DailyDose

ఆషాఢ‌ బోనాలు తెలంగాణ సంస్కృతిని తెలియ‌జేస్తాయి

ఆషాఢ‌ బోనాలు తెలంగాణ సంస్కృతిని తెలియ‌జేస్తాయి

ఆషాఢ బోనాలు తెలంగాణ సంస్కృతిని తెలియ‌జేస్తాయ‌ని రాష్ట్ర ప‌శుసంవ‌ర్థ‌క‌, మ‌త్స్య‌, పాడి ప‌రిశ్ర‌మ‌ల అభివృద్ధి, సినిమాటోగ్ర‌ఫీ శాఖ‌ల మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్‌యాద‌వ్ పేర్కొన్నారు. శనివారం ఆయ‌న‌ కార్వాన్‌లోని దర్బార్ మైసమ్మ ఆలయం వద్ద ఈ నెల 24 వ తేదీన జరిగే బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సందర్భంగా మంత్రి త‌ల‌సాని మాట్లాడారు. కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్ల‌పాటు బోనాల పండుగ‌ను జ‌రుపుకోలేద‌న్నారు. ఈ ఏడాది బోనాలను ఘనంగా నిర్వహించాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేర‌కు భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. 25వ తేదీన నిర్వ‌హించే అంబారీపై అమ్మవారి ఊరేగింపు ఉత్స‌వం ఖర్చును తెలంగాణా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ఈ ఖ‌ర్చును గ‌తంలో ఆలయ కమిటీ సభ్యులే భరించే వారని తెలిపారు.

దర్బార్ మైసమ్మ ఆలయం వద్ద భక్తులు ఎలాంటి తోపులాటకు గురికాకుండా పటిష్టమైన బారికేడ్ల‌ను ఏర్పాటు చేస్తున్నామ‌ని మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్‌యాద‌వ్ తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా జనరేటర్ల‌ను అందుబాటులో ఉంచుతామ‌న్నారు. ఆలయ పరిసరాల్లో ఎలాంటి సీవరేజ్ లీకేజీలు లేకుండా చూడాలని ఆదేశించారు. వాటర్ వర్క్స్ ఆధ్వర్యంలో భక్తుల కోసం 2 లక్షల వాటర్ ప్యాకెట్స్‌ను అందుబాటులో ఉంచుతామ‌న్నారు. వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో మూడు వైద్య ఆరోగ్య శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను మంత్రి ఆదేశించారు.

భక్తులు ఇబ్బందులకు గురికాకుండా ట్రాఫిక్ డైవర్షన్‌కు చర్యలు తీసుకోవాలని మంత్రి త‌ల‌సాని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల ఉత్సవాలను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. బోనాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం రూ. 15 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. సుమారు 3,500కు పైగా దేవాలయాలకు ప్రభుత్వం బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం ఆర్ధిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. 24వ తేదీన బోనాలు నిర్వహించే దేవాలయాలకు రెండు మూడు రోజుల్లో ఆర్థిక సహాయం చెక్కుల‌ను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు.

బోనాల పోస్ట‌ర్‌, సీడీని ఆవిష్కరించిన మంత్రి
సబ్జి మండి లోని శ్రీ నల్లపోచమ్మ, శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వివిధ శాఖల అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోనాల ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్, పాటల సీడీని ఆవిష్కరించారు. బోనాల ఉత్సవాల సందర్భంగా ఆలయ పరిసరాల్లో చేపట్టాల్సిన‌ అభివృద్ధి పనులు ఏమైనా ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాల‌ని నిర్వాహ‌కుల‌కు మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ప్రభాకర్‌రావు, దర్బార్ మైసమ్మ ఆలయ చైర్మన్ అమర్‌సింగ్‌, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకట్, డీసీపీ జోయల్ డేవిస్, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ రవికిరణ్, వాటర్ వర్క్స్ ఈఎన్సీ కృష్ణ, జీఎం నాగేందర్, టూరిజం సీఈ రమణ, పలు శాఖలకు చెందిన ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.