీష్‌ బీజేపీలో చేరేందుకు సుముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కొంతకాలంగా ఆమె పార్టీలో చేరే అంశం ప్రస్తావనకు వస్తూనే ఉంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మండ్య నియోజక వర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సుమలతను జిల్లా ప్రజలు సాదరంగా స్వాగతించారు. కాంగ్రెస్‌, జేడీఎస్ ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు, అప్పటి సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్‌కుమార్‌పై ఆమె గెలుపొందారు. సుమలత భర్త అంబరీష్‌ కన్నడ నటుడిగా సుపరిచితుడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చాక ఇటు రాష్ట్రం అటు కేంద్రంలోను మంత్రిగా వ్యవహరించారు. మండ్య జిల్లా నుంచి అంబరీష్‌ సుధీర్ఘకాలం పాటు రాజకీయాల్లో కొనసాగారు. అదే అభిమానంతో సుమలత ఇండిపెండెంట్‌గా గెలుపొందారు. మరో రెండేళ్ల తర్వాత లోక్‌సభకు ఎన్నికలు రానున్నాయి.

ఈలోగానే ఏడాదిలో రాష్ట్ర శాసనసభ ఎన్నికలు వస్తున్నందున కుమారుడు అభిషేక్‌ను రాజకీయాల్లోకి తీసుకువచ్చేందుకు ఆమె నిర్ణయించినట్లు తెలుస్తోంది. మద్దూరు నుంచి అభిషేక్‌ పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. మద్దూరు నుంచి కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ను అగ్ర రాజకీయ నేత ఎస్‌ఎం కృష్ణ సోదరుడు గురుచరణ్‌కు ఇవ్వడం దాదాపు ఖరారైంది. ఇదే విషయాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్‌ కూడా ప్రకటించారు. ఇదే కారణంతో సుమలత బీజేపీలో వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. సుమలత పోటీ చేసినప్పుడు బీజేపీ అభ్యర్థిని పోటీ చేయించలేదు. కాంగ్రెస్‌ పార్టీ అంతర్గతంగా మద్దతు ఇచ్చింది. కేవలం జేడీఎస్‌ మాత్రమే నిఖిల్‌కు మద్దతు ఇచ్చింది. ఎన్నికల ఫలితాల తర్వాత పలు సందర్భాలలో ఏ పార్టీలో చేరే ఆలోచన లేదని సుమలత వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కుమారుడు అభిషేక్‌ను రాజకీయాలలోకి తీసుకువచ్చేందుకు ఇదే తగిన సమయమని భావించి కమలం వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇదే విషయమై గడిచిన వారంపదిరోజులుగా మండ్య జిల్లాకు చెందిన ఆప్తులతో ఆమె మంతనాలు జరిపి బీజేపీలో వెళ్లే విషయం ప్రస్తావిస్తున్నట్లు సమాచారం