Politics

కోర్టు దిక్కారానికి పాల్పడుతున్న జగన్..

కోర్టు దిక్కారానికి పాల్పడుతున్న జగన్..

విశాఖ రాజధాని కాబోతుందంటూ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పడం, “నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు” అన్న నానుడిని గుర్తు చేస్తున్నది. హైకోర్టు తీర్పును ఖాతరు చేసేదిలేదన్న ధిక్కారస్వరం వినిపించినట్లుగా భావించాలి.

ప్రజాస్వామ్యంపైన, చట్ట సభలపైన, న్యాయ వ్యవస్థపైన ఏ మాత్రం గౌరవంలేదని, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుపై ధ్యాసలేదని దేశ రాజధాని ఢిల్లీ వేదికగా మరొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఏకగ్రీవ తీర్మానంతో అమరావతి రాష్ట్ర రాజధానిగా ఉన్నది. జగన్మోహన్ రెడ్డి అధికార పీఠం ఎక్కగానే వికేంద్రీకరణ ముసుగులో తెచ్చిన లోపభూయిష్టమైన చట్టాలను తానే భేషరతుగా ఉపసంహరించుకొన్నారు. ఒకసారి తీర్మానం చేసి, అమరావతిని రాజధానిగా చేసిన నేపథ్యంలో మరొకసారి రాజధాని అంశంపై తీర్మానం చేసే శాసనాధికారం శాసనసభకు లేదని హైకోర్టు విస్పష్టమైన, చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది.

హైకోర్టు తీర్పుపై ఆరు నెలల పాటు కాలయాపన చేసి సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాఖలు చేసింది. కేసు విచారణలో ఉన్నది. రాజధానిపై చట్టం చేసే శాసనాధికరం శాసన సభకు లేదన్న హైకోర్టు తీర్పు అమలులో ఉన్నది. మరి, రాజధానిని విశాఖకు ఎలా తరలిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు?

విచ్ఛిన్నకర ఆలోచనలకు తక్షణం జగన్మోహన్ రెడ్డి స్వస్తి చెబితే రాష్ట్రానికి మేలు. ఇప్పటి వరకు “ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్” అంటూ ఉచ్చరిస్తూ వస్తున్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఏకంగా “కాబోయే రాజధాని విశాఖ” అంటూ బహిరంగంగా మాట్లాడడం అత్యంత బాధ్యతారాహిత్యం, తీవ్ర గర్హనీయం.