Business

మార్కెట్​ను ముంచిన అదానీ షేర్లు

మార్కెట్​ను ముంచిన అదానీ షేర్లు

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్​ కంపెనీలపై అమెరికాకు చెందిన ఒక కంపెనీ తయారు చేసిన రీసెర్చ్​ రిపోర్ట్​స్టాక్​ మార్కెట్​ను​ అమాంతం కింద పడేసింది. ఇన్వెస్టర్లకు రూ.లక్షల కోట్ల నష్టాలను తెచ్చిపెట్టింది. ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో ఒకరైన గౌతమ్​ అదానీ కంపెనీ బలహీనంగా ఉందని ప్రకటించడంతో బుధవారం దలాల్​స్ట్రీట్ ​దడదడలాడింది. ఏడు అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు విపరీతంగా నష్టపోవడంతో ఇండెక్స్​లు ఢీలా పడ్డాయి. ఈ రిపోర్టు ఇన్వెస్టర్లలో ఆందోళనను పెంచింది. ఇది చాలదన్నట్టు గ్లోబల్ మార్కెట్ల నుంచి కూడా నెగిటివ్​ సంకేతాలు వచ్చాయి. దీంతో ముగింపు సమయానికి, బీఎస్​ఈ సెన్సెక్స్ దాదాపు 774 పాయింట్లు తగ్గి 60,205.06 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 1.25 శాతం పడిపోయి 17,892 దగ్గర ముగిసింది. పెరిగిన అస్థిరత కారణంగా బ్రాడ్​ మార్కెట్లు కూడా పడిపోయాయి. ‘‘అదారీ గ్రూప్‌‌‌‌‌‌కు పెద్ద ఎత్తున అప్పులు ఉన్నాయి. షేర్ల మానుప్యులేషన్​ వల్లే అవి బాగా పెరిగాయి. అకౌంటింగ్​ లోపాలూ విపరీతంగా ఉన్నాయి. ఏళ్ల తరబడి వీళ్లు అకౌంటింగ్​ మోసాలు చేస్తున్నారు. కొన్ని దేశాల్లో షెల్​ కంపెనీల ద్వారా అదానీ ఎంటిటీలు అవినీతికి పాల్పడుతున్నాయి. మనీలాండరింగ్​ చేస్తున్నాయి. లిస్టెడ్​ కంపెనీల డబ్బును దొంగిలిస్తున్నాయి. మేం ఎంతో మంది కంపెనీ మాజీ ఆఫీసర్లతో, ఇతరులతో మాట్లాడాకే ఈ విషయాలు తెలిశాయి. అప్పులు, షేర్ల తనఖా కారణంగా కంపెనీ చాలా ప్రమాదంలో ఉంది’’అని యూఎస్​ షార్ట్ సెల్లర్ హిండెన్‌‌‌‌బర్గ్ ఒక రిపోర్ట్​ వెల్లడించడం సంచలనానికి కారణమైంది. షేర్ల వాల్యుయేషన్​ చాలా ఎక్కువగా ఉందని, వీటి విలువ 85 శాతం తగ్గే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఈ రిపోర్టు వివరాలు వెల్లడయ్యాక ఏడు అదానీ గ్రూప్ కంపెనీల స్టాక్‌‌‌‌లు 1.5 శాతం నుండి 7.77 శాతం మధ్య పడిపోయాయి. ఫ్లాగ్‌‌‌‌షిప్ అదానీ ఎంటర్‌‌‌‌ప్రైజెస్ 1.54 శాతం పడిపోగా, అదానీ పోర్ట్స్ స్పెషల్ ఎకనామిక్ జోన్ 6 శాతానికి పైగా పడిపోయింది. నిఫ్టీ ఇండెక్స్‌‌‌‌లో అదానీ పోర్ట్స్ టాప్ లూజర్‌‌‌‌గా నిలిచింది. అదానీకి చెందిన సిమెంట్ సంస్థలు ఏసీసీ 7.28 శాతం, అంబుజా సిమెంట్స్ 7.77 శాతం పడిపోయాయి. ఇతర బ్లూచిప్ ఇండెక్స్​లలో ఎస్​బీఐ, ఇండస్‌‌‌‌ఇండ్ బ్యాంక్ ఒక్కొక్కటి 4 శాతం పడిపోగా, హెచ్‌‌‌‌డిఎఫ్‌‌‌‌సీ బ్యాంక్ 3 శాతం పడింది. హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ, సిప్లా, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా, అపోలో హాస్పిటల్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఐసిఐసిఐ బ్యాంక్, లార్సెన్ అండ్ టూబ్రో 2 శాతం చొప్పున నష్టపోయాయి. లాభపడిన వాటిలో బజాజ్ ఆటో, హెచ్‌‌‌‌యుఎల్ మొదటిస్థానంలో ఉండగా, హిందాల్కో, బ్రిటానియా, మారుతీ సుజుకీ జెఎస్‌‌‌‌డబ్ల్యు స్టీల్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. హిండెన్‌‌‌‌బర్గ్ రిపోర్టు, డెరివేటివ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌కు నెలవారీ గడువు ముగియడం, ప్రీ-బడ్జెట్ ర్యాలీ ఎఫెక్ట్​ లేకపోవడంతో ఈక్విటీలు నష్టపోయాయని ప్రాఫిట్‌‌‌‌మార్ట్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ అవినాష్ గోరక్షకర్ అన్నారు.

మా ఎఫ్​పీఓను దెబ్బతీయడానికే…

“మమ్మల్ని సంప్రదించకుండా, నిజానిజాలను రూఢీ చేసుకోకుండా హిండెన్‌‌‌‌‌‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్​ను ప్రచురించినందుకు మేం ఆశ్చర్యపోయాం. ఇందులో ఉన్నది తప్పుడు, పాత సమాచారం. అన్నీ నిరాధారమైన ఆరోపణలు. మమ్మల్ని అపఖ్యాతి పాలు చేయడానికే ఈ ప్రయత్నం. భారతదేశ అత్యున్నత న్యాయస్థానాల్లోనూ ఈ ఆరోపణలు నిలవలేదు” అని అదానీ గ్రూప్ సీఎఫ్​ఓ జుగేషీందర్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలో రాబోతున్న తమ ఎఫ్​పీఓను దెబ్బతీయాలనే ప్రధాన లక్ష్యంతో, అదానీ గ్రూప్ ప్రతిష్టను అణగదొక్కడానికి ఇలా చేశారని మండిపడ్డారు. ఆర్థిక నిపుణులు, ప్రముఖ జాతీయ అంతర్జాతీయ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు రూపొందించిన రిపోర్ట్​ల ఆధారంగా పెట్టుబడిదారులు ఎల్లప్పుడూ అదానీ గ్రూప్‌‌‌‌పై విశ్వాసం ఉంచుతున్నారని పేర్కొన్నారు. ఈ రిపోర్టు వల్ల తమ సంస్థకు ఏమీ కాదని స్పష్టం చేశారు. అదానీ ఎఫ్​పీఓను శుక్రవారం పబ్లిక్ సబ్‌‌‌‌స్క్రిప్షన్ కోసం అందుబాటులోకి తెస్తారు. యాంకర్ బుక్ సబ్‌‌‌‌స్క్రిప్షన్ ఓవర్‌‌‌‌సబ్‌‌‌‌స్క్రైబ్ అయింది. ఇదిలా ఉంటే, నేట్ ఆండర్సన్ స్థాపించిన, యూఎస్​-ఆధారిత హిండెన్‌‌‌‌బర్గ్ రీసెర్చ్ ఫోరెన్సిక్ అకౌంటింగ్‌‌‌‌ కంపెనీ.