Politics

తెరాస..భాజపా దోస్తీ ఎన్నికలప్పుడే కుస్తీ డ్రామా-రాహుల్ గాంధీ..

తెరాస..భాజపా దోస్తీ ఎన్నికలప్పుడే కుస్తీ డ్రామా-రాహుల్ గాంధీ..

భాజపాను పార్లమెంట్‌లో తెరాస ఎన్నోసార్లు సమర్థించిందని కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. భారత్‌ జోడో యాత్రలో భాగంగా నెక్లెస్‌రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో రాహుల్‌ మాట్లాడారు.
ఎన్నో సందర్భాల్లో తెరాస, భాజపా కలిసి పనిచేశాయి. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం రెండు పార్టీలు పరస్పర విమర్శలు చేసుకుంటున్నట్లు నాటకాలాడుతున్నాయి. కేసీఆర్‌ ఫోన్‌ చేసిన మరుక్షణమే ప్రధాని మోదీ స్పందిస్తారు. ఈ రెండు ప్రభుత్వాలు ఎప్పుడూ రైతులకు అండగా నిలవలేదు. వాటి వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదు. దేశంలో యువతకు ఉద్యోగాలు లభించట్లేదు. ఇంజినీరింగ్‌ చేసిన వాళ్లు స్విగ్గీలో పనిచేస్తున్నారు. ఎయిర్‌పోర్టులు, ఎల్‌ఐసీ, టెలికాం వంటి ప్రభుత్వరంగ సంస్థలను మోదీ ప్రభుత్వం కారుచౌకగా అమ్మేస్తోంది. నోట్ల రద్దు వల్ల చిన్నవ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. సీఎం కేసీఆర్‌ దృష్టి ఎప్పుడూ ధరణి పోర్టల్‌ మీదే ఉంటుంది… ఆక్రమించడానికి భూములు ఎక్కడ ఉన్నాయో అని చూస్తుంటారు” అని రాహుల్‌ గాంధీ విమర్శించారు.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ… ” 55 రోజులుగా రాహుల్‌గాంధీ పాదయాత్ర చేస్తున్నారు. కృష్ణానది పరవళ్లు తొక్కినట్టు ప్రజలంతా పాదయాత్రలో కదం కదం కలిపారు. చార్మినార్‌ ప్రాంతంలో దిక్కులు పెక్కటిల్లేలా లక్షలాది మంది రాహుల్‌గాంధీకి స్వాగతం పలికారు. మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడి హోదాలో మొదటిసారి హైదరాబాద్‌ వచ్చారు. అత్యంత సామాన్యుడుప్రజాస్వామ్యయుతంగా జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షుడయ్యారు. వారికి అఖండమైన స్వాగతం పలుకుతున్నాం” అని రేవంత్‌ అన్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పలువురు సీనియర్‌ నేతలు సమావేశంలో పాల్గొన్నారు.