Agriculture

ఒక్కసారి నాటితే వందేళ్ల వరకూ దిగుబడి..

ఒక్కసారి నాటితే వందేళ్ల వరకూ దిగుబడి..

వక్క తోట సిరులు కురిపిస్తోంది. ఐదేళ్ల సంరక్షణ అనంతరం రాబడి మొదలవుతుంది. ఏటా దిగుబడి పెరగడంతో పాటు ఆదాయమూ రెట్టింపవుతుంది. చెట్లకు అవసరమైన మేరకు నీరు, పేడ, మట్టిని అందిస్తే చాలు. పెద్దగా ఖర్చు చేయాల్సింది లేదు. ధరలు నిలకడగా ఉండటంతో రైతులు నిశ్చింతగా ఉండొచ్చు. ఒక్కసారి పంట సాగు చేస్తే వంద సంవత్సరాల వరకు దిగుబడులు వస్తూనే ఉంటాయి.

అనంతపురం జిల్లాలో సంప్రదాయ పంట వేరుశనగ. అత్యధిక శాతం రైతులు ఈ పంటను సాగు చేస్తుంటారు. అయితే అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల వల్ల చాలాసార్లు పంట చేతికందకుండానే పోతోంది. పెట్టుబడులు కూడా దక్కే పరిస్థితులు లేకపోవడంతో బోరుబావులు కలిగిన కొందరు రైతులు, వక్క తోటలపై మక్కువ చూపుతున్నారు. అమరాపురం, రొళ్ల, అగళి, గుడిబండ, మడకశిర, కుందుర్పి, రాయదుర్గం తదితర మండలాల్లో వక్క తోటల సాగు అధికంగా ఉంది. ఒక్క మడకశిర నియోజకవర్గంలోనే ఐదు వేల ఎకరాలకు పైగా వక్క సాగవుతోంది.

నారు పోయడం
సాగు చేయడానికి ముందు ఎండిన ఒలిసిన వక్కను రైతులు తీసుకొచ్చి నారు పోస్తారు. పాలిథిన్‌ కవర్‌ తీసుకుని అందులో విత్తనం వేసి నీరు పోస్తారు. పది రోజుల తరువాత వక్క విత్తనం నుంచి మొక్క బయటికి వస్తుంది. ఇలా సంవత్సరం, రెండు సంవత్సరాల వరకు నీరు, ఎరువు అందించి మొక్కను తోటలో లేదా ఇంటి ఆవరణలో పెంచుతారు.

సాగు పద్ధతులు
వక్క మొక్క రెండేళ్ల వయసుకు వచ్చిన తరువాత రైతులు తమ పొలాల్లో 5 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పులో నాటుతారు. ఒక ఎకరాకు 400 మొక్కలు నాటవచ్చు. ఇలా సాగు చేసిన 5 సంవత్సరాలకు పంట దిగుబడి ప్రారంభమవుతుంది. ఒక ఎకరా తోట నుంచి ఎండబెట్టిన వక్కలు ఆరు క్వింటాళ్ల వరకూ వస్తాయి
c
నిలకడగా వక్క ధరలు
రెండేళ్ల నుంచి వక్క ధరలు నిలకడగా ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో వక్క క్వింటాలు ధర రూ.48 వేల నుంచి రూ. 52 వేల వరకు పలుకుతోంది. కిలో వక్క రూ.500. అంటే ఒక ఎకరాలో ఆరు క్వింటాళ్ల దిగుబడి వస్తే మొత్తం రూ.3 లక్షల ఆదాయం వస్తుంది. ఈ లెక్కన నెలకు రూ.25 వేల ఆదాయం వచ్చినట్లే. దీంతో ఈ ప్రాంతంలోని రైతులు వక్క పంటను అధికంగా సాగు చేస్తున్నారు.

కర్ణాటక రైతులే స్ఫూర్తి
మడకశిర నియోజకవర్గం కర్ణాటకకు ఆనుకుని ఉంది. ముఖ్యంగా మడకశిర మండలం తప్ప మిగతా నాలుగు మండలాల్లో కన్నడ ప్రజలతో బంధుత్వాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కర్ణాటకలోని హిరియూర్, శిర, మధుగిరి, పావగడ, తుమకూరు, హుళియార్‌ తదితర ప్రాంతాల్లో వక్కతోటలను రైతులు అధికంగా సాగు చేస్తారు. అక్కడి రైతుల స్ఫూర్తితో మడకశిర నియోజకవర్గ రైతులు కూడా వక్క సాగుకు శ్రీకారం చుట్టారు.

నెలకోసారి కోత..
వక్క పంట కోత సాధారణంగా జూలై నెలలో ప్రారంభమవుతుంది. డిసెంబర్‌ ఆఖరు వరకు కోస్తారు. నెలకు ఒక సారి పంట కోత ఉంటుంది. పచ్చి గెలలను కోసిన తరువాత వాటి నుంచి వక్కను వేరు చేస్తారు. అనంతరం మహిళా కూలీలు, వక్క వలిచే యంత్రాల సహకారంతో చిప్పను, వక్క ఉండలను వేరు చేస్తారు. అనంతరం నీళ్లలో ఉడకబెట్టి తరువాత 8 రోజుల పాటు ఎండకు ఆరబెట్టి సంచుల్లో నింపి నిల్వ చేస్తారు. మార్కెట్లో మంచి ధర ఉన్నపుడు అమ్మకాలు చేస్తారు. ఇలా వక్క పంటను ఈ ప్రాంతంలోని రైతులు బోరు బావుల కింద సాగు చేసి అధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.

వేసవిలో ఇబ్బంది
వేసవి కాలంలో వక్క రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అధిక ఉష్టోగ్రతలకు తోడు బోరు బావుల్లో నీటిమట్టం పడిపోవడంతో వక్క తోటలకు సరిగా నీరు అందడంలేదు. దీంతో రైతులు లక్షలు ఖర్చు చేసి మరో బోరు తీయడానికి ప్రయత్నిస్తున్నారు. నీరు పడితే అదృష్టం.. లేకపోతే పంటతో పాటు బోరు పెట్టుబడి కూడా పోతోంది.