DailyDose

రాష్ట్రపతి అభ్యర్థిపై జూన్‌లో నిర్ణయం

రాష్ట్రపతి అభ్యర్థిపై జూన్‌లో నిర్ణయం

రాష్ట్రపతి అభ్యర్థిపై బీజేపీ జూన్‌ మొదటి వారంలోనే నిర్ణయం తీసుకోనుంది. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇప్పటికే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభ్యర్థులతో పాటు రాజ్యసభకు ఎంపిక చేయాల్సిన సభ్యులపై చర్చలు జరిపారు. జూన్‌ 8న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విదేశీ పర్యటన నుంచి వచ్చేలోపే రాష్ట్రపతి అభ్యర్థి పేరును ఖరారు చేసే అవకాశాలున్నాయని తెలిసింది. రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలెక్టోరల్‌ కాలేజీలో బీజేపీకి 48.9ు ఓట్లు, విపక్షాలు, ఇతర పార్టీలకు 51.1ు ఓట్లున్నాయి. దీంతో ఒడిషా సీఎం, బిజూజనతాదళ్‌ అధినేత నవీన్‌ పట్నాయక్‌, బిహార్‌ సీఎం, జేడీ(యూ) నేత నితీ్‌షకుమార్‌లతో బీజేపీ నేతలు ఇప్పటికే చర్చలు జరిపారు. వైసీపీ తమకు మద్దతు ఇచ్చి తీరుతుందని బీజేపీ నేత ఒకరు చెప్పారు. విపక్షాల శిబిరంలోనూ రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై చర్చలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ సీఎం కేసీఆర్‌, శరద్‌ పవార్‌, మమతా బెనర్జీ, దేవెగౌడ, ఉద్ధవ్‌ ఠాక్రే, కేజ్రీవాల్‌ తదితరులు ప్రాథమిక చర్చలు జరిపారు. వారు కూడా జూన్‌ మొదటి వారం లోపు అభ్యర్థిపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలున్నాయి. జూన్‌ 10న రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. ఏపీకి చెందిన బీజేపీ సభ్యులు సుజనాచౌదరి, టీజీ వెంకటేశ్‌, సురేశ్‌ ప్రభు పదవీ విరమణ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి బలం లేనందున ఇతర రాష్ట్రాల నుంచి ఒక తెలుగు నేతకు అవకాశం లభించవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న నేతల్లో సుజనాచౌదరి, వెంకటేశ్‌తోపాటు పురంధేశ్వరి, లక్ష్మణ్‌ తదితరులు ఉన్నారు.