Politics

ఆరు రాష్ట్రాలు, ఏడు స్థానాలు… బీజేపీకి ప్రాంతీయ పార్టీల గట్టి పోటీ

ఆరు రాష్ట్రాలు, ఏడు స్థానాలు… బీజేపీకి ప్రాంతీయ పార్టీల గట్టి పోటీ

ఆరు రాష్ట్రాల్లోని ఏడు శాసన సభ స్థానాలకు ఈ నెల 3న జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ మూడింటిని కైవసం చేసుకుంది. అయితే ప్రాంతీయ పార్టీల నుంచి ఆ పార్టీకి గట్టి పోటీ ఎదురైంది. తెలంగాణాలో టీఆర్ఎస్, ఉత్తర ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, బిహార్‌లో ఆర్జేడీ, ఒడిశాలో బీజేడీ పార్టీలు బీజేపీని తీవ్రంగా ప్రతిఘటించాయి.

ఉత్తర ప్రదేశ్‌లోని గోలా గోకరణ్‌నాథ్ శాసన సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అమన్ గిరి తన సమీప ప్రత్యర్థి, సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి వినయ్ తివారీపై దాదాపు 34,000 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఆయన తండ్రి అరవింద్ గిరి మరణంతో ఈ ఉప ఎన్నికలు జరిగాయి. దీంతో బీజేపీ తన స్థానాన్ని తాను నిలుపుకోగలిగింది.

బిహార్‌లోని గోపాల్ గంజ్ శాసన సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి కుసుమ్ దేవి (Kusum Devi) విజయం సాధించారు. బీజేపీ ఎమ్మెల్యే సుభాశ్ సింగ్ మరణించడంతో గోపాల్‌గంజ్ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. ఆయన సతీమణి కుసుమ్ దేవి పోటీ చేశారు. దీంతో బీజేపీ తన స్థానాన్ని తాను నిలబెట్టుకున్నట్లయింది.

హర్యానాలోని అదంపూర్ శాసన సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి భవ్య బిష్ణోయ్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి జై ప్రకాశ్‌పై ఘన విజయం సాధించారు. భజన్ లాల్ కుమారుడు కుల్‌దీప్ బిష్ణోయ్ ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, బీజేపీలో చేరడంతో ఈ ఉప ఎన్నిక జరిగింది. కుల్‌దీప్ కుమారుడే భవ్య బిష్ణోయ్.

తెలంగాణాలోని మునుగోడు శాసన సభ ఉప ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై దాదాపు 7,000 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. ఓట్ల లెక్కింపు జరుగుతుండగానే రాజగోపాల్ రెడ్డి తన ఓటమిని అంగీకరించారు.

ఒడిశాలోని ధామ్ నగర్ శాసన సభ స్థానంలో బీజేడీ, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. అయితే బీజేపీ కాస్త ముందంజలో కనిపిస్తోంది. బీజేపీ అభ్యర్థి సూర్యబంషి సూరజ్ తన సమీప ప్రత్యర్థి, బీజేడీ అభ్యర్థి అబంతి దాస్ కన్నా ముందంజలో ఉన్నారు. 13వ రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసేసరికి 6,755 ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థి సూర్యబంషి కనిపించారు.

బిహర్‌లోని మొకామా శాసన సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే అనంత్ కుమార్ సింగ్ సతీమణి నీలం దేవి విజయం సాధించారు. అనంత్ కుమార్ సింగ్‌పై ఎన్నికల కమిషన్ అనర్హత వేటు వేయడంతో ఈ ఉప ఎన్నిక జరిగింది. నీలం దేవి తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి సోనమ్ దేవిపై దాదాపు 16,000 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.

మహారాష్ట్రలోని తూర్పు అంధేరీ శాసన సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన అభ్యర్థి రుతుజ లట్కే (Rutuja Latke) విజయం సాధించారు. ఇక్కడి నుంచి బీజేపీ పోటీ చేయలేదు. కాంగ్రెస్, ఎన్‌సీపీ, ఎంఎన్ఎస్ కూడా రుతుజకు మద్దతు పలికాయి.