DailyDose

సీఎం జగన్ ఓ శాడిస్ట్ – TNI తాజా వార్తలు

సీఎం జగన్ ఓ శాడిస్ట్ –  TNI  తాజా వార్తలు

* సీఎం జగన్ ఓ శాడిస్ట్ అని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శించారు. చోడవరంలో ‘ఎన్టీఆర్ స్ఫూర్తి.. చంద్రన్న భరోసా’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ సర్కార్‎పై అయ్యన్నపాత్రుడు ఫైర్ అయ్యారు. చంద్రబాబు పేరు చెబితే జగన్ భయపడుతున్నాడని ఎద్దేవా చేశారు. దొంగోడికి పోలీసులు కాపలా కాస్తున్నారని మండిపడ్డారు. కలెక్టర్లు, ఎస్పీలు ప్రభుత్వానికి తమ వంతు సాయం చేస్తున్నారని చెప్పారు. తమ కార్యక్రమాలకు గ్రామాల నుంచి వచ్చే వాహనాలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారని అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

* పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించకపోయినా జులై మూడో వారం నుంచి సభ కొలువు దీరనున్నట్లు సమాచారం. జులై మూడోవారం నుంచి ఆగస్టు రెండో వారం వరకు ఉభయసభలను సమావేశపర్చనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాష్ట్రపతి ఎన్నిక జరగనున్న జులై 18న వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 12 వరకు సభ కొనసాగించాలని పార్లమెంటరీ అఫైర్స్ కేబినెట్ కమిటీ నిర్ణయించినట్లు సమాచారం. సభ నిర్వాహణకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. మాన్ సూన్ సెషన్ లో ఉభయ సభలు 17 రోజుల పాటు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ సెషన్ లో పార్లమెంటరీ కమిటీ స్క్రూటినీకి పంపిన నాలుగు బిల్లులతో పాటు పలు బిల్లులు ఈసారి సభ ముందుకు రానున్నాయి.

*రాజధాని రైతులకు కౌలు చెల్లించాలంటూ దాఖలైన పిటీషన్‌‌పై హైకోర్టులో విచారణ జరిగింది. రైతులకు కౌలు ఎప్పుడులోగా చెల్లిస్తారో చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. ఏటా రైతులకు కౌలు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నారని పిటీషనర్‌ తరపు న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్‌ బాబు కోర్టు దృష్టికి తెచ్చారు. వ్యవసాయం మినహా వేరే వృత్తి చేతకాకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని కోర్టుకు తెలిపారు. దీంతో కౌలు ఎప్పుడు చెల్లిస్తారో చెబుతూ కౌంటర్‌ వేయాలని ప్రభుత్వాన్ని న్యాయమూర్తి ఆదేశిస్తూ విచారణ రెండు వారాలకు వాయిదా వేశారు.

*పదవ తరగతి ఫలితాలు వెలువడి వారం రోజులు దాటింది. ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంటర్మీడియట్‌లో తమకు నచ్చిన గ్రూపులో చేరడానికి సన్నద్ధం అవుతున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్‌ అడ్మిషన్లపై ఇంతరవరకూ ఎటువంటి నోటిఫికేషన్‌ జారీ చేయలేదు. ప్రవేశాలను గతేడాది మాదిరిగా ఆన్‌లైన్‌లో చేపడతారా? అంతకుముందు మాదిరిగా ఆఫ్‌లైన్‌లో చేపడతారా? అన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు కొన్ని ప్రైవేటు, కార్పొరేట్‌ కళాశాలలు ఇప్పటికే అడ్మిషన్లు చేపట్టి గోప్యంగా తరగతులు నిర్వహిస్తున్నాయి. ప్రైవేటు కార్పొరేట్‌ కళాశాలు ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలను ఇష్టారాజ్యంగా చేపడుతున్నాయంటూ రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల కిందట పలు నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. అన్ని యాజమాన్యాల పరిధిలోని జూనియర్‌ కళాశాల్లో అడ్మిషన్లు ఆన్‌లైన్‌ ద్వారా చేపట్టాలని గత ఏడాది ఆదేశించింది.

*బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఎంపీ సుజనాచౌదరి కలిశారు. ఏపీ సమస్యలను నడ్డా దృష్టికి సుజనాచౌదరి తీసుకెళ్లారు. విశాఖ రైల్వే జోన్‌ పనులు వేగవంతం చేయాలని, పోలవరం, రాజధాని నిర్మాణానికి సహకరించాలని సుజనాచౌదరి కోరారు. అలాగే రాష్ట్రంలో బీజేపీ పరిస్థితులపై నడ్డాతో సుజనాచౌదరి చర్చించారు.

*కర్నూలు: జిల్లా వైసీపీలో వర్గపోరు భగ్గుమంది. జిల్లాలోని గార్గేపురంలో ఎమ్మెల్యే సుధాకర్, ఇంచార్జ్ కోట్ల హర్ష వర్గాల మధ్య గతరాత్రి ఘర్షణ చోటు చేసుకుంది. గార్గేపురంలో గత కొంతకాలంగా ఎస్సీలు, అగ్రవర్ణాల మధ్య ఆధిపత్య గొడవలు నడుస్తున్నాయి. ఊర్లో ఓ ఫంక్షన్ విషయంలో వైసీపీ వర్గం ప్రశాంత్ కుటుంబంపై వినయ్ రెడ్డి వర్గం చేయి చేసుకుంది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్సీలు… రాత్రి వినయ్ రెడ్డి ఇంటిపై రాళ్లు కర్రలు, రాడ్లతో దాడి చేశారు. దాడిలో కారు, ట్రాక్టర్, ఇంటి సామగ్రి ధ్వంస అవగా… పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని రెండు వర్గాలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

*గ్రేటర్ హైదరాబాద్ లో పనిచేస్తున్న జర్నలిస్టులకు శిక్షణా తరగతులను ఈనెల 18, 19 తేదీలలో నిర్వహిస్తున్నట్టు తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ వెల్లడించారు. అలాగే హైదరాబాద్ లో ఉర్దూ జర్నలిస్టులకు జూన్ 25, 26 తేదీలలో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్టు తెలిపారు. బుధవారం మీడియా అకాడమీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.ఉర్దూ జర్నలిజం ప్రారంభమై 200 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్ని సంస్కృతులకు అలవాల మై ఉన్న హైదరాబాద్ లో అన్ని భాషలు ఆదరించ బడ్డాయి. ఉర్దూ పత్రికలు రెండు వందల సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తున్నట్లు గా తెలిపారు.

*బీసీ సంక్షేమ గురుకులాల్లో 6,7,8వ తరగతుల్లో సీట్ల భర్తీ కోసం ఈనెల 19న నిర్వహించే ప్రవేశ పరీక్ష హాల్ టిక్కెట్లు వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయని మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి మల్లయ్యబట్టు ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారంతా హాల్ టికెట్లను http://mjptbcwreis.telangana.gov.in వెబ్ సైట్ల నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన తెలిపారు. ప్రవేశ పరీక్ష, హాల్ టికెట్ కు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 040-23322377, 23328266 ఫోన్ నెంబరులో సంప్రదించాలన్నారు.

*కేసీఆర్ ఒక తుగ్లక్ ముఖ్యమంత్రి అని బీజేపీ నేత వివేక్‌ ధ్వజమెత్తారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో కమీషన్ల కొరకు ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టాడని ఆరోపించారు. భారత్ రాష్ట్ర సమితి గురించి కేసీఆర్ ఆలోచిస్తున్నారని తెలిపారు. కాళేశ్వరం వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వివేక్‌ డిమాండ్ చేశారు.

*‘తిరుపతి నగరాన్ని ఆనుకొని ఉన్న చంద్రగిరిలో పోలీస్‌ శాఖ స్థలాన్ని వైసీపీ కార్యాలయానికి రహస్యంగా ఇచ్చారు. పోలీస్‌ శాఖకు కేటాయించిన స్ధలాన్ని వైసీపీకి ఇవ్వడం ఏమిటి? అక్కడ ఒక ఎకరం ఖరీదు రూ. 30 కోట్లు ఉంటుంది. చీకటి జీవోలతో విలువైన స్ధలాలను వైసీపీ కొట్టేస్తోంది’ అని టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఆరోపించారు.

*ఆత్మకూరు ఉపఎన్నికకు పోస్టల్ బ్యాలెట్ సిద్ధమైంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్, ఇతర కేంద్ర బలగాల ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారానే తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 6 మండలాల్లో 150 మంది వృద్ధులు, 68 మంది వికలాంగులను అధికారులు గుర్తించారు. వీరికి ఎన్నికల అధికారుల సమక్షంలో.. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలింగ్ బాక్స్లో ఓటు వేసేలా ఏర్పాటు చేశారు.

*ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్‌ ప్రకటించింది. జూన్‌ 11నుంచి మొదలైన ఈ సేల్‌ 17వ తేదీవరకు కొనసాగనుంది. తాజాగా ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ 2022 సేల్‌లో ఫ్లిప్‌కార్ట్‌ ఆన్‌లైన్ వినియోగదారుల కోసం డీల్‌లు, డిస్కౌంట్లు, ఆఫర్‌లను అందిస్తోంది.

*తెలంగాణ అసెంబ్లీ ఎస్టీ వెల్ఫేర్ కమిటీ సమావేశం ఈనెల 21న జరుగుతుందని అసెంబ్లీ కార్యదర్శి డా.నరసింహా చార్యులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్ లో జరిగే సమావేశంలో ఎస్టీల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలతో పాటు హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పై తెలంగాణ ప్రభుత్వం ఎస్టీల కోసం అమలుచేస్తున్న వివిధ పధకాలపై చర్చించనున్నారు.

* రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుతో కామర్స్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ విజయసాయి రెడ్డి బుధవారం ఉదయం భేటీ అయ్యారు. ఈ సదర్భంగా కామర్స్ స్థాయి సంఘం నివేదికలను విజయసాయి సమ్పరించనున్నారు. అనంతరం…. బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ పర్యాటక స్థాయి సంఘం నివేదికల ప్రజంటేషన్‌ను ఇవ్వనున్నారు. ఈ నెలాఖరుతో రాజ్యసభ పదవీ కాలం ముగియనుండటంతో ఇప్పటి వరకు చర్చించిన అంశాలపై నివేదికలను రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడికి టీజీ వెంకటేష్ అందించనున్నారు.

*చిత్తూరు: జిల్లాలోని ఎస్ఆర్ పురం మండల పరిధిలో అటవీ ప్రాంతం నుంచి ఓ జింక జనారణ్యంలోకి వచ్చింది. జింకను చూసి వీధికుక్కలు దానిపై దాడి చేసి గాయపరిచాయి. వెంటనే స్థానికులు స్పందించి కుక్కల దాడి నుంచి జింకను రక్షించారు. గాయపడ్డ జింకకు తాత్కాలికంగా వైద్యం అందించిన స్థానికులు అనంతరం ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు.

*యాసంగి ధాన్యాన్ని మిల్లింగ్‌చేస్తే బియ్యం, నూక శాతం ఎంత ఉంటుందన్న అంశాన్ని అధ్యయనం చేస్తున్న మైసూర్‌ సెంట్రల్‌ ఫుడ్‌ టెక్నాలజీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(సీఎ్‌ఫటీఆర్‌ఐ) బృందం గురువారం రాష్ట్రానికి రానుంది. గత నెల 26న ఈ బృందం రాష్ట్రానికి వచ్చి ధాన్యం నమూనాలను మైసూర్‌ సీఎ్‌ఫటీఆర్‌ఐ ల్యాబ్‌కు తీసుకెళ్లి పరీక్ష చేసింది. ఇక్కడి మిల్లుల్లో కూడా పరీక్ష చేసిన తర్వాత వచ్చే బియ్యం, నూక, తౌడు, పొట్టు శాతాలను, ల్యాబ్‌ నివేదికతో పోల్చి చూస్తారు. అనంతరం నాలుగైదు రోజుల్లో నివేదిక ఇస్తారని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అనిల్‌ తెలిపారు.

*రాష్ట్ర వైద్య విద్య సంచాలకుల కార్యాలయంలో మరో ఉద్యోగిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇటీవల ఇక్కడ జూనియర్‌ అసిస్టెంట్‌ జాయింట్‌ డైరెక్టర్‌ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఘటనలు మరవక ముందే మంగళవారం మరొకరు అవినీతి నిరోధక శాఖకు దొరికిపోవడం విశేషం. డీఎంఈ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న జయకుమార్‌.. ఓ వ్యక్తి నుంచి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సయ్యద్‌ ఫయాజ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బాచుపల్లికి చెందిన తలారి కిషన్‌.. చనిపోయిన తన తండ్రికి సంబంధించిన మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ కోసం కోఠిలోని డీఎంఈ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే బిల్లు మంజూరు చేయాలంటే రూ.వేలు లంచమివ్వాలని జయకుమార్‌ డిమాండ్‌ చేశారు. తన వద్ద అంత డబ్బు లేదని ఇస్తానని చెప్పిన కిషన్‌.. ఏసీబీని ఆశ్రయించారు. మంగళవారం కోఠిలోని డీఎంఈ కార్యాలయంలో కిషన్‌ నుంచి జయకుమార్‌ తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

*ఏరువాక పౌర్ణమి వేళ తొలకరి వాన నేలమ్మను పలకరించడంతో అన్నదాతల ఆనందం ఆకాశాన్ని తాకింది. రైతులు హలాలు చేతబట్టి పొలాల్లోకి దిగగా గ్రామాల్లో సందడి నెలకొంది. ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో రైతులు పత్తి విత్తే పనిలో నిమగ్నం కాగా మరికొందరు దుక్కులు దున్నుతున్నారు. ఇక ఆదిలాబాద్‌ జిల్లా రైతులు మే నెల చివరిలోనే పత్తి సాగు మొదలుపెట్టగా.. శనివారం కురిసిన వర్షానికి పలువురి పొలాల్లో మొలకలు వచ్చాయి.

*రాష్ట్రంలో కొత్తగా ప్రైవేటు ఇంటర్మీడియట్‌ కళాశాలల స్థాపనకు త్వరలో నోటిఫికేషన్‌ ఇవ్వనున్నారు. అయితే ఈ జూనియర్‌ కాలేజీలకు అనుమతి ఇచ్చినా.. ఈ విద్యాసంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించేందుకు వీలుండదు. 2023-24 విద్యాసంవత్సరం నుంచి క్లాసులు ప్రారంభించుకునేలా అవకాశం కల్పిస్తారు. మరోవైపు హైస్కూల్‌ ప్లస్‌ పాఠశాలల్లో భాగంగా ఉన్నత పాఠశాల విద్యతో పాటు, ఇంటర్‌ విద్యను కూడా కలపనున్నారు. ఆ విధంగా రాష్ట్రంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో దాదాపు 700 హైస్కూళ్లలో ఇంటర్‌ విద్యను కూడా జోడిస్తారు. అయితే దశలవారీగా ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనిపై బుధవారం ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది.

*రాష్ట్ర మంత్రి మండలి ఈ నెల 22న ఉదయం 11 గంటలకు సమావేశం కానుంది. వెలగపూడి సచివాలయంలోని మంత్రివర్గ సమావేశ మందిరంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. సంబంధిత సమాచారాన్ని ఈ నెల 20వ తేదీ నాటికి అందించాలని అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరుగనున్న తరుణంలో పలు బిల్లులను మంత్రిమండలి ఆమోదించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

* బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ, తెలంగాణ ఉద్యమ కళాకారుడు దరువు ఎల్లన్నను మంగళవారం హయత్‌నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. అయితే నోటీసులు ఇస్తామని పోలీస్‌స్టేషన్‌కు రావాలని పిలిచి.. అదుపులోకి తీసుకోవడంతో వారు నిరసనకు దిగారు. బీజేపీ నేతలు పెద్దసంఖ్యలో పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో హయత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌కు వద్ద ఐదు గంటలపాటు హైడ్రామా నెలకొంది.

*రాష్ట్ర వైద్య విద్య సంచాలకుల కార్యాలయంలో మరో ఉద్యోగిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇటీవల ఇక్కడ జూనియర్‌ అసిస్టెంట్‌, జాయింట్‌ డైరెక్టర్‌ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఘటనలు మరవక ముందే మంగళవారం మరొకరు అవినీతి నిరోధక శాఖకు దొరికిపోవడం విశేషం. డీఎంఈ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న జయకుమార్‌.. ఓ వ్యక్తి నుంచి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సయ్యద్‌ ఫయాజ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బాచుపల్లికి చెందిన తలారి కిషన్‌.. చనిపోయిన తన తండ్రికి సంబంధించిన మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ రూ.82,164 కోసం కోఠిలోని డీఎంఈ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే, బిల్లు మంజూరు చేయాలంటే రూ.4వేలు లంచమివ్వాలని జయకుమార్‌ డిమాండ్‌ చేశారు. తన వద్ద అంత డబ్బు లేదని రూ.2,500 ఇస్తానని చెప్పిన కిషన్‌.. ఏసీబీని ఆశ్రయించారు. మంగళవారం కోఠిలోని డీఎంఈ కార్యాలయంలో కిషన్‌ నుంచి జయకుమార్‌ రూ.2,500 తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

*ఏపీ తరహాలో తెలంగాణ ఆర్టీసీకి వెయ్యి శ్రీవారి రూ.300 దర్శన టికెట్ల కోటాను ఖరారు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ డిపోల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సుల్లో టికెట్‌తో తిరుమల దర్శన టోకెన్లను కలిపి జారీచేసే విషయమై అధ్యయనం చేసేందుకు నాగర్‌కర్నూల్‌ డీవీఎం పి.రాము మంగళవారం తిరుపతి వచ్చారు. ఏపీలో అమలవుతున్న శ్రీవారి దర్శన కోటా కేటాయింపు విధానంపై అధికారులతో చర్చించారు. తరువాత టీటీడీ ఈడీపీ విభాగాన్ని సంప్రతించి దర్శన టికెట్ల కేటాయింపు సాఫ్ట్‌వేర్‌ను ఇవ్వాలని కోరారు. స్పందించిన ఆ విభాగం ఆర్డర్స్‌ కాపీని పరిశీలించి సాఫ్ట్‌వేర్‌ ఇవ్వడానికి అంగీరించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ నుంచి రోజూ దాదాపు 1,300 మంది భక్తులు ఆర్టీసీ బస్సుల్లో తిరుపతికి రాకపోకలు సాగిస్తున్నారన్నారు. టికెట్‌ ధరతో పాటు శ్రీవారి దర్శన టికెట్‌ రూ. 300లను కూడా కలిపి వసూలు చేయడమా లేక మరింత పారదర్శకంగా ఉండే విధానాలను అమలు చేయడమా అన్న అంశాలపై పరిశీలిస్తామన్నారు. అన్ని ఏర్పాట్లు సిద్ధమైన వెంటనే టికెట్ల మంజూరు తేదీని ప్రకటిస్తామని ఆయన చెప్పారు.

*రాష్ట్రంలో శాంతి భద్రతలపై రేపు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ పార్టీ అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తుంది. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం మినహా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు ఈ సమావేశానికి రావాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ కోరారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఫోన్ చేసి ఆహ్వానించారు. షర్మిల కూడా వస్తానని చెప్పారని రేవంత్ తెలిపారు.

*అభ్యంతరంలేని ప్రభుత్వ భూముల ఆక్రమణల క్రమబద్ధీరణ కోసం ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఆక్రమణదారులు క్రమబద్ధీకరణ కోసం రిట్‌ పిటిషన్లు దాఖలు చేసుకోవాలి తప్ప, పిల్‌ దాఖలు చేయడం ఏంటని పిటిషనర్‌ను ప్రశ్నించింది. ప్రతి వ్యవహారం పిల్‌ కిందకు రాదని స్పష్టం చేసింది. ఆక్రమణదారులు లక్షల సంఖ్యలో ఉండడంతో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశామన్న పిటిషనర్‌ వాదనను తోసిపుచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం 2017లో ఇచ్చిన జీవో 388కు అనుగుణంగా అభ్యంతరం లేని ఆక్రమణలను క్రమబద్ధీకరించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టివేసింది.

*‘ రాష్ట్రంలో వాస్తవ ఆర్థిక పరిస్థితిని మరుగునపెట్టి తప్పుడు లెక్కలతో అటు కేంద్ర ప్రభుత్వాన్ని, ఇటు రాష్ట్ర ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోంది. విచ్చలవిడిగా అధికవడ్డీలకు అప్పులు తెస్తూ రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతోంది. ఒక తప్పును సరిదిద్దేందుకు మరో తప్పు చేస్తూ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న రుణాలు, ఉపయోగిస్తున్న నిధులపై కేంద్ర ప్రభుత్వం, నీతిఆయోగ్‌, రిజర్వ్‌బ్యాంక్‌తో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు, అందించిన నివేదికలు, ఆ సంస్థలు ఇచ్చిన ఆదేశాలు, అందులో రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసినవి, చేయనివాటి వివరాలను బహిర్గతం చేయాలి’ అని శాసనమండలి ప్రతిపక్ష నేత, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు డిమాండ్‌ చేశారు.

*‘నాడు తెలుగుదేశం ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ పథకాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నదంటూ అవాస్తవ ప్రచారం చేసిన జగన్‌రెడ్డి నేడు రైతుల మెడకు మీటర్ల ఉరితాడు బిగిస్తున్నారు’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. ప్రతిపక్షంలో ఉండగా జగన్‌రెడ్డి ఏమన్నారు…ఇప్పుడేమంటున్నారు? అన్న వీడియోలను మంగళవారం లోకేశ్‌ విడుదల చేశారు. కాగా, ‘దళిత యువకుడు సుబ్రహ్మణ్యంను అత్యంత కిరాతకంగా చంపిన ఎమ్మెల్సీ అనంతబాబుకి పాలాభిషేకం చేయించారు సీఎం జగన్‌రెడ్డి. జైల్లో సకల సౌకర్యాలు, బయట ఫ్లెక్సీలతో ఊరేగింపులు చూస్తుంటే దళితులపై సాగుతున్న దమనకాండ అంతా జగన్‌రెడ్డి కనుసన్నల్లోనే జరుగుతోందని స్పష్టమవుతోంది. ఇందుకూరుపేటలో అనంతబాబుని హీరోగా కీర్తిస్తూ వైసీపీ ఊరేగింపు నిర్వహించడం చూశాక, ఈ ప్రభుత్వంలో నిందితులకు రక్ష, బాధితులకు శిక్షేనని మరోసారి రుజువైంది’ అని లోకేశ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

* రక్తదానం ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ గుర్తించి రక్తదానాన్ని చేయడమే కాకుండా ఇతరులను కూడా ప్రోత్సహించాలని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖమంత్రి విడదల రజని అన్నారు. ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ, ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ సంయుక్త భాగస్వామ్యంతో అమరావతిలోని వర్సిటీలో మంగళవారం ఉదయం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి రజని ప్రసంగిస్తూ స్వచ్ఛంద రక్తదానం చేసేందుకు విద్యార్థులు ముందుకు రావాలన్నారు. వర్సిటీ ప్రో వైస్‌ ఛాన్సలర్‌ ఆచార్య డీ. నారాయణరావు తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ప్రేమ్‌కుమార్‌, ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ గుంటూరు చాఫ్టర్‌ చైర్మన్‌ రామచంద్రరాజు, గుంటూరు యూత్‌ సర్వీసెస్‌ సీఈవో వి. శ్రీనివాసరావు, ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ ఎన్‌ఎ్‌సఎస్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ లక్ష్మణరావు, డీన్‌ ప్రొఫెసర్‌ బీవీ బాబు తదితరులు పాల్గొన్నారు.

* ఓ ఎస్‌ఐ మానవత్వాన్ని చాటుకున్నారు. అనాథ శవాన్ని పారిశుధ్య కార్మికుడి సాయంతో పొలాల్లో నుంచి మోసుకుంటూ రెండు కిలోమీటర్ల దూరంలోని రహదారిపైకి చేర్చారు. ఈ సంఘటన అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేట మండలంలో జరిగింది. ఎల్‌.సింగవరం రెవెన్యూ పరిధిలో గుర్తుతెలియని యువకుడి మృతదేహం ఉన్నట్టు మంగళవారం పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం అందింది. ఎస్‌ఐ బి.రామకృష్ణ, కానిస్టేబుల్‌ పైడిరాజు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. మృతదేహాన్ని అక్కడ నుంచి తరలించేందుకు ఎవరూ ముందుకురాలేదు. దాంతో ఎస్‌ఐ రామకృష్ణ కర్రలు, కొబ్బరి మట్టల సాయంతో పాడే తయారు చేయించారు. దానిపై మృతదేహాన్ని ఉంచి ఓ పారిశుధ్య కార్మికుడి సహకారంతో స్వయంగా మోసుకుంటూ పొలాల్లోంచి రెండు కిలోమీటర్ల దూరంలో గల రహదారిపైకి చేర్చారు. అక్కడి నుంచి ఆటోలో అనకాపల్లి ఎన్టీఆర్‌ ఏరియా ఆస్పత్రికి తరలించి మార్చురీలో భద్రపర్చారు.

*జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై సీబీఐ, ఈడీ కేసులు లేవు కాబట్టి రాజకీయాలకు అవసరం లేదా? అని జనసేన పీఏసీ సభ్యుడు చిలకం మధుసూధన్‌రెడ్డి సీఎం జగన్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పవన్‌, చంద్రబాబు రాజకీయాలకు అవసరమా? అన్న జగన్‌ వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. జగన్‌ మాదిరిగా సీబీఐ కేసులు, ఈడీ కేసులు, అక్రమ కేసులు ఉంటేనే రాజకీయాలకు అవసరమా? అని ప్రశ్నించారు. రైతుల పేరు చెప్పి అబద్ధాలు మాట్లాడడం, అసత్యాలు చెప్పడం సీబీఐ దత్తపుత్రుడికే చెల్లిందని ఆరోపించారు. పవన్‌ను తిట్టడం కోసం కోట్లు ఖర్చు పెట్టి అనంతపురం రావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. మీడియా, పత్రికలు, ప్రతిపక్షాల మీద ఆరోపణలు చేసుకుంటూనే జగన్‌ కాలం గడుపుతున్నారని, దీనిని ప్రజలంతా గమనిస్తున్నారని చెప్పారు. జగన్‌ పెట్టిన పథకం ఏదీ సరిగ్గా అమలు కావడం లేదని ఆరోపించారు. ‘పవన్‌ కళ్యాణ్‌ 200 మంది కౌలు రైతులను పరామర్శించి సహాయం పంపిణీ చేశారు. వారంతా కౌలు రైతులు కాదని జగన్‌ అంటున్నారు. మీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవర్ని పంపిస్తారో పంపించండి. వాళ్లలో ఏ ఒక్కరైనా కౌలు రైతు కాదని నిరూపించండి’ అని సవాల్‌ విసిరారు.

*నవరత్నాలు పేరిట రాష్ట్ర ప్రభుత్వం అవినీతి పాలన సాగిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో గరీబ్‌ కళ్యాణ్‌ సమ్మేళన్‌ పేరిట నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ‘కేంద్రం వంద నవరత్నాలు ఇస్తుంటే రాష్ట్రం తొమ్మిది నవరత్నాలు ఇచ్చి అవినీతి పాలనకు పాల్పడుతోంది. మోదీ గరీబ్‌ కళ్యాణ్‌ యోజన కింద బియ్యం పంపిణీ చేస్తుంటే వాటిని తామే ఇస్తున్నట్టుగా రాష్ట్రం గొప్పగా చెప్పుకుంటోంది. ఇంటింటికి కొళాయిలు ఇవ్వాలని కేంద్రం సూచిస్తే 23 లక్షల కొళాయిలు వేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఇదో పెద్ద కుంభకోణం. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి 420, 720 పేర్లు పెట్టి సొంతంగా మద్యం తయారు చేసి విక్రయిస్తున్నారు. మద్యం షాపుల్లో పేటీఎం విధానం ఎందుకు ప్రవేశపెట్టలేదు. నిరుద్యోగులకు ఎందుకు ఉపాధి చూపడం లేదు. వైసీపీ పాలనలో అన్ని రంగాల వారిని మోసం చేస్తున్నారు’ అని సోము వీర్రాజు ధ్వజమెత్తారు.

*ప్రధానమంత్రి మోదీ అనేక సంక్షేమ పథకాల కోసం రాష్ట్రానికి రూ.కోట్లు ఇస్తుంటే వాటిని సీఎం జగన్‌ సొంత ఖాతాకు మళ్లించేస్తున్నార ని, జగన్‌ను బీజేపీ ఓ కలుపుమొక్కలా చూస్తోందని మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి తెలిపారు. బీజేపీ ఎనిమిదేళ్ల పాలనపై కడప జిల్లా మైదుకూరులో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఆవాస్‌ యోజన కింద గృహ నిర్మాణానికి కేంద్రం నిధులు మంజూరు చేస్తే వాటిని నేనే నిర్మిస్తా అంటూ నిధులు సొంత ఖాతాలో వేసుకుని ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదన్నారు. ఓట్ల కోసం కోడి కత్తి, బాబాయ్‌ హత్య హైడ్రామాలు నడపడం జగన్‌కు పరిపాటిగా మారిందని తెలిపారు. జగన్‌.. ఢిల్లీలో చెంచాగిరీ చేస్తూ ఇక్కడ దాదాగిరీ చేస్తున్నాడన్నారు.

*రాష్ట్రంలో మున్సిపల్‌ కార్మికుల సమస్యలపై జూన్‌ 29 తరువాత ఎప్పుడైనా సమ్మె చేపట్టనున్నట్లు ఏఐటీయూసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎ.రంగనాయకులు వెల్లడించారు. సీడీఎంఏ కమిషనర్‌ ప్రవీణ్‌ కుమార్‌కు వడ్డేశ్వరంలోని కార్యాలయంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మంగళవారం సమ్మె నోటీసును అందజేశారు. అనంతరం మాట్లాడుతూ గత ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్న హెల్త్‌ అలవెన్స్‌లు, సరెండర్‌ లీవ్‌ల ఎంక్యా్‌షమెంట్‌లను విడుదల చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 12 గంటల పని విధానం నిలిపివేయాలని, తదితర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

*కాకినాడ జిల్లా పిఠాపురంలోని విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో మంగళవారం జరిగిన ఏరువాక పౌర్ణమి కార్యక్రమం లో సీబీఐ విశ్రాంత జేడీ వీవీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. పొలాన్ని ట్రాక్టర్‌తో దుక్కి దున్నారు. యువతను వ్యవసాయం చేసే విధంగా ప్రోత్సహించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయదారుడు మృత్యుంజయ, ఏడుకొండలు, హుస్సేన్‌షా తదితరులు పాల్గొన్నారు.

*ఏపీ తరహాలో తెలంగాణ ఆర్టీసీకి వెయ్యి శ్రీవారి రూ.300 దర్శన టికెట్ల కోటాను ఖరారు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ డిపోల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సుల్లో టికెట్‌తో తిరుమల దర్శన టోకెన్లను కలిపి జారీచేసే విషయమై అధ్యయనం చేసేందుకు నాగర్‌కర్నూల్‌ డీవీఎం పి. రాము మంగళవారం తిరుపతి వచ్చారు. సెంట్రల్‌ బస్టేషన్‌లోని రిజర్వేషన్‌ కౌంటర్‌కు చేరుకుని ఏపీలో అమలవుతున్న శ్రీవారి దర్శన కోటా కేటాయింపు విధానంపై అధికారులతో చర్చించారు. తరువాత టీటీడీ ఈడీపీ విభాగాన్ని సంప్రదించి దర్శన టికెట్ల కేటాయింపు సాఫ్ట్‌వేర్‌ను ఇవ్వాలని కోరారు. స్పందించిన ఆ విభాగం ఆర్డర్స్‌ కాపీని పరిశీలించి సాఫ్ట్‌వేర్‌ ఇవ్వడానికి అంగీరించారు.

*పంటలు పండించినా గిట్టుబాటు ధర రానందున క్రాప్‌ హాలీడే పాటించాలని గుంటూరు జిల్లా అమృతలూరు మండలంలోని గోవాడ రైతులు నిర్ణయం తీసుకున్నారు. గ్రామ రైతులంతా మంగళవారం స్థానిక కమ్యూనిటీ హాలులో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత ఏడాది పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని, ప్రస్తుతం పెసరకు కూడా గిట్టుబాటు ధర లేదని, దీనికితోడు కాల్వలు, డొంకలు అధ్వాన్నంగా ఉండటంతో వ్యవసాయం తలకు మించిన భారంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.

*వైసీపీ నేతల బరితెగింపు పరాకాష్టకు చేరింది. మట్టి అక్రమ తవ్వకాలను ప్రశ్నించిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గ్రామ మహిళా సర్పంచ్‌ పట్ల కీచక పర్వం సాగించారు. గుంటూరు జిల్లా వంగిపురంలో ఆదివారం వైసీపీ నాయకులు అక్రమ మట్టి తవ్వకాలు మొదలు పెట్టారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్‌, దళిత నాయకురాలు శిఖా విజయలక్ష్మి తన కుటుంబసభ్యులతో కలిసి చెరువు వద్దకు వెళ్లి పంచాయతీ అనుమతి లేకుండా మట్టి తవ్వకాలు ఎలా మొదలుపెడతారని ప్రశ్నించింది. ‘మా ఇష్టం వచ్చినట్టు తవ్వుకుంటాం.అడగడానికి నువ్వెవరు?’’ అంటూ వైసీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. ఆమె ప్రైవేటు పార్టులపై చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో సర్పంచ్‌తోపాటు కుటుంబ సభ్యులు భయంతో పోలీసులను ఆశ్రయించారు. అక్కడి నుంచి గ్రామానికి వెళ్లడానికి భయపడి టీడీపీ జిల్లా కార్యాలయంలో తలదాచుకున్నారు.

*ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత నీరజ్‌ చోప్రా.. జాతీయ రికార్డు ప్రదర్శనతో రజత పతకం సాధించాడు. ఫిన్‌లాండ్‌లో జరుగుతున్న పావో నుర్మి క్రీడల్లో భారత జావెలిన్‌ త్రోయర్‌ చోప్రా 89.03 మీటర్లు విసిరి రెండో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో టోక్యో ఒలింపిక్స్‌ లో తాను నెలకొల్పిన జాతీయ రికార్డు 87.58 మీటర్లను తానే అధిగమించాడు. విశ్వక్రీడల తర్వాత అంతర్జాతీయ ఈవెంట్‌లో నీరజ్‌ పాల్గొనడం ఇదే తొలిసారి. ఆలివర్‌ హెలాండర్‌ (ఫిన్‌లాండ్‌) స్వర్ణం నెగ్గగా, అండర్సన్‌ పీటర్స్‌ (గ్రెనెడా) కాంస్యం దక్కించుకున్నాడు.

*ఏఎఫ్‌సీ ఆసియా కప్‌ క్వాలిఫయర్స్‌ టోర్నీలో భారత ఫుట్‌బాల్‌ జట్టు అదరగొట్టింది. మంగళవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 4-0తో హాంకాంగ్‌ను చిత్తుచేసి గ్రూప్‌-డిలో టాపర్‌గా నిలిచింది. తద్వారా ఆసియా కప్‌ ఫైనల్స్‌కు భారత్‌ అర్హత సాధించింది. హాంకాంగ్‌తో పోరులో భారత్‌ తరఫున అన్వర్‌ (2వ), సునీల్‌ ఛెత్రి (45వ), మన్వీర్‌ (85వ), పండిట్‌ (90+3వ) గోల్స్‌ కొట్టారు. గ్రూప్‌-డిలో మూడు విజయాలతో భారత్‌ 9 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. హాంకాంగ్‌ 6 పాయింట్లతో రెండోస్థానంలో ఉంది.

*కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్‌ చేసే క్రమంలో భారీగా బోగస్‌ సర్టిఫికెట్లు వెలుగులోకి వస్తున్నాయి. గుర్తింపులేని యూనివర్సిటీలు, అనుమతి లేని కాలేజీల నుంచి సర్టిఫికెట్లను సమర్పించి కొంతమంది కాంట్రాక్టు లెక్చరర్లుగా కొనసాగుతున్నట్టు అధికారులు గుర్తించారు. అలాంటివారిపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇంటర్మీడియట్‌ బోర్డు పరిధిలో 3,854 మంది జూనియర్‌ లెక్చరర్లు, డిగ్రీ కాలేజీల్లో 812 మంది లెక్చరర్లు, మరో 432 మంది లెక్చరర్లు పాలిటెక్నిక్‌ కాలేజీల్లో కాంట్రాక్ట్‌ పద్ధతిలో పనిచేస్తున్నారు. వీరందరినీ రెగ్యులరైజ్‌ చేయనున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్‌ గతంలో ప్రకటించారు. ఈ మేరకు అధికారులు జాబితాను రూపొందిస్తున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా కాంట్రాక్టు లెక్చరర్లు సమర్పించిన సర్టిఫికెట్లను పరిశీలిస్తున్నారు. కాంట్రాక్టు లెక్చరర్లు సుమారు 60 యూనివర్సిటీల నుంచి సరిఫికెట్లను సమర్పించినట్టు గుర్తించారు. అయితే వాటిలో కొన్ని యూనివర్సిటీలకు యూజీసీ గుర్తింపు లేదు.

*కోనసీమ జిల్లా అమలాపురంలో గత నెల 24న జరిగిన అల్లర్ల కేసుల్లో వైసీపీకి చెందిన నలుగురు కీలక నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆనాటి ఘటనలో మంత్రి పినిపే విశ్వరూప్‌, ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్‌కుమార్‌ ఇళ్లకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో వైసీపీకి చెందిన కీలక నేతలు ఉన్నారని మంత్రి విశ్వరూప్‌ గతంలోనే ప్రకటించారు. దీనిపై విచారణ చేసిన పోలీసులు వైసీపీకి చెందిన కీలక నాయకులను గుర్తించి వారిపై మంగళవారం కేసులు నమోదు చేశారు. అమలాపురం పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్‌ వాసంశెట్టి సత్యం, ప్రస్తుత కౌన్సిలర్‌ కృష్ణకుమారి తనయుడు, వైసీపీ యువ నేత వాసంశెట్టి సుభాశ్‌, మాజీ కౌన్సిలర్‌ భర్త, వైసీపీ బీసీ సెల్‌ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు మట్టపర్తి మురళీకృష్ణ, మంత్రి విశ్వరూప్‌ అనుచరుడైన రాయుడు సత్యరుషి, మట్టపర్తి రఘులను అల్లర్ల కేసులో నిందితులుగా చేర్చారు. ఈ అల్లర్ల కేసుల్లో ఏ222గా ఉన్న పట్టణానికి చెందిన చీకట్ల వీరవెంకటసత్యప్రసాద్‌ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ నలుగురిపై కేసులు నమోదు చేశారు. వాసంశెట్టి సుభాశ్‌ కౌన్సిలర్‌ అయిన తన తల్లిని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చేసేందుకు గతంలో చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అప్పటి నుంచి విశ్వరూ్‌పకు, సుభాశ్‌కు మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి. కోనసీమ జిల్లా సాధన సమితి అధ్యక్షుడి హోదాలో మట్టపర్తి మురళీకృష్ణ అంబేడ్కర్‌ జిల్లా పేరును వ్యతిరేకిస్తూ గత నెల 24న ఆందోళనకు పిలుపు ఇచ్చిన దృష్ట్యా ఆయన్ను ఈ కేసుల్లో బాధ్యులను చేసినట్టు సమాచారం.

*హైదరాబాద్‌ నగరంలో శాంతి భద్రతలు’ అనే అంశంపై టీపీసీసీ ఆధ్వర్యంలో బుధవారం అఖిలపక్ష పార్టీల సమావేశం జరగనుంది. సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కాంగ్రెస్‌, టీడీపీ, టీజేఎస్‌, బీఎస్పీ, వామపక్షాలు, ఆప్‌, వైఎ్‌సఆర్టీపీ, తెలంగాణ ఇంటి పార్టీ, లోక్‌ససత్తా తదితర పార్టీల ప్రతినిధులు, ప్రజాస్వామిక, సామాజిక సంస్థలు, మహిళా సంఘాలు, మేధావులు, పాత్రికేయ ప్రముఖులు పాల్గొంటారు. ఈ సమావేశానికి రావాలంటూ వైఎ్‌సఆర్‌టీపీ అధినేత్రి షర్మిల, టీ టీడీపీ అధ్యక్షుడు నర్సింహులు, సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు చాడ వెంకట్‌రెడ్డి, తమ్మినేని వీరభద్రం, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, ఇతర పార్టీల అధ్యక్షులకు రేవంత్‌రెడ్డి స్వయంగా ఫోన్లు చేసి ఆహ్వానించారు. ఇలాంటి అంశాల్లో పార్టీలకు అతీతంగా వ్యవహరించాలన్నదే తమ విధానమని, పాదయాత్రలో ఉన్న తాను రాలేక పోతున్నానని, తన తరపున పార్టీ ప్రధాన కార్యదర్శి టీ. దేవేందర్‌ను పంపిస్తున్నట్లు షర్మిల రేవంత్‌కు చెప్పారు. మిగిలిన పార్టీల అధ్యక్షులూ సానుకూలంగా స్పందించారు. కాగా, రాష్ట్రంలో మద్యం మత్తులో హత్యలు, అత్యాచారాలను దాటి.. పోలీసు వాహనాలపై దాడులు చేసే పరిస్థితి వచ్చిందని రేవంత్‌రెడ్డి మంగళవారం ట్విటర్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. ఆసి్‌ఫనగర్‌లో కొందరు పోలీసు వాహనం ఎక్కి వీరంగం చేశారని, ఆ వాహనం అద్దాలనూ ధ్వంసం చేశారని పేర్కొన్నారు. ఈ నగరాన్ని, పాలనను ఇలాగే వదిలేద్దామా? అంటూ నగర ప్రజలను ప్రశ్నించారు. దీనిపై పౌరసమాజం ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తూ పోలీసు వాహనంపై జరిగిన దాడి వీడియోను పోస్ట్‌ చేశారు.

*మూడో రోజు కాంగ్రెస్‌ నిరసన దీక్ష కొనసాగుతోంది. రాహుల్‌ గాంధీని మూడో రోజు ఈడీ విచారణకు పిలిచినందుకు నిరసనగా కాంగ్రెస్‌ దీక్ష నిర్వహిస్తోంది. రెండు రోజులు ఈడీ కార్యాలయం ముందు నిరసన దీక్ష చేసిన తెలంగాణ కాంగ్రెస్‌.. ఇవాళ గాంధీభవన్‌లో మొదలైన తెలంగాణ కాంగ్రెస్‌ నిరసన దీక్షలో పాల్గొన్నారు. జగ్గారెడ్డితో పలువురు నాయకులు అఖిలపక్ష సమావేశం అనంతరం దీక్షలో పాల్గొననున్నారు.

*ఢిల్లీ జంతర్ మంతర్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు గ్రామాల బాధితులు బుధవారం ఆందోళనకు దిగారు. చెన్నూరు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల రైతులు ఆందోళనలో పాల్గొన్నారు. బాధితుల ఆందోళనకు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి మద్దతు ఇచ్చారు. ప్రతి ఏటా కాళేశ్వరం బ్యాక్ వాటర్‌తోవేల ఎకరాలకు నష్టం జరుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ బాధితులు నిరసన చేపట్టారు.