NRI-NRT

బ్రిట‌న్‌లో హైపొటెన్షియ‌ల్ వ్య‌క్తిగ‌త‌ వీసా!

బ్రిట‌న్‌లో హైపొటెన్షియ‌ల్ వ్య‌క్తిగ‌త‌ వీసా!

*భార‌తీయ విద్యార్థుల‌కు ఇలా ఉద్యోగ అవ‌కాశాలు

బ్రెగ్జిట్ వ‌ల్ల బ్రిట‌న్‌కు ల‌భించిన బెనిఫిట్ మాటెలా ఉన్నా.. భార‌తీయుల‌కు.. భార‌తీయ విద్యార్థుల‌కు.. విద్యా ఉపాధి అవ‌కాశాలు పెరిగాయి. భార‌తీయుల‌తోపాటు ప్ర‌పంచంలోకెల్లా టాప్ 50 నాన్‌-యూకే యూనివ‌ర్సిటీల్లో గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేసుకున్న విద్యార్థులు బ్రిట‌న్‌కు రావ‌చ్చు.. ఉద్యోగం చేయొచ్చు. అత్యంత ప్ర‌తిభావంతులైన విదేశీ విద్యార్థుల‌కు బ్రిట‌న్ రెడ్ కార్పెట్ స్వాగ‌తం ప‌లుకుతున్న‌ది. అందుకు హై పొటెన్షియ‌ల్ ఇండివిడ్యుయ‌ల్ (హెచ్పీఐ) వీసా విధానం తెచ్చింది. ఈ వీసాను భార‌త సంత‌తికి చెందిన బ్రిట‌న్ మంత్రులు రిషి సున‌క్ (ఆర్థికం), ప్రీతి ప‌టేల్ (హోం) సోమ‌వారం ప్రారంభించారు. బ్రెగ్జిట్ త‌ర్వాత జాతీయ‌త‌తో నిమిత్తం లేకుండా ఉత్త‌మ ప్ర‌తిభావంతుల‌ను ఆక‌ర్షించ‌డానికి `హెచ్పీఐ` వీసా విధానం ఉప‌క‌రిస్తుంది. యూరోపియ‌న్ యూనియ‌న్ (ఈయూ) నుంచి బ్రిట‌న్ వైదొల‌గ‌డాన్ని బ్రెగ్జిట్ అని పిలుస్తున్నారు.

వీసా పొందిన ఆయా నిపుణుల విద్యార్హ‌త‌ల‌ను బ‌ట్టి రెండేండ్ల నుంచి మూడేండ్ల వ‌ర‌కు ప‌ని చేసేందుకు.. అక్క‌డే నివ‌సించ‌వ‌చ్చు. ఈ వీసా కింద బ్రిట‌న్‌కు వెళ్లే వారికి జాబ్ ఆఫ‌ర్ గానీ, స్పాన్ష‌ర్‌షిప్‌గానీ అవ‌స‌రం లేదు. సెల్ఫ్ ఎంప్లాయిగా గానీ, వ‌లంటీర్‌గా గానీ బ్రిట‌న్‌కు రావ‌చ్చు. కాక‌పోతే వీసాకోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారు ప్ర‌పంచంలోనే పేరొందిన యూనివ‌ర్సిటీ నుంచి డిగ్రీ పట్టా అందుకుని ఉండాలి. వీసాకు ద‌ర‌ఖాస్తు చేయ‌డానికి ఐదేండ్ల‌లోపే ఆ ప‌ట్టా అందుకుని ఉండాలి.న్యూ హై పొటెన్షియ‌ల్ ఇండివిడ్యుయ‌ల్ వీసా కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అర్హ‌త గల విద్యా సంస్థ‌ల జాబితాను బ్రిటిష్ ప్ర‌భుత్వం ప్ర‌తియేటా గ‌వ్‌.యుకే వెబ్‌సైట్‌లో విడుద‌ల చేస్తుంది.వీసా ద‌రఖాస్తు దారుల శ‌క్తి సామ‌ర్థ్యాలు, కోర్సుల‌ను బ‌ట్టి ఎటువంటి జాబ్ ఆఫ‌ర్ లేకుండానే బ్రిట‌న్‌కు రావ‌చ్చున‌ని బ్రిట‌న్ ఇమ్మిగ్రేష‌న్ శాఖ మంత్రి కెవిన్ ఫాస్ట‌ర్ తెలిపారు.అయితే, గ్రాడ్యుయేట్ వీసాపై వ‌చ్చిన వారికి ఈ హెచ్పీఐ వీసా వ‌ర్తించ‌దు. బ్యాచ్‌ల‌ర్ లేదా మాస్ట‌ర్ డిగ్రీపై వ‌చ్చిన వారికి రెండేండ్ల వీసా ఇస్తారు. పీహెచ్డీ, ఇత‌ర డాక్టోర‌ల్ లెవెల్ గ్రాడ్యుయేట్స్‌కు మూడేండ్ల విలువ‌గ‌ల వీసా ల‌భిస్తుంది. హెచ్పీఐ వీసా దారులు దీర్ఘ‌కాలిక ఉద్యోగ వీసా పొందేందుకు కూడా అర్హులు. అయితే, కొన్ని నిబంధ‌న‌లు పాటించాల్సి ఉంటుంద‌ని బ్రిట‌న్ ప్ర‌భుత్వం తెలిపింది.

నూత‌న వీసా ఆఫ‌ర్ ద్వారా భార‌తీయుల‌తోపాటు ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్యుత్త‌మ ప్ర‌తిభావంతుల‌ను ఆక‌ర్షించ‌డానికి వీల‌వుతుంద‌ని బ్రిట‌న్ ఆర్థిక మంత్రి రిషి సున‌క్ తెలిపారు. ఎంట‌ర్‌ప్రెన్యూర్‌షిప్‌, క్రియేటివిటీ, ఇన్నోవేష‌న్ హ‌బ్‌గా బ్రిట‌న్ అవ‌త‌రించేందుకు `హెచ్పీఐ` దోహ‌ద ప‌డుతుంద‌న్నారు. రిషి సునక్ సైతం అమెరికాలోని స్టాన్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ ఎంబీఏ పూర్తి చేశారు. స్టాన్‌ఫ‌ర్డ్‌, హార్వ‌ర్డ్‌, ఎంఐటీ వంటి ప్ర‌తిష్ఠాత్మ‌క యూనివ‌ర్శిటీల్లో గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేసుకున్నాక వారు త‌మ స్కిల్స్ పెంచుకోవ‌డానికి కొత్త వీసా రూట్ మార్గం సుగ‌మం చేస్తుంది.