Politics

మాజీ మంత్రి నారాయణ అరెస్ట్​

మాజీ మంత్రి నారాయణ అరెస్ట్​

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి నారాయణను ఏపీ పోలీసులు హైదారాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఏపీలో ఇటీవల జరిగిన పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీల వ్యవహారంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు చిత్తూరు పోలీసులు ప్రకటించారు. హైదరాబాద్‌లో కారులో వెళ్తున్న నారాయణ దంపతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారి సొంత కారులోనే ఏపీకి తరలిస్తున్నారు.గతంలో ఎప్పుడూ లేనంతంగా పదోతరగతి ప్రశ్నాపత్రాలు వరుసగా లీకేజీకావడంతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిపోయింది. తొలుత విద్యాశాఖ మంత్రి బొత్ససత్యనారాయణ అసలు ప్రశ్నాపత్రాలే లీకవ్వలేదంటూ తేల్చిచెప్పారు. ఇదంతా తెలుగుదేశం చేస్తున్న విషప్రచారమంటూ మండిపడ్డారు. ఆ తర్వాత ఏపీ సీఎం జగన్ తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో నారాయణ, చైతన్య విద్యాసంస్థల్లోనే ప్రశ్నాపత్రాలు లీకైనట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే నారాయణను ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. అయితే పేపర్‌ లీకేజీ, మాల్‌ ప్రాక్టీస్‌ కేసులో దాదాపు 50 మందికి పైగానే ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం విశేషంప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి చిత్తూరు ఒకటో పట్టణ పోలీసుస్టేషన్‌లో ఇప్పటికే కేసు నమోదైంది. ఈ కేసులో నారాయణ స్కూలు వైస్‌ ప్రిన్సిపల్ గిరిధర్‌తోపాటు పలువురిని అరెస్ట్‌ చేశారు.హైదరాబాద్‌ వచ్చిన పోలీసులు నారాయణను ఆయన సొంత వాహనంలో చిత్తూరు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో నారాయణను అపహరించారంటూ ఆయన కుటుంబసభ్యులు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాహనం నంబర్‌తో సహా వారు పోలీసులకు చెప్పారు. వెంటనే స్పందించిన పోలీసులు.. బెంగళూరు జాతీయ రహదారి వైపు నారాయణ వాహనం వెళ్తున్నట్లు నిర్ధారించుకుని ఆ మార్గంలోని కొత్తూరు పోలీసులకు సమాచారం అందించారు.దీంతో కొత్తూరు కూడలి వద్ద నారాయణను తీసుకెళ్తున్న వాహనాన్ని ఆపిన అక్కడి పోలీసులు తనిఖీ చేశారు. వాహనంలో నారాయణతో పాటు చిత్తూరు పోలీసులు ఉన్నట్లు వారు నిర్ధారించుకున్నారు. ఓ కేసులో భాగంగా మాజీ మంత్రిని తీసుకెళ్తున్నట్లు కొత్తూరు పోలీసులకు వారు చెప్పారు. దీంతో ఆ వాహనాన్ని అక్కడి నుంచి పంపేశారు. నారాయణ ఉన్న వాహనం ప్రస్తుతం చిత్తూరు వైపు వెళుతోంది.