Movies

నాన్న నేర్పిన విలువైన పాఠం అదే!

నాన్న నేర్పిన విలువైన పాఠం అదే!

కమల్‌ హాసన్‌ కుమార్తెగా అడుగుపెట్టినా, తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొంది శ్రుతిహాసన్‌. తండ్రిలానే బహు భాషల్లో ప్రాచూర్యం పొందింది. నటనే కాకుండా.. గానం, సంగీతంపై కూడా దృష్టి పెట్టింది. సోషల్‌ మీడియాలో కూడా యాక్టీవ్‌గానే ఉంటోంది. ప్రస్తుతం ‘సలార్‌’లో నటిస్తోంది. చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’లోనూ కథానాయిక తనే. ఈ రెండు సినిమాలపై శ్రుతి చాలానే ఆశలు పెంచుకొంది. తన కెరీర్‌ గురించి శ్రుతి మాట్లాడుతూ ‘‘నా సినీ ప్రయాణం, నేను సాధించిన విజయాల పట్ల నేనెప్పుడూ సంతృప్తిగానే ఉన్నా. ఎలాంటి ఫిర్యాదులూ లేవు. ‘ఈ సినిమాతో శ్రుతి పెద్ద స్టార్‌ అయిపోయింద’ని మీడియా చెప్పేది. వాళ్లే ‘ఇక శ్రుతి పని అయిపోయింద’ని కూడా రాశారు. ఈ రెండింటినీ నేను పెద్దగా పట్టించుకోలేదు. ‘నీ పని నువ్వు చేయ్‌.. ఎవరేం అన్నా పట్టించుకోకు.. జయాపజయాలు బుర్రకు ఎక్కించుకోకు’ అని నాన్న తరచూ చెప్పేవారు. ఆయన తన జీవితంలో పాటించే సూత్రం అదే. నాన్న నాకు నేర్పిన విలువైన పాఠం అది. ఈ యేడాది నాకెన్ని విజయాలు వచ్చాయి? నేనింకా రేసులో ఉన్నానా, లేదా? అనే లెక్కలు ఎప్పుడూ వేసుకోలేదు. ఇక మీదటా ఇలానే ఉంటా. ఓ ఫ్లాపు వచ్చినంత మాత్రాన ప్రయాణం ఆగిపోదు. ఓ హిట్‌తో.. నేను సూపర్‌ స్టార్‌నీ కాలేను…’’ అని వినమ్రంగా చెప్పుకొచ్చింది శ్రుతి.