NRI-NRT

సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ కు ‘తానా’ అధ్యక్షుడు సంతాపం

సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ కు ‘తానా’ అధ్యక్షుడు సంతాపం

తెలుగు జాతి గర్వించదగ్గ నటుడు సూపర్ స్టార్ కృష్ణ అకాల మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి అన్నారు. లెజెండరీ నటుడు కృష్ణ మృతికి సంతాపం తెలియచేస్తూ వారి కుటుంబ సభ్యులకు తానా తరుపున ప్రగాఢ సానుభూతి తెలిపారు. వెండి తెర వేల్పులుగా వెలుగొందిన ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణంరాజు, కృష్ణల మృతితో ఆనాటి శకం ముగిసిందని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తెచ్చి నూతన ఒరవడి సృష్టించిన వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ అని కొనియాడారు. వినూత్న సాంకేతికతను తెలుగు వారికి పరిచయం చేసి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రను వేసిన కృష్ణ మరణం ఆయన అభిమానులకే కాకుండా, తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని పేర్కొన్నారు.తెలుగు వారికి జేమ్స్ బాండ్, కౌబాయ్ అంటే కృష్ణ మాత్రమేనని అన్నారు. నిజ జీవితంలో అల్లూరి సీతారామరాజు రూపం ఎలా ఉంటుందో స్పష్టంగా తెలియనప్పటికీ తెలుగు వారికి మాత్రం అల్లూరి అంటే మదిలో మెదిలే రూపం సూపర్ స్టార్ కృష్ణ అని అన్నారు. కథానాయకుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఆయన కీర్తి అజరామరం అని కొనియాడారు. మంచి మనసున్న వ్యక్తిగా, మానవతా వాదిగా, వివాదాలకు దూరంగా, అందరి మంచి కోరుకొనే అరుదైన వ్యక్తిత్వం కృష్ణ సొంతమని పేర్కొన్నారు. తెలుగు సినిమా ఉన్నంత కాలం ఆయన కీర్తి నిలిచి ఉంటుందని తెలిపారు. కృష్ణ కుటుంబ సభ్యులకు, అభిమానులకు భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని ఉత్తర అమెరికా తెలుగు సంఘము(తానా) తరపున అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి ప్రగాఢ సంతాపం తెలియజేశారు.