Politics

సమగ్ర సర్వేతో.. భూవివాదాలన్నీ పరిష్కారమవుతాయి – TNI రాజకీయ వార్తలు

సమగ్ర సర్వేతో.. భూవివాదాలన్నీ పరిష్కారమవుతాయి  – TNI రాజకీయ వార్తలు

* సమగ్ర సర్వే కార్యక్రమాన్ని అధికారులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూచించారు. వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకంపై సీఎం సమీక్షించారు. సమగ్ర సర్వేతో భూవివాదాలన్నీ పరిష్కారమవుతాయని అన్నారు. ఇప్పటివరకూ జరిగిన సర్వే ప్రగతిని సీఎం పరిశీలించారు.. సమగ్ర సర్వేతో భూవివాదాలన్నీ పరిష్కారమవుతాయని సీఎం జగన్‌ అన్నారు. దశాబ్దాల తరబడి నెలకొన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. సమగ్ర సర్వే ప్రధాన లక్ష్యాల్లో భూవివాదాల పరిష్కారం ఒకటన్న సీఎం జగన్‌.. సర్వే కార్యక్రమాన్ని అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఆదేశించారు. వందేళ్ల తర్వాత సమగ్ర సర్వే జరుగుతోందని.. దీని ద్వారా ప్రజలు, రాష్ట్రానికి మేలు జరుగుతుందని తెలిపారు. వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకంపై సీఎం సమీక్షించారు.సమగ్ర సర్వేను నిర్దేశించుకున్న సమయంలోగా పూర్తి చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. అవసరమైన సిబ్బందిని సమకూర్చుకోవడం.. సాంకేతిక పరికరాలను అవసరాలకు అనుగుణంగా తెప్పించుకోవడం లాంటివి చేయాలని ఆదేశించారు. డ్రోన్లు, ఓఆర్‌ఐ పరికరాలు, రోవర్లు, సర్వే రాళ్లు సమకూర్చుకోవడం లాంటి ప్రతి అంశంలోను వేగం ఉండాలన్నారు. సీఎం జగన్‌కు అధికారులు సమగ్ర సర్వే వివరాలను వివరించారు. ఇప్పటివరకూ జరిగిన సర్వే ప్రగతిని సీఎం పరిశీలించారు.

*ప్ర‌గ‌తిశీల రాష్ట్రాల‌ను ప్రోత్స‌హించాలి : మంత్రి కేటీఆర్
ప్ర‌గ‌తిశీల రాష్ట్రాల‌ను ప్రోత్స‌హించాలే త‌ప్ప అణ‌గ‌దొక్క‌కూడ‌ద‌ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాజ‌కీయాల‌కు అతీతంగా అన్ని రాష్ట్రాల‌ను ప్రోత్స‌హించాల‌ని సూచించారు. రాష్ట్రం బ‌లంగా ఉంటేనే దేశం బ‌లంగా ఉంటుంది. ఉత్ప‌త్తి రంగం బ‌లోపేతానికి కేంద్రం చ‌ర్య‌లు తీసుకోవాలి. కేంద్రం మంచి ప‌ని చేస్తే మెచ్చుకుంటాం.. చెడ్డ ప‌ని చేస్తే విమ‌ర్శిస్తాం అని చెప్పారు. ఎన్నిక‌ల స‌మ‌యంలోనే రాజకీయ వ్యూహాలు చేయాల‌ని కేటీఆర్ సూచించారు.

*ఆ రెండు పార్టీలు అధికారంలోకి వ‌చ్చే ప్ర‌స‌క్తే లేదు : మంత్రి హ‌రీశ్‌రావు
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అధికారంలోకి వ‌చ్చే ప్ర‌స‌క్తే లేద‌ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు. ఒక వేళ అధికారంలోకి వ‌చ్చినా అర‌చేతిలో వైకుంఠం చూపిస్తార‌ని పేర్కొన్నారు. నారాయ‌ణ్‌పేట జిల్లాలో ప‌ర్య‌టించిన మంత్రి హ‌రీశ్‌రావు.. రూ. 56 కోట్ల‌తో 390 ప‌డ‌క‌ల ఆస్ప‌త్రికి, రూ. 1.25 కోట్ల‌తో టీ డ‌యాగ్నోస్టిక్ నిర్మాణాల‌కు శంకుస్థాప‌న చేశారు. ఇక ఎర్ర‌గుట్ట నుంచి ఎక్లాస్ మీదుగా తెలంగాణ – క‌ర్ణాట‌క స‌రిహ‌ద్దు వ‌ర‌కు రూ. 5.98 కోట్ల‌తో 5.5 కిలోమీట‌ర్ల మేర‌ నిర్మించిన రోడ్డును, కొత్త‌గా ఏర్పాటు చేసిన డ‌యాల‌సిస్ యూనిట్‌ను మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో క‌లిసి మంత్రి హ‌రీశ్‌రావు ప్రారంభించారు.

*కాంగ్రెస్ నేతలు దోపిడీ దొంగల్లా మాట్లాడుతున్నారు: Errabelli
కాంగ్రెస్ పార్టీ నేతలు దోపిడీ దొంగల్లా మాట్లాడుతున్నారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు చెత్త పార్టీలని ఆయన ఆరోపించారు.వాళ్ళ వల్లే పెట్రో డీజిల్, నిత్యావసర ధరలు పెరిగాయి.వాళ్ళ వల్ల ప్రజలకు ఏనాడూ మేలు జరగలేదని అన్నారు. అధికారంలో ఉన్నన్నాళ్లూ వాళ్ళే లాభ పడ్డారని అన్నారు కాంగ్రెస్ నాయకులు తుపాకీ వెంకట్రాముడు లాగా మాట్లాడుతారు. వినడానికి మన చెవులకు సంతోషంగా ఉంటది కానీ, వీళ్ళు ఏమి చేయరు. ఏమి చేత కాదు.వాళ్ళ మాటలు నమ్ముకుంటే, నట్టేట మునిగినట్లేనని అన్నారు.వాళ్ళ కాలంలో రాష్ట్రం, దేశం సర్వనాశనం అయిందన్నారు. గ్రామాల్లో కనీస వసతులు లేని పరిస్థితి దాపురించిందని సీఎం కెసిఆర్ వచ్చాకే, గ్రామాలకు మంచి దశ వచ్చిందన్నారు.

*రూ.4వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలి: Bandi sanjay
రూ.4వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌( కు బండి సంజయ్ లేఖ రాశారు. జూన్ నెలాఖరు లోపు నిధులు విడుదల చేయకపోతే ఆందోళనలు చేస్తామన్నారు. బీసీ విద్యార్థులకు ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరడానికి ర్యాంకుల నిబంధన ఎత్తివేసి అర్హులకు పూర్తి ఫీజులు మంజూరు చేయాలని అన్నారు. ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ విద్యార్థులకు ఇస్తున్న మాదిరిగా బీసీ, ఈబీసీ విద్యార్థులకు కూడా పూర్తి ఫీజులు మంజూరు చేయాలని బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు.

*టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం లిక్కర్ తెలంగాణ: Madhuyashki
టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం లిక్కర్ తెలంగాణ గా మారిందని కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్వి మర్శలు గుప్పించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ… ప్రజల సంపాదన మద్యం పాలు.. సంసారాలు వీధులపాలు అవుతున్నాయన్నారు. ఏడేండ్లలో మద్యం అమ్మకాల సొమ్ము లక్ష 35 వేల కోట్లకు పెరిగిందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో మద్యం అమ్మకాలు 10 వేల కోట్లు మాత్రమే ఉండేదన్నారు. ప్రత్యేక తెలంగాణలో మద్యం అమ్మకాలు ఏటేటా రికార్డులు బద్దలు కొడుతున్నాయని అన్నారు. ఈ ఏడాది 40 వేల కోట్ల అమ్మకాల లక్ష్యంగా పెట్టుకోవడం సిగ్గు చేటని మండిపడ్డారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కార్ నేరస్థులను కాపాడుతోందని ఆరోపించారు. సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని మధుయాష్కీ గౌడ్ అన్నారు.

*బోనాల జాతర నిర్వహణకు రూ.15 కోట్ల నిధుల కేటాయింపు: Talasani
తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే విధంగా బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించిందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.సోమవారం ఎంసిహెచ్ఆర్డి లో జాతర ఏర్పాట్లను అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బోనాలను అత్యంత వైభవంగా నిర్వహించాలనే ఆలోచనతో ప్రభుత్వం 15 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని తెలిపారు. బోనాల కోసం ప్రభుత్వ దేవాలయాలకే కాకుండా ప్రయివేట్ దేవాలయాలకు సుమారు 3 వేల దేవాలయాలకు ఆర్ధిక సహాయం అందిస్తున్నట్లు వివరించారు.ఎలాంటి ఆటంకాలు లేకుండా బోనాల ఉత్సవాలను నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని అన్నారు.

*APని కేంద్రం అన్ని రంగాల్లో ఆదుకుంది: జేపీ నడ్డా
ఏపీ (AP) ని కేంద్రం అన్ని రంగాల్లో ఆదుకుందని బీజేపీ నేత జేపీ నడ్డా తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కోట్లాది మందికి కరోనా వ్యాక్సిన్ అందించామని చెప్పారు. 48 దేశాలకు కొవిడ్ టీకా ఎగుమతి చేశామన్నారు. అభివృద్ధి, సంక్షేమం ఎలా ఉండాలో ప్రధాని మోదీ చేసి చూపారని తెలిపారు. 40 శాతం డిజిటల్ లావాదేవీలు జరిగేలా చేశామన్నారు. బీపీఎల్ వారి సంఖ్య 22 నుంచి 10 శాతానికి తగ్గిందని నడ్డా తెలిపారు.

*బీజేపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలి: పురంధరేశ్వరి
బీజేపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని ఆ పార్టీ పురంధరేశ్వరి పిలుపునిచ్చారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ గత ఎన్నికల్లో 0.83 శాతం మేర ఓట్లే వచ్చాయని తెలిపారు. కేంద్రం నిధులను రాష్ట్రం దుర్వినియోగం చేస్తోందని దుయ్యబట్టారు. ఏపీలో వైసీపీ వచ్చాక అభివృద్ధి రివర్సులో ఉందని విమర్శించారు. పెట్టుబడిదారులు పక్క రాష్ట్రానికి వెళ్లిపోతున్నారని తెలిపారు. ఏపీలో శాంతి భద్రతలు సక్రమంగా లేవని పురంధరేశ్వరి ధ్వజమెత్తారు.

*నవ సంకల్ప చింతన సదస్సు విజయవంతం: Tulasi Reddy
నవ సంకల్ప చింతన (మేధో మదన) సదస్సు విజయవంతమైందని ఏపీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ సదస్సులో రాబోవు రెండేళ్లలో కాంగ్రెస్ పార్టీ దశ దిశా నిర్దేశించడం జరిగిందన్నారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అదీ అమరావతీ అని స్పష్టం చేయడం జరిగిందన్నారు. వర ప్రసాదీని లాంటి పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని తీర్మానించడమైందని, విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేయవద్దని, రాష్ట్రానికి సంజీవిని లాంటి ప్రత్యేక హోదా అమలు చేయాలని తీర్మానించినట్లు చెప్పారు. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ ఖండ్ తరహా ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజి ఇవ్వాలని, జాతీయ రైతు రుణ ఉపశమన కమిషన్ ఏర్పాటు చేసి, రుణ మాఫీ గానీ, రుణ విముక్తి గానీ కల్పించడం జరుగుతుందన్నారు. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించవద్దని హెచ్చరిస్తామని, సాగు నీటి రంగానికి బడ్జెట్ కేటాయింపులు పెంచి, త్వరితగతిన పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని, వైఎస్సార్ జిల్లా పేరును వైఎస్సార్ కడప జిల్లాగా మార్చాలని సదస్సులో తీర్మానించడం జరిగిందని తులసి రెడ్డి వ్యాఖ్యానించారు.

*వైసీపీ నేతలు సిగ్గు విడిచి బరితెగించి ప్రవర్తిస్తున్నారు: నక్కా ఆనందబాబు
చెరువులలో తవ్వే మట్టి ఒక్క ట్రాక్టర్ కూడా జగనన్న కాలనీలకు వెళ్లడం లేదని మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు పేర్కొన్నారు. వైసీపీ నేతలు సిగ్గు విడిచి బరితెగించి ప్రవర్తిస్తున్నారన్నారు. వేమూరు నియోజకవర్గం చెరువులలో తాడి చెట్టు లోతు తవ్వకాలు చేశారన్నారు. అన్ని శాఖల అధికారులు కళ్లు మూసుకు కూర్చున్నారని విమర్శించారు. అధికారులు అధికార పార్టీకు ఊడిగం చేస్తున్నారన్నారు. ఒక్క ఛాన్స్ అని ప్రాధేయపడి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని నక్కా ఆనందబాబు విమర్శించారు.

*సీఎం అభ్యర్థిపై మా స్థాయిలో నిర్ణయాలు ఉండవు: GVL
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పర్యటనతో రాష్ట్ర బీజేపీ క్యాడర్‌లో జోష్ వస్తుందని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. సోమవారం మాట్లాడుతూ… 2024 ఎన్నికలే లక్ష్యంగా రోడ్ మ్యాప్ సిద్దం చేస్తామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామన్నారు. జనసేన, బీజేపీ మైత్రి బంధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కలిసే ఎన్నికల క్షేత్రంలో దిగుతామన్నారు. సీఎం అభ్యర్థిత్వంపై తమ స్థాయిలో నిర్ణయాలు ఉండవని తెలిపారు. జాతీయ నాయకత్వం చర్చించి ఒక ప్రకటన చేస్తుందన్నారు. సరైన సమయంలో సరైన ప్రకటనలు తమ అధిష్టానం నుండి‌ వస్తాయని ఎంపీ జీవీఎల్ పేర్కొన్నారు.

*టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పోటీ చేస్తాయని ఊహాగానాలు: నారాయణ
పొత్తులపై నిబంధనల మేరకే సీపీఐ నడుచుకుంటుందని సీపీఐ నారాయణ అన్నారు. వచ్చే ఎన్నికల్లో అందరం కలిసి పోటీ చేద్దామని చంద్రబాబు అంటున్నారని తెలిపారు. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా చేస్తానని పవన్ అంటున్నారని పేర్కొన్నారు. ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పోటీ చేస్తాయని ఊహాగానాలని కొట్టిపారేశారు.

*నిధుల్లో అవకతవకలపై చర్చకు సిద్ధమా?: AP మాజీ మంత్రి దేవినేని ఉమ
పోలవరం నిర్వాసితులకు మంజూరైన నిధుల్లో అవకతవకలు జరిగాయని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. వాటిపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని, మరి వైసీపీ నేతలు సిద్ధంగా ఉన్నారా? అని సవాల్ విసిరారు. ఇంకా ఏమన్నారంటే..‘‘2021 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తానని జగన్ కేంద్రానికి చెప్పారు. ప్రాజెక్టు కోసం కేంద్రం ఇచ్చిన నిధులను నిర్వాసితులకు ఇవ్వలేదు. ఆ నిధులేమయ్యాయో జగన్ సమాధానం చెప్పాలి. పోలవరం ఎత్తు తగ్గించడానికి జగన్ సిద్ధమని కేసీఆర్ చెప్పారు.కేసీఆర్ ప్రకటనను జగన్, మంత్రులు ఎందుకు ఖండించలేదు. కేసీఆర్ నుంచి నిధులు వచ్చినందునే ఏమీ చెప్పట్లేదు. సీఎఫ్ఎంఎస్ నుంచి ఆఫ్‌లైన్ పేమెంట్లు జరుగుతున్నాయి. వాటిపై విచారణ జరిపితే జగన్ జైలుకెళ్లడం ఖాయం. రూ.లక్ష కోట్ల బిల్లులు చెల్లిస్తే.. రూ.20 వేల కోట్లు సజ్జల కాజేశారు. పోలవరం డ్యామ్‌ను పోలవరం బ్యారేజీగా మార్చేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది’’ అని ఆరోపించారు.

*Modi పాలనలో సామాన్య ప్రజలే ఎక్కువగా ఇబ్బంది పడ్డారు: Narayana
మోదీ పాలనలో సామాన్య ప్రజలే ఎక్కువగా ఇబ్బంది పడ్డారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ నోట్ల రద్దుతో బ్లాక్ మనీ కాస్త వైట్‌గా మార్చేసుకున్నారన్నారు. మోదీ విధానాలతో డ్రగ్ మాఫియా ఆగిందా?.. సర్జికల్ స్ట్రైక్‌తో దేశంలో ఉగ్రవాదం తగ్గిందా? అని ప్రశ్నించారు. జాతికి మోదీ క్షమాపణలు చెప్పాలన్నారు. బొగ్గు ఉత్పత్తి కావాలనే మోదీ ప్రభుత్వం తగ్గించిందని, అదానికి మేలు చేసేందుకు ఈ చర్య చేపట్టిందని ఆరోపించారు. ఆదానికి బొగ్గు ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయన్నారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఓటు వెయ్యాలని పిలుపిచ్చారు.14 మంది ప్రధానులు కలిసి రూ. 40 లక్షల కోట్ల అప్పు చేస్తే… మోదీ ఒక్కరే రూ. 80 లక్షల కోట్లు అప్పు చేశారని నారాయణ అన్నారు. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఉద్యమ కార్యాచరణ చేపడతామన్నారు. హడావిడిగా సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి లోపల ఎం చేశారో ఎవరికీ తెలియదన్నారు. పోలవరం నిర్వాసితులకు ఇవ్వాల్సిన పరిహారం, నిధులు ఏమి అడగలేదన్నారు. జగన్‌ను నమ్మి రాష్ట్ర ప్రజలు 22 లోక్ సభ సీట్లు ఇస్తే ఎం సాధించారని ప్రశ్నించారు. హోదాపై ప్రగల్బాలు పలికిన జగన్ ఢిల్లీకి వెళ్లి సాధించింది ఏమి లేదని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ ఆత్మగౌరవానికి ప్రతీకని, ఢిల్లీ నాయకులను ఎదిరించి నిలబడిన వ్యక్తి అని కొనియాడారు. జగన్ తెలుగు వారి ఆత్మగౌరవాన్ని మోదీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. జగన్ దావోస్ పర్యటనలో ఒక్క కొత్త కంపెనీ రాలేదని విమర్శించారు. మూడు రాజధానుల ప్రకటనతో పెట్టుబడిదారులంతా వెళ్లిపోయారని నారాయణ అన్నారు

*పొత్తులపై నిర్ణయం బీజేపీ హైకమాండ్‌దే: పురంధేశ్వరి
పొత్తులపై నిర్ణయం బీజేపీ హైకమాండ్‌దేనని ఆ పార్టీ నేత పురంధేశ్వరి ప్రకటించారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ బీజేపీ, జనసేన మధ్య ఎలాంటి గ్యాప్ లేదని తెలిపారు. క్షేత్ర స్థాయిలో మాత్రం కొంత గ్యాప్ ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీచేస్తాయని పురంధేశ్వరి ప్రకటించారు. ఏపీలో పొత్తులపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే శనివారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన జనసేన విస్తృతస్థాయి సమావేశంలో ఈ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ ముగింపు ప్రసంగం చేశారు. ‘ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను’ అని ఇప్పటికే స్పష్టం చేసిన జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌… తాజాగా పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘వచ్చే ఎన్నికల్లో మాకు మూడు ఆప్షన్లు ఉన్నాయి. మొదటిది… బీజేపీతో కలిసి ప్రభుత్వ స్థాపన. రెండు… బీజేపీ, టీడీపీలతో కలిసి అధికారంలోకి రావడం. మూడు… జనసేన ఒంటరిగా పోటీ చేసి ప్రభుత్వాన్ని స్థాపించడం’’ అని పవన్‌ పేర్కొన్నారు.

* కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలి: కోదండరాం
కుటుంబ ప్రయోజనాల కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్న సీఎం కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం డిమాండ్‌ చేశారు. రాష్ట్రం ఏర్పడి 8 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వ వైఫల్యాలపై టీజేఎస్‌ సోమవారం ఇందిరాపార్కు వద్ద ఆత్మగౌరవ దీక్ష నిర్వహించనుంది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు కోదండరాం బహిరంగ లేఖ రాశారు. ‘‘ఎనిమిదేళ్లుగా తెలంగాణను అన్ని రంగాల్లో భ్రష్టుపట్టించిన మీరు దేశాన్ని ఉద్ధరిస్తానంటూ ప్రజల సొమ్ముతో వివిధ రాష్ట్రాల్లో యాత్రలు చేయడం హాస్యాస్పదం. హైదరాబాద్‌లో నియంతృత్వాన్ని అమలు చేస్తూ ఢిల్లీలో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే తెలంగాణ సమాజం ఈసడించు కుంటోంది. ప్రజాస్వామ్య విలువలు, సామాజిక మార్పు కోసం మేధావులు, సామాజిక ఉద్యమ శక్తులు, అన్ని రంగాల నిపుణులతో రాష్ట్ర సలహా కమిటీని వేస్తామన్న మాట నీటి మూటగానే మిగిలింది. అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసి, నిరంకుశ పాలన సాగిస్తున్నారు. ప్రశ్నించిన వారిని అణిచి వేస్తూ పథకాల పేరుతో ప్రజా చైతన్యాన్ని నీరు గార్చే కుట్రలు చేస్తున్నది వాస్తవం కాదా? తెలంగాణ కోసం ప్రాణాలు త్యాగం చేసిన అమరులను అవమానిస్తున్నారు’’ అని కోదండరాం ఆ లేఖలో విమర్శించారు.

*9న మున్నూరుకాపు ఆత్మగౌరవ సభ: గంగుల
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్నూరు కాపు సంఘాలను ఏకతాటిపై తెచ్చేందుకు ఈనెల 9న నగరంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. అదేరోజు ఉదయం 7.40 గంటలకు హైదరాబాద్‌ కోకాపేటలో మున్నూరు కాపు ఆత్మగౌరవ భవన నిర్మాణ పూజ నిర్వహించనున్నామన్నారు. ఆదివారం మంత్రి కమలాకర్‌ నివాసంలో జరిగిన సమావేశంలో వివిధ జిల్లాల మున్నూరు కాపు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆత్మగౌరవ భవన నిర్మాణం, ఏకసంఘంగా ఏర్పడే ట్రస్ట్‌ విధి విధానాలు, భవిష్యత్తులో మున్నూరు కాపుల సంక్షేమం కోసం తీసుకోబోయే చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల ఐక్యంగా ఉండాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, రాష్ట్ర నాయకుడు, జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

*గ్రామాల అభివృద్ధికి నిధులన్నీ ఇచ్చాం: ఎర్రబెల్లి
రాష్ట్రంలోని గ్రామాల అభివృద్ధికి అందజేయాల్సిన నిధులన్నీ ఇచ్చామని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు చెప్పారు. రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాల్సిన రూ.800 కోట్ల నిధులు నిలిపివేసినట్లు ఆరోపించారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌(ఎస్‌) మండలంలోని ఏపూర్‌ గ్రామంలో ఆదివారం జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘గ్రామాల్లో మిషన్‌ భగీరథతో తాగునీరు, మిషన్‌ కాకతీయతో సాగునీరు, వ్యవసాయ రంగానికి రైతుబంధు, రైతు కుటుంబానికి రైతు బీమా, వృద్ధులకు పింఛన్‌, ప్రతి వీధికి సీసీరోడ్లు, పాఠశాలల్లో ఆంగ్ల బోధన, నాణ్యమైన విద్య, పల్లె ప్రకృతి వనాలు, శ్మశాన వాటికలు, హరితహారం వంటి కార్యక్రమాలు ప్రజల జీవన విధాన అభివృద్ధికి దోహదపడుతున్నాయి. ప్రతిపక్షాలు సర్పంచులకు లేనిపోని అపోహలు కల్పించి వారిని స్వార్థ రాజకీయాల్లోకి లాగుతున్నారు. కేంద్రం ఆడుతున్న నాటకాలను సర్పంచులు గమనించాలి’’ అని ఆయన అన్నారు.

*అరాచక రాష్ట్రంలో పెట్టుబడులు ఎలా!: పురందేశ్వరి
‘‘అప్పుల ఊబిలో కూరుకుపోయి కొట్టుమిట్టాడుతోన్న రాష్ట్రంలో అరాచక పరిస్థితులు పెచ్చుమీరాయి. ఇలాంటి వాతావరణంలో పరిశ్రమలు, పెట్టుబడులు ఎలా వస్తాయి? రాష్ట్రం విడిపోయి ఎనిమిదేళ్లయింది. అయినా రాజధాని లేని రాష్ట్రంలో మనం ఉన్నాం. ప్రధాన మంత్రిని రాష్ట్రాల సీఎం లు కలవడం తరచూ జరిగేదే. మోదీని, జగన్‌ కలవడంలో చర్చించుకోవాల్సింది ఏముంటుంది?’’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి ప్రశ్నించారు. ‘‘బీజేపీ, జనసేన మధ్య పొత్తు కొనసాగుతోంది. కరోనా వల్ల ప్రత్యక్షంగా కలిసి ఉమ్మడి కార్యక్రమాలు చేయలేకపోయాం. క్షేత్రస్థాయిలో కొంత మేరకు గ్యాప్‌ ఉంది. పైస్థాయిలో సమన్వయ లోపం లేదు. ఆత్మకూరు ఉప ఎన్నికల బరిలో బీసీ వర్గానికి చెందిన బీజేపీ అఽభ్యర్థి బరిలో దిగుతున్నారు’’ అని అన్నారు.

*మోదీకి జగన్‌ ముద్దుల కృష్ణుడు
ముఖ్యమంత్రి జగన్‌, దేశ ప్రధాని నరేంద్ర మోదీకి ముద్దుల కృష్ణుడిలా మారారు. జగన్‌ ఆంధ్రకి సీఎంగా ఉన్నా… ఎక్కువగా పొరుగున ఉన్న తెలంగాణకు, ప్రధాని మోదీకి ఉపయోగపడుతున్నారు’’ అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. విజయవాడలోని దాసరి భవన్‌లో ఆయన మాట్లాడారు. ‘‘జగన్‌ తెలుగుజాతి గౌరవాన్ని ఢిల్లీలో మోదీ మోకాళ్ల వద్ద తాకట్టు పెట్టారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలను ప్రభుత్వం వైసీపీ కార్యాలయాలుగా మార్చేస్తోంది. ఆ పార్టీ కార్యకర్తలను ఉపకులపతులుగా నియమిస్తున్నారు. ఆత్మకూరు ఉప ఎన్నికలపై నేను మాట్లాడితే టీడీపీకి అమ్ముడుపోయానని వైసీపీకి చెందిన కొంతమంది చిల్లరగాళ్లు మాట్లాడుతున్నారు. మాఫియా బెదిరింపులకే భయపడని మేము.. ఈ చిల్లరగాళ్ల బ్లాక్‌మెయిల్‌కు జంకబోము. వైసీపీ నిఘంటువులో ఉన్న పదాలను మాకు తగిలిస్తున్నారు. అమ్ముడుపోవడం, కొనుక్కోవడం వైసీపీ సంస్కృతి. దేశంలో మాఫియాకు ప్రధాని నరేంద్ర మోదీ లీడర్‌గా మారారు. సర్జికల్‌ స్ట్రైక్స్‌ జరిగి రెండేళ్లవుతున్నా ఏం సాధించారు? దేశంలోని సముద్ర తీరం మొత్తాన్నీ అదానీకి కట్టబెట్టడానికి మోదీ చూస్తున్నారు. కాంగ్రెస్‌ చిలక కొట్టుడు కొడితే… మోదీ ఏకంగా హోల్‌సేల్‌ వ్యాపారమే చేస్తున్నాడు. ఈ నెల 25న ఢిల్లీలో జరిగే కేంద్ర కమిటీ సమావేశంలో మొత్తం అన్ని అంశాలపైనా చర్చిస్తాం’’ అని నారాయణ తెలిపారు.

*కాపులను చంద్రబాబుకి తాకట్టు పెడుతున్నారు: మంత్రి కొట్టు
రాష్ట్రంలోని కాపు సామాజిక వర్గాన్ని చంద్రబాబుకి తాకట్టుపెట్టేలా జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ఆలోచిస్తున్నారని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివా్‌సతో కలిసి మాట్లాడారు. ‘‘వచ్చే ఎన్నికలకు ఎలా సన్నద్ధం కావాలో తెలియని ఆయోమయ స్థితిలో పవన్‌, ప్రజలకే రాజకీయ ఆప్షన్‌ ఇస్తున్నాడు. వెంటిలేటర్‌పై ఉన్న టీడీపీకి ఆక్సిజన్‌ అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. మహానాడుకు జన సమీకరణ చేసిన చంద్రబాబు… అది బలం అని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. బలం ఉంటే ఆత్మకూరులో పోటీకి దిగాలి. కోనసీమ అల్లర్లకు టీడీపీ, జనసేన బాధ్యత వహించి క్షమాపణ చెప్పాలి’’ అని వారు డిమాండ్‌ చేశారు.

*సంఘటితంగా మున్నూరు కాపులు: మంత్రి Gangula kamalakar
తెలంగాణలోని మున్నూరు కాపు సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయని, ఈ నెల 9న హైదరాబాదులోని కోకాపేటలో మున్నూరు కాపు ఆత్మగౌరవ భవన నిర్మాణానికి పూజ నిర్వహించుకుంటున్నట్టు బిసి, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. విద్య, వైద్యం, వ్యాపార తదితర రంగాల్లో మున్నూరు కాపుల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభల శక్తిగా ఎదుగుతున్నాయని చెప్పారు. ఆదివారం మంత్రి గంగుల నివాసంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిద మున్నూరు కాపు సంఘాలు సమావేశమై ఆత్మగౌరవ భవన నిర్మాణం, ఏకసంఘంగా ఏర్పడే ట్రస్ట్ విధి విధానాలు, భవిష్యత్తులో మున్నూరు కాపుల సంక్షేమం కోసం తీసుకోబోయే చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల ఐక్యంగా ఉండాల్సిన ఆవశ్యకతను వివరించారు.

*ప్రజల సమస్యలు చూస్తే బాధేస్తుంది.. Nadendla Manohar
 రాష్ట్రంలో ప్రజల సమస్యలు చూస్తే బాధేస్తుందని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి లోపించిందని, ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కడం, ప్రకటనలు ఇవ్వడానికి మాత్రమే పరిమితమయ్యారని ఆరోపించారు. సంక్షేమం కోసమే అప్పులు తీసుకొస్తున్నామని వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. వర్షాకాలం సమీపిస్తుండడంతో రోడ్లకు మరమ్మతులు చేయించాలని కోరారు. జగన్ అధికారంలోకి వచ్చాక 132 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, పులివెందులలోనే 13 మంది బలవన్మరణానికి పూనుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పనితీరు ప్రజలను ఇబ్బంది పెట్టేలా ఉందన్నారు.