Fashion

భారతీయతకు పట్టం కట్టాలి

భారతీయతకు పట్టం కట్టాలి

భారతీయ చిత్రాల్లోని కుటుంబ, సాంస్కృతిక విలువలతో పాటు కనులవిందుగా ఉండే పాటలు, హుషారును పంచే నృత్యాల్ని పాశ్చాత్య దేశాల సినీ ప్రేమికులు ఎంతగానో ఇష్టపడుతున్నారని చెప్పింది మంగళూరు సోయగం పూజాహెగ్డే. కేన్స్‌ అంతర్జాతీయ చిత్రోత్సవంలో ఎర్ర తివాచీపై నడిచిన ఈ భామ చూడముచ్చటైన రూపలావణ్యంతో ఆహుతుల్ని అలరించింది. కేన్స్‌ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో భారతీయ సినిమా ప్రతినిధులుగా పూజాహెగ్డే, దీపికాపడుకోన్‌, కమల్‌హాసన్‌, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, ఆర్‌. మాధవన్‌, ఏ.ఆర్‌.రెహమాన్‌ హాజరవుతున్నారు.ఈ సందర్భంగా పాశ్చాత్య సమాజం భారతీయ సినిమాను ఏ విధంగా స్వీకరిస్తుందనే ప్రశ్నకు పూజాహెగ్డే సమాధానమిస్తూ ‘సత్యజిత్‌రే చిత్రాల్లోని సహజత్వం బాగుంటుందని యూరప్‌లోని చాలా మంది చెబుతుంటారు. ముఖ్యంగా భారతీయ సినిమాకే ప్రత్యేకమైన పాటలు, నృత్యాల్ని అమితంగా ఇష్టపడతారు. అందుకే మన సినిమాలు పాటలకు ఎప్పుడూ దూరం కావొద్దు. భారతీయ సంగీతం సినిమా మాధ్యమం ద్వారానే సామాన్య ప్రేక్షకులకు చేరువవుతుంది.అలాగే సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ‘దేవదాస్‌’ చిత్రంలోని పాటలు చాలా బాగున్నాయని చాలా మంది మెచ్చుకున్నారు’ అని చెప్పింది. భారతదేశం భిన్న సంస్కృతుల సమ్మేళనమని, భాషాపరమైన విభేదాలు లేకుండా భారతీయ ఆత్మకు పట్టం కట్టే చిత్రాలు రావాలన్నది తన అభిమతమని పూజాహెగ్డే పేర్కొంది.