Devotional

రేపు కార్తీక పౌర్ణమి.. ఆనాడు ఏం చేయాలి…?

Auto Draft

రేపు కార్తీక పౌర్ణమి.. ఆనాడు ఏం చేయాలి…?
ఇళ్లలో కార్తీక పౌర్ణమి దీపం పెట్టుకుంటారు. అందుకే ఆ రోజు వెలిగించే దీపాలు గుత్తిదీపాలు కూడా పెడతారు. దానికి రెండు కారణాలు. ఒక ఇల్లు మనం కడితే ఆ ఇంట దీపం లేకుండా ఏ ఒక్కరోజు ఉండకూడదు. శాస్త్రంలో ఏమిటంటే యధార్దంగా మీరు ఇల్లు కట్టి ఎక్కడికైనా తాళం వేసి వెళ్ళిపోతున్నారనుకోండి. ఇంటి బ్రహ్మగారు వుంటారు. ఆయన్ని పిలిచి అయ్యా! మేము కాశీ పట్టణానికి వెళుతున్నాం. రావటానికి ఒక ఇరవై రోజులు పడుతుంది. ఈ ఇరవై రోజులు మీరు కాస్త మా పూజామందిరంలో దీపం వెలిగించి స్వామికి బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి అని చెప్పి వెళ్ళాలి ఇంటి తాళమిచ్చి. ఆయన రోజూ దీపం పెట్టి వెళ్ళేవారు. ఇంట దీపం వెలగలేదు అంటే పరమ అమంగళకరమైన గృహం అని గుర్తు. అలా నీ ఇండ్లన్నవి ఎన్ని ఉన్నాయో అన్నిచోట్లా దీపం వెలగాలి. స్వగృహే అని నీవు ఎక్కడ కూర్చుని సంకల్పం చెప్పగలవో అక్కడన్నిచోట్లా దీపాలు వెలుగుతూ వుండాలి 365 రోజులు! అలా దీపం వెలగకపోతే ఆ దోషం మీకే వస్తుంది. మళ్ళీ ఆ ఇంట్లో తిరిగినందుకు ఆ పాపం పోగొట్టుకోవటానికి ప్రాయశ్చిత్తంగా ఇవ్వబడిన అద్భుతమైన తిధి కార్తీక పౌర్ణమి.దుకే కార్తీక పౌర్ణమి నాడు 365 వత్తులు గుత్తిదీపం అని ఆవునేతిలో ముంచి వెలిగిస్తూంటారు. పదిరోజులొ, పదిహేనురోజులో, ఇది తెలియకముందెప్పుడు తప్పు చేసిన రోజులెన్నెన్ని వున్నాయో ఒక ఏడాదంతా నేను దీపం పెట్టకపోతే ఎంత పాపం వస్తుందో, అదంతా పోవాలని 365 వత్తులు వెలిగించి వచ్చేస్తారు.దీపాలు వెలిగించుకోవాలి. ఇంటి యజమాని వెలిగించాలి .మా ఆవిడ వెలిగిస్తుంది .నేను టీవి చుస్తాను అని అనకూడదు. యజమాని పంచె కట్టుకుని వెళ్లి దేవాలయంలో దీపం పెట్టాలి. యజమాని ఇంట్లో దీపం పెడితే సమస్త భూతములకు ఉపకారం చెప్పాలి. ధర్మపత్నీ సమేతస్య అని సంకల్పం వుందిగాని ఆవిడ వెలిగించి ధర్మపతీ సమేతస్య అని సంకల్పం లేదు. నువ్వు పెట్టాలి దీపం. పురుషుడు యజమాని ఇంటికి. కాబట్టి యజమానీ ఆ రోజున ఇది చెయ్యకపోతే అతనికి పరమేశ్వరుడు ఇచ్చిన అద్భుతమైన అవకాశాన్ని జారవిడుచుకున్నవాడవుతాడు. కాబట్టి ఎంతంత దీపాలు పెడతారో అంతంత అనుగ్రహం. దేవాలయ ప్రాంగణంలో కృత్తికా నక్షత్రాన్ని ప్రమాణంగా తీసుకోవాలి. ఇంట్లో అయితే తిధిని ప్రమాణం తీసుకోవాలి. ఇంట కార్తీక దీపం పెడితే కార్తీక పౌర్ణమి తిధి ప్రధానం. దేవాలయంలో పెడితే కృత్తికా నక్షత్రం ప్రధానం. అందుకే ఇప్పటికీ అరుణాచలంలో కృత్తికా నక్షత్రం నాడు జ్యోతిని వెలిగిస్తారు. అరుణాచలంలో ఆ కృత్తికా దీపోత్సవం చూడటానికి కొన్ని లక్షల మంది వస్తారు. ఆరోజున అసలు గిరిప్రదక్షిణ చేయటానికి అవకాశమే వుండదుఇక. మొత్తం జనంతో నిండిపోతుంటారుంకొండ చుట్టూ. వెలుగుతున్న దీపాన్ని ఒక్కదాన్నే చూస్తారు. చూసి నమస్కారం చేస్తారు భగవాన్ రమణులంతటివారు కూడా అసుర సంధ్యవేళ అయ్యేటప్పటికి వచ్చేసి ఆ సోఫాలోంపడుకుని అరుణాచలం కొండమీద వెలిగే దీపం కోసం ఎదురుచూస్తుండేవాడు ఆయనే పెద్ద జ్యోతిస్వరూపుడు.అయినా సరే జ్యోతిని చూసి నమస్కరిస్తూండేవారు. భారతదేశం మొత్తం మీద కృత్తికా దీపోత్సవం అంటే అంత ప్రసిద్ధి. అరుణాచలం కొండయే అగ్నిలింగం కాబట్టి , ఆ కొండమీద వెలిగించే దీపానికి అంత ప్రఖ్యాతి.అందుకే కార్తీకపౌర్ణమి నాడు వెలిగించే దీపం కేవలం మనకొరకే కాకుండా, మనం చేసే దుష్క్ర్తులను పొగొట్టి మన పాపములను పోగొట్టి అంతర తిమిరాన్ని పోగొట్టి బాహ్యములోని తిమిరాన్ని పోగొట్టి, లోకోపకారం చేసి, సమస్త జీవులనుద్ధరించటానికి పెట్టిన దీపం.
1. శ్రీశైలంలో కార్తీక సందడి.. శివ నామస్మరణతో మార్మోగిన శైవక్షేత్రం
శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో పుర వీధులన్నీ కిటకిటలాడాయి. కార్తీక మాస శోభను సంతరించుకున్న శ్రీశైల మహాక్షేత్రం శివనామస్మరణతో మార్మోగింది. వరుసగా వారాంతపు సెలవులు కలిసిరావడంతో భక్తులు కుటుంబసమేతంగా క్షేత్రానికి చేరుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులు తెల్లవారుజామునే తలనీలాలు సమర్పించుకొని మొక్కులు తీర్చుకున్నారు.ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గంగాధర మండపం, ఉత్తర మాడవీధి వద్ద దీపాలు వెలిగించుకొని పూజలు చేసుకొన్నారు. స్వామి అమ్మవార్ల ఉచిత దర్శనానికి రెండు గంటలు, శీఘ్ర, అతిశీఘ్ర దర్శనానికి గంట సమయం పడుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు మంచినీరు, పాలు, బిస్కెట్‌ ప్యాకెట్లతోపాటు అల్పాహారాన్ని అందిస్తున్నట్లు పౌర సంబంధాల అధికారి శ్రీనివాసరావు తెలిపారు.
*వసతి గృహలకు తప్పని తిప్పలు
శని, ఆదివారాలు క్షేత్రానికి తరలివచ్చిన భక్తులు కుటుంబ సభ్యులతో బస చేసేందుకు సదుపాయాలు లభించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దేవస్థాన వసతి గృహాలతో పాటు నిత్యాన్నదాన సత్రాల్లో అద్దె గదులు, డార్మెటరీలు లభించక పోవడంతో ఉద్యానవనాలు, ఫుట్‌పాత్‌లపై నిద్రించడం కష్టంగా ఉందని భక్తులు ఆవేదన చెందారు. ప్రత్యేక పర్వదినాల్లో సామాన్య భక్తులు కూడ బస చేసేందుకు వీలుగా ప్రత్యేక వసతి సదుపాయాలను కల్పించాలని యాత్రికులు కోరుతున్నారు.
*శనగల బసవన్నకు పంచామృతాభిషేకాలు
శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు త్రయోదశి ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు ఈవో లవన్న తెలిపారు. ప్రదోషకాల సమయంలో నంది మండపంలోని శనగల బసవన్నకు పంచామృతాభిషేకాలు జరిపించి నానబెట్టిన శనగలు నైవేద్యంగా సమర్పించారు. అనంతరం భక్తులకు దర్శనాలు కల్పించి తీర్థప్రసాదాలు ఇచ్చారు.
*అక్కమహాదేవి వైభవ ప్రదర్శన
బెంగళూరుకు చెందిన కళాకారులు అక్కమహాదేవి చరిత్రను నాటక రూపంలో ప్రదర్శించగా హైదరాబాద్‌కు చెందిన తిలాన ఆర్ట్స్‌ అకాడమి వారిచే కూచుపూడి నృత్య రూపక కార్యక్రమాలు జరిపించినట్లు పీఆర్‌వో శ్రీనివాసరావు తెలిపారు.

2. తిరుమలలో వేడుకగా కైశిక ద్వాదశి ఆస్థానం
కైశిక ద్వాదశి పర్వదినం సందర్భంగా శ్రీవారి ఆలయంలో శనివారం కైశిక ద్వాదశి ఆస్థానం వేడుక‌గా జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఉదయం 4.30 నుంచి 5.30 గంటల వ‌ర‌కు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత ఉగ్ర శ్రీనివాసమూర్తిని ఆల‌య మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.
వేంకటతురైవార్‌, స్నపనబేరంగా పిలిచే ఉగ్రశ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక్క కైశిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు మాడవీధుల్లో ఊరేగిస్తారు. అనంతరం ఉదయం 5.30 నుంచి ఉదయం 7 గంట‌ల‌ వరకు స్వామి, అమ్మవార్లను బంగారువాకిలి చెంత వేంచేపు చేసి అర్చకులు పురాణ పఠనంతో కైశిక ద్వాదశి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. పురాణాల ప్రకారం వైష్ణవ క్షేత్రాల్లో నిర్వహించే ముఖ్యమైన పర్వదినాల్లో కైశిక‌ద్వాద‌శి ఒక‌టి. వ‌రాహ పెరుమాళ్ కైశిక‌పురాణంలోని 82 శ్లోకాల‌తో భూదేవికి క‌థ‌గా చెప్పిన రోజును కైశిక ఏకాద‌శిగా పిలుస్తారు.ఈ క‌థ ఆధారంగా కైశిక ద్వాద‌శి ప్రత్యేకతను సంతరించుకున్నది. కార్యక్రమంలో పెద్ద జీయర్‌స్వామి, చినజీయర్‌స్వామి, ఈవో ఏవీ ధ‌ర్మారెడ్డి, ఆల‌య డెప్యూటీ ఈవో ర‌మేశ్‌ బాబు, వీజీవో బాలిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
3. యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడికి సుప్రభాత సేవను అర్చకులు అత్యంత వైభవంగా జరిపారు. శనివారం తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచి స్థాన సుప్రభాతాన్ని వినిపించి స్వామివారిని మేల్కొలిపారు. స్వామి, అమ్మవార్లకు తిరువారాధన జరిపారు. స్వామి, అమ్మవార్లను పట్టువస్ర్తాలతో అలంకరించి గజవాహన సేవ నిర్వహించారు.నిత్య తిరుకల్యాణోత్సవం జరిపారు. రాత్రి నివేదన చేపట్టిన అర్చకులు శయనోత్సవ సేవను నిర్వహించారు. రద్దీ కారణంగా స్వామివారి ధర్మ దర్శనానికి 3 గంటలు, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టిందని భక్తులు తెలిపారు. 35 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, ఖజానాకు రూ.38,57,330 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు.
4. కాకినాడ జిల్లా అన్నవరంలో కొలువుదీరిన శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి తెప్పోత్సవం శనివారం భక్త జన నేత్రపర్వంగా జరిగింది. సర్వాంగ సుందరంగా అలంకరించిన హంస వాహనంపై స్వామి వారిని కొలువుదీర్చి పంపా సరోవరంలో తెప్పోత్సవం నిర్వహించారు.
5. 7న ఇంద్రకీలాద్రిపై కోటి దీపోత్సవం
అమరావతి : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఈనెల 7న కోటి దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. దేవస్థానం ఆధ్వర్యంలో సాయంత్రం 4 నుంచి రాత్రి 7 గంటల వరకు గిరి ప్రదక్షిణకు రంగం సిద్ధం చేశామన్నారు. గిరిప్రదక్షిణ దుర్గగుడి టోల్‌గేట్‌ సమీపంలోని ఆలయం నుంచి ప్రారంభమై కుమ్మరిపాలెం, చిట్టినగర్‌, కొత్తపేట, నెహ్రూబొమ్మ సెంటర్‌, బ్రాహ్మణ వీధి మీదుగా మల్లికార్జున మహామండపం వద్దకు చేరుతుందని ఆలయ అధికారులు తెలిపారు.అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలు, కనకదుర్గానగర్‌, చిన్న రాజగోపురం, పెద్ద రాజగోపురం ప్రాంగణలో భక్తులు దీపాలు వెలిగించేందుకు జోన్‌లుగా విభజించినట్లు వెల్లడించారు. అదేవిధంగా సాయంత్రం 6.30 గంటలకు సంప్రదాయబద్ధంగా జ్వాలాతోరణం నిర్వహిస్తున్నామని తెలిపారు
6. నల్లమలలో ఆధ్యాత్మిక శోభ
కార్తీక పౌర్ణమి వేడుకలకు సిద్ధం
ఏర్పాట్లు చేస్తున్న ఆలయాల నిర్వాహకులు
నల్లమల అడవులు ప్రకృతి అందాలకే కాదు… ప్రసిద్ధ శైవ క్షేత్రాలకూ నెలవు. శ్రీశైలం, మహానంది, యాగంటి, సంగమేశ్వరం, ఓంకారం, కొలనుభారతి వంటి ఆలయాలు నల్లమల ఒడిలో ఒదిగి ఉన్నాయి. మహాశివుడికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసం కావడంతో ఈ క్షేత్రాలు శివనామస్మరణ తో మార్మోగుతున్నాయి. కార్తీక సోమవారాలు, సెలవు రోజుల్లో ఈ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రత్యేకించి కార్తీక పౌర్ణమి రోజున స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తనున్నారు. నవంబరు 7న కార్తీక పౌర్ణమి సందర్భంగా నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రాలు కొత్త శోభను సంతరించుకోనున్నాయి. ఈమేరకు ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని శైవ క్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతోంది. రుద్రకోడూరు, నాగలూటి, చిన్నగుమ్మితం, పెద్దగుమ్మితం క్షేత్రాలకు మాత్రం ప్రైవేట్‌ వాహనాల్లో అటవీ అధికారుల అనుమతి మేరకు వెళ్లాల్సి ఉంది. నల్లమలలోని శైవ క్షేత్రాల విశేషాలు తెలుసుకుందాం.
*శ్రీశైలం
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల క్షేత్రంలో భక్తులతో కిటకిటలాడుతోంది. మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మ వార్ల దర్శనార్థం దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. పాతాళగంగలో కార్తీక పుణ్యస్నానాలు ఆచరించి భక్తులు పునీతులవుతున్నారు. క్షేత్రప రిధిలో కొందరు దేవతామూర్తుల ఉప ఆలయాలు కొలువుతీరి ఉన్నాయి. ప్రత్యేకించి సాక్షిగణపతి, హఠకేశ్వరం, అక్కమహాదేవి గుహలు, ఇష్టకామేశ్వరి తదితర ఆలయాలతో పాటు పాలధార, పంచధార, శిఖరం, శివాజీ స్ఫూర్తి కేంద్రం వంటి సందర్శనీయ ప్రదే శాలు ఉన్నాయి. క్షేత్రానికి కర్నూలు, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, ఆత్మకూరు తది తర పట్టణాల నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులు ఉన్నాయి. కార్తీక పౌర్ణమిని పురస్క రించుకుని క్షేత్రంలో లక్ష దీపోత్సవం, పుష్కరిణికి నవవిధ హారతులు, జ్వాలాతోరణం వంటి క్రతువులను శాస్రోక్తంగా నిర్వహించనున్నారు. కార్తీకమాస పూజలకు సంబంధించి దేవస్థానం అధికారులు భక్తులకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు.
*మహానంది
నల్లమల ప్రకృతి అందాల నడుమ వెలసిన మహానంది క్షేత్రాన్ని నందన చక్రవర్తి కాలంలో నిర్మించినట్లు ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తోంది. అత్యంత ప్రాచీనమైన ఈ క్షేత్రానికి కామేశ్వరీసహిత మహానందీశ్వరుడి దర్శనార్థం కార్తీకమాసంలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. నల్లమల అందాలు, ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్న ఈ క్షేత్రంలో మహానంది విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అలాగే క్షేత్రంలో భక్తులు విడిది చేసేందుకు వీలుగా ప్రైవేట్‌ కాటేజీలు కూడా అందుబాటులో ఉన్నాయి. మహానంది క్షేత్రం నంద్యాల జిల్లా కేంద్రం నుంచి 15కిలో మీటర్ల దూరంలో ఉంది. నంద్యాల నుంచి ఆటోలు, బస్సులు అందుబాటులో ఉంటాయి.

*సంగమేశ్వరం
కొత్తపల్లి మండలంలోని సప్తనదీ సంగమేశ్వర క్షేత్రం శ్రీశైల జలాశయంలో నీటినిల్వలు సమృద్ధిగా ఉండటం వల్ల నీటమునిగింది. దీంతో భక్తులు ఎగువన ఉన్న ఉమామహేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించవచ్చు. క్షేత్రంలోని సప్తనదీ జలాల్లో పుణ్యస్నానాలు ఆచరించవచ్చు. ఆత్మకూరు నుంచి 34 కిలోమీటర్లు కొత్తపల్లి మండల కేంద్రం మీదుగా వెళ్లి, కపిలేశ్వరం మీదుగా మరో మూడు కిలోమీటర్లు ప్రయాణిస్తే క్షేత్రానికి చేరుకోవచ్చు. ఈ క్షేత్రానికి బస్సు సర్వీసులను ఆర్టీసీ నడుపుతోంది. కాశిరెడ్డినాయన ఆశ్రమం వారు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
*ఓంకార క్షేత్రం
బండిఆత్మకూరు మండలంలో వెలసిన ఓంకార క్షేత్రం కార్తీక మాస శోభ సంతరించుకుంది. చాళుక్యుల కాలంలో క్షేత్ర నిర్మాణం జరిగినట్లు ఇక్కడి పురాణాలు చెబుతున్నాయి. కార్తీక మాసోత్సవాన్ని పురస్కరించుకుని గంగాఉమాసమేత సిద్ధేశ్వరస్వామి దర్శనార్థం భక్తులు విశేషంగా తరలివస్తుంటారు. అలాగే ఎగువ న ఉన్న కొండపై కాశీవిశాలక్ష్మి అమ్మవారి ఆలయం, వేంకటేశ్వరుడి సన్నిధితో పాటు పలువురు దేవతామూర్తుల విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. భక్తులకు కాశీరెడ్డినాయన ఆశ్రమం తరపున ఉచిత నిత్యాన్నదాన సత్రం నిర్విరామంగా కొనసాగుతోంది. బండిఆత్మకూరు నుంచి 12 కిలో మీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. బస్సులు, ఆటోలు అందుబాటులో ఉంటాయి.
*యాగంటి
రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాల్లో బనగానపల్లె మండలంలోని యాగంటి ప్రసిద్ధిగాంచింది. ఈ క్షేత్రంలోని ప్రధాన ఆలయంలో ఉమామహేశ్వర స్వామి, అమ్మవార్లు కొలువై ఉన్నారు. శివపార్వతులు ఇద్దరూ లింగంలో దర్శనమివ్వడం ఇక్కడ విశేషం. ఈ క్షేత్రంలో యాగంటి బసవన్న స్వయంభువుగా వెలిసిట్లు చరిత్ర చెబుతోంది. ఈ నంది విగ్రహం రానురానూ పెరుగుతోంది. ఈ క్షేత్రంలో కాకులు కనిపించకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ క్షేత్రంలో ప్రకృతి ఒడిలో పట్టిన జలధార పర్వతసానువుల్లో ప్రవహించి కోనేరులోకి చేరుతుంది. ఈ కోనేరును అగస్త్య పుష్కరిణిగా పిలుస్తారు. నంద్యాల నుంచి బనగానపల్లెకు 48 కిలోమీటర్లు. అక్కడి నుంచి 11 కిలోమీటర్ల దూరంలో యాగంటి క్షేత్రం ఉంది. కార్తీక మాసంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రత్యేకించి కార్తీక పౌర్ణమి రోజున తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో లక్ష దీపోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.
*కొలనుభారతి
కొత్తపల్లి మండలంలోని కొలనుభారతి క్షేత్రం రాష్ట్రంలోనే ఏకైక సరస్వతి ఆలయంగా పేరుగాంచింది. కార్తీక పౌర్ణమి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆత్మకూరు నుంచి 16 కిలో మీటర్ల దూరంలో గల శివపురం చేరుకుని… అక్కడి నుంచి 5 కిలోమీటర్ల మేర అరణ్యమార్గ్గంలో వెళ్లాల్సి ఉంటుంది. అలాగే క్షేత్రంలోని సప్తశివాలయాల్లో కూడా ప్రత్యేక పూజలు జరుగనున్నాయి. ఈ క్షేత్రానికి ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక బస్సులను నడుపుతోంది.
*రుద్రకోటేశ్వరాలయం
ఆత్మకూరు మండలంలోని నల్లకాల్వ గ్రామం నుంచి 15 కిలో మీటర్ల దూరంలో నల్లమల అరణ్యంలో రుద్రకోటేశ్వరాలయం వెలసింది. పూర్వం ఈ క్షేత్రంలో పరమేశ్వరుడు స్వయంభూ లింగరూపంలో వెలసినట్లు పురాణ, ఇతిహాసాలు చెబుతున్నాయి. ఆలయానికి ఈశాన్యంలో ఓ కల్పవృక్షం ఉంది. ఈ వృక్షాన్ని తాకితే అమృతం స్రవించడమే కాకుండా..దీన్ని పూజిస్తే సంతానప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. మహా శివరాత్రి, కార్తీక పౌర్ణమి రోజుల్లో భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. అటవీ మార్గంలోని మూడువాగుల్లో నీటి ప్రవాహం ఉంది. దీంతో అటవీ శాఖ అనుమతుల మేరకు ట్రాక్టర్ల ద్వారా క్షేత్రానికి వెళ్లాలి. కార్తీక పౌర్ణమి ఏర్పాట్లు చేస్తున్నారు.
*గుప్త మల్లికార్జున స్వామి
ఆత్మకూరు మండలంలోని వడ్లరామాపురం గ్రామానికి 6 కిలోమీటర్ల దూరంలో గల ఎత్తయిన నల్లమల కొండల్లో వెలసిన పెద్దగుమ్మితం గుప్త మల్లికార్జున స్వామి ఆలయం ఎంతో ఖ్యాతికెక్కింది. ఇక్కడ కొలువైన ముక్కంఠీశ్వరుని, ధాన్య భ్రమరాంబదేవిని భక్తితో కొలిస్తే కోరికలు సిద్ధిస్తాయన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ ఆలయం అతి పురాతనమైనది. ద్వాపర యుగంలో పాండవులు అరణ్యవాసం చేసే సమయంలో ధర్మరాజు ఈ శివలింగం ప్రతిష్ఠించినట్లు పురాణాల ఆధారంగా తెలుస్తోంది. ఆలయానికి వెనుకభాగంలో ఉన్న భారీ మర్రి వృక్షానికి సుమారు 400 ఏళ్లు ఉండవచ్చని పెద్దలు చెబుతున్నారు. వడ్లరామాపురం, ఇందిరేశ్వరం చెంచుగూడెల నుంచి భక్తులు కాలినడకన అటవీమార్గం గుండా ఈ క్షేత్రానికి చేరుకుంటారు
8. కాకినాడ జిల్లా అన్నవరంలో కొలువుదీరిన శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి తెప్పోత్సవం శనివారం భక్త జన నేత్రపర్వంగా జరిగింది. సర్వాంగ సుందరంగా అలంకరించిన హంస వాహనంపై స్వామి వారిని కొలువుదీర్చి పంపా సరోవరంలో తెప్పోత్సవం నిర్వహించారు.