WorldWonders

ముకరం జా: ఈ ఏడో నిజాం వారసుడి రూ.4,000 కోట్ల సంపద ఎలా ఆవిరైంది?

ముకరం జా: ఈ ఏడో నిజాం వారసుడి రూ.4,000 కోట్ల సంపద ఎలా ఆవిరైంది?

హైదరాబాద్ సంస్థానం ఎనిమిదో నిజాం ‘ముకరం జా’కు ‘‘మీరు 86 ఏళ్ల వయసు వరకు జీవిస్తారు’’అని ఒక స్విట్జర్లాండ్ జ్యోతిష్యుడు చెప్పారు.

దీనికి కొన్నేళ్ల ముందే, తుర్కియేలోని అనాతోలియాలో ముకరం జాను జర్నలిస్టు-రచయిత జాన్ జుబ్రిస్కీ కలిశారు. అప్పటికి ముకరం వయసు 71 ఏళ్లు.

మధుమేహాన్ని నియంత్రించేందుకు ఆయన మందులు వేసుకునేవారు. సిగరెట్లు కూడా తాగేవారు.

‘‘మా తాతయ్య రోజుకు 11 గ్రాముల నల్లమందు తీసుకునేవారు. పైగా ఆయన చైన్ స్మోకర్. ఆయనే 80 ఏళ్లు బతికారు. నేను కచ్చితంగా ఆయన కంటే ఎక్కువ ఏళ్లే జీవిస్తాను’’అని జాన్ జుబ్రిస్కీతో ముకరం అన్నారు.

అయితే, 2023లో ముకరం మరణించినప్పుడు సరిగ్గా ఆయన వయసు 89 ఏళ్లు.

అనాతోలియాలోని తన అపార్ట్‌మెంట్‌లోనే ఆయన కన్నుమూశారు. ఈ త్రీ-బెడ్‌రూమ్ ఇంటిలో ఆయనతోపాటు ఒక నర్సు, ఒక వంట నిపుణుడు, ఒక కేర్‌టేకర్ ఉండేవారు.

తన పొరుగింట్లో ఉండేవారికి కూడా ముకరం జా తల్లి తండ్రి (తాతయ్య) అబ్దుల్ మజీద్-2 అని తెలియదు. ఆయన ఒట్టొమాన్ సామ్రాజ్య చివరి ‘‘ఖలీఫా’’. అయితే, 1924లో ఆయన దేశం విడిచి వెళ్లిపోవాల్సి వచ్చింది.

అబ్దుల్ స్విట్జర్లాండ్‌కు వెళ్లిపోయారు. ఆయన ఏకైక కుమార్తె దురుశేవర్‌ను ముకరం తండ్రి ప్రిన్స్ ఆజమ్ పెళ్లి చేసుకున్నారు.

1967లో ఎనిమిదో, చివరి నిజాంగా ముకరం ప్రమాణం చేశారు. తాతయ్య నుంచి డజనుకుపైనే ప్యాలెస్‌లు, మొగల్ కళాఖండాలు, వంద కిలోల బంగారం, వెండి ఆభరణాలు, వజ్రాలు, విలువైన రాళ్లు ఆయనకు వారసత్వంగా వచ్చాయి.

అయితే, మరణించే ముందు దాదాపు రూ.4000 కోట్ల విలువైన ఆస్తిని ముకరం కోల్పోయారు. ఆ సంపద ఎలా ఆవిరైందో ‘‘ద లాస్ట్ నిజాం: రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ఇండియాస్ గ్రేటెస్ట్ ప్రిన్స్లీ స్టేట్’’లో జాన్ జుబ్రిస్కీ రాసుకొచ్చారు.

‘‘తమ పూర్వీకుడైన తొలి నిజాం గోల్కొండ కోటను ఎలా కైవసం చేసుకున్నారో ముకరం జా చెప్పేవారు. దక్షిణ భారతంలో మొగల్ విజయాల్లో ఆయన ప్రధాన పాత్ర పోషించారని వివరించేవారు’’అని జుబ్రిస్కీ తన పుస్తకంలో రాశారు.

‘‘ఒకప్పుడు హైదరాబాద్ సంస్థానం ఫ్రాన్స్ దేశమంత పెద్దగా ఉండేది. కానీ, ఆ తర్వాత కాలంలో కొన్ని వందల ఎకరాలకు తగ్గిపోయింది’’అని జుబ్రిస్కీ తెలిపారు.


ముకరం జా మరణించేనాటికి ఆస్తులకు సంబంధించి కొన్ని వందల కేసుల విచారణలు కోర్టుల్లో నడుస్తున్నాయి. ఆ ఆస్తులు తమకు వస్తాయంటే, తమకు వస్తాయని డజన్ల మంది నిజాం వారసులు కోర్టుల్లో చెబుతున్నారు. వీటిపై ఇంకా విచారణలు కొనసాగుతూనే ఉన్నాయి.

అసలు హైదరాబాద్ చివరి నిజాం భారీ సంపద గురించి తెలుసుకోవాలనుకుంటే ముందుగా చరిత్రను మనం పరిశీలించాలి. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన వారసుడిగా ప్రిన్స్ ఆజమ్‌కు బదులుగా ముకరం జాను ప్రకటించారు.

దీనికి సంబంధించిన వివరాలు డీక్యూ కరాకా రాసిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ జీవితచరిత్ర ‘‘ఫ్యాబులస్ మొగల్’’లో కనిపిస్తాయి.

‘‘మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌కు భారీ సంపద వారసత్వంగా వచ్చింది. 1920ల్లో కింగ్ కోఠి ప్యాలెస్‌లో ఆయన 200 మంది భార్యలతో విలాసంగా జీవించేవారు. 1967లో ఆయన మరణించేనాటికి కూడా ప్యాలెస్‌లో 42 మంది భార్యలు ఉండేవారు. కానీ, అప్పటికి పరిస్థితులు చాలా మారిపోయాయి. చాలా సందపను నిజాం కోల్పోయారు’’అని ఆ పుస్తకంలో పేర్కొన్నారు.

‘‘మా తాతయ్య మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సాయంత్రం పూట ప్యాలస్‌లోని తోటకు వెళ్లేవారు. అక్కడకు ఆయన భార్యలంతా వచ్చేవారు. మా తాతయ్య ఏ రాణి భుజం మీద తెల్లని కర్చీఫ్ వేస్తే, ఆమె రాత్రి తొమ్మిది గంటలకు ఆయన పడక గదిలోకి వచ్చేవారు’’అని ముకరం జా తనతో చెప్పినట్లు జుబ్రిస్కీ తన పుస్తకంలో రాశారు.

విపరీతంగా పెరిగిన వారసులు
అయితే, ఈ విలాసాల నడుమ ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కొడుకులు, మనవళ్ల సంఖ్య భారీగా పెరిగింది. ఆయన మరణించే సమయానికి దాదాపు వంద మంది వారసులు ఉండేవారు. 2005నాటికి ఈ సంఖ్య 500 దాటిపోయింది.

వీరిలో చాలా మంది ఆస్తిలో వాటా కోరుతూ ఎనిమిదో, చివరి నిజాం ముకరం జాపై కోర్టులో కేసులు వేశారు.

అయితే, 1947లో భారత స్వాతంత్ర్యం వచ్చినప్పుడు దేశంలో అత్యంత ధనిక సంస్థానం హైదరాబాదే. దీనిపై బ్రిటన్ పార్లమెంటులో అప్పటి బ్రిటన్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ కూడా మాట్లాడారు.

‘‘ఐక్యరాజ్యసమితిలోని 52 దేశాల్లో 20 దేశాలు హైదరాబాద్ కంటే చిన్నవి. 16 దేశాల ఆదాయం కంటే హైదరాబాద్ నిజాం ఆదాయమే ఎక్కువ’’అని ఆయన చెప్పారు.

అదే సమయంలో తండ్రి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఇష్టానికి వ్యతిరేకంగా ఆయన కుమార్తె, ముకరంజాను మొదట దూన్ స్కూల్‌కు, ఆ తర్వాత కేంబ్రిడ్జ్‌కు చదువుకోవడానికి పంపించారు.

ఆ తర్వాత హైదరాబాద్ సంస్థానం భారత్‌లో కలిసింది. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ జీవిత చరిత్ర రాసిన కరాకా వివరాల ప్రకారం.. ‘‘1950లలో నిజాం ఆస్తుల విలువ 135 కోట్లు. వీటిలో 35 కోట్లు నగదు రూపంలో ఉండేవి. మరో 50 కోట్లు వజ్రాలు, నగలు ఉండేవి. 50 కోట్లు విలువచేసే భవనాలు, ఇతర ప్యాలెస్‌లు ఉండేవి.’’

1949లో న్యూయార్క్ టైమ్స్‌ కూడా నిజాం మొత్తం సంపద 2 బిలియన్ అమెరికా డాలర్లు ఉండేదని అంచనా వేసింది.

కోర్టులో కేసుల సమయంలో నిజాం వజ్రాలు, విలువైన ఆభరణాలు, ఇతర ఆస్తులు కలిపి రూ.4000 కోట్ల వరకు ఉంటాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా వేసింది.

అప్పట్లోనే తన వారసుడిగా ప్రిన్స్ ఆజంకు బదులుగా ముకరం జాను ప్రకటిస్తున్నట్లు మీర్ ఉస్మార్ అలీ ఖాన్ తెలిపారు. దీనిపై అప్పటి భారత ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూకు 1954 జూన్ 14న మీర్ ఉస్మాన్ ఒక లేఖ రాశారు. ‘‘కుటుంబానికి పెద్దగా ఉండే అర్హత ప్రిన్స్ ఆజమ్‌కు లేదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అతడికి విలాసాలు ఎక్కువ. పైగా మద్యానికి అతడు బానిస. అందుకే నా ఆస్తికి వారసుడిగా ముకరం జాను ప్రకటిస్తున్నాను’’అని ఆ లేఖలో మీర్ ఉస్మాన్ చెప్పారు.

అయితే, ఆ తర్వాత రాజ భవనాలను ఒక్కొక్కటిగా భారత ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకుంది. వీటన్నింటినీ ఇంగ్లండ్‌లో కూర్చొని ముకరం జా గమనించేవారు.

దీని గురించి లండన్‌లోని హ్యారో స్కూల్‌లో తన స్నేహితుడు రషీద్ అలీ ఖాన్‌తో ఆయన మాట్లాడారు. ‘‘నేను స్వేచ్ఛగా జీవితాన్ని ఆస్వాదించాలని అనుకుంటున్నాను. నచ్చిన పనులు చేయడం, సినిమాలు చూడటం లేదా సంగీత కార్యక్రమాలకు వెళ్లడం ఇలా అన్నీ ఆస్వాదించాలని అనుకుంటున్నాను’’అని చెప్పారు.

1958లో ఇస్తాంబుల్‌లో ఎస్రా బెర్జిన్‌ను ఆయన కలిశారు. లండన్‌లోని కింగ్స్‌టన్ కోర్టులో ఆమెను రహస్యంగా పెళ్లి చేసుకున్నారు.

దీనిపై చరిత్రకారిణి అనితా షాతో కొన్ని సంవత్సరాల తర్వాత ముకరం జా మాట్లాడారు. ‘‘మా తాతయ్య, అమ్మకు ఆ పెళ్లి ఇష్టం లేదు. కానీ, వారికి ప్రత్యామ్నాయం కూడా లేదు’’అని ఆయన చెప్పారు.

మొత్తానికి 1967లో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మరణించారు. దీంతో నిజాం సంస్థానం వారసుడిగా ముకరం జా బాధ్యతలు తీసుకున్నారు. అప్పుడు ఆయన ముందున్న అతిపెద్ద ప్రశ్నల్లో రాజ భవనాల ఖర్చులు కూడా ఒకటి.

దీనిపై జాన్ జుబ్రిస్కీతో మాట్లాడుతూ.. ‘‘మా తాతయ్య దగ్గర 14,718 మంది పనిచేసేవారు. మరోవైపు ఆయనకు 42 మంది భార్యలు, వంద మంది పిల్లలున్నారు. వీరందరి ఖర్చులు చాలా ఉండేవి’’అని ఆయన చెప్పారు.

‘‘చౌమహల్లా ప్యాలెస్ కాంప్లెక్స్‌లో మొత్తంగా 6,000 సిబ్బంది పనిచేసేవారు. మరో 5,000 మంది రక్షణ సిబ్బంది కూడా ఉండేవారు. నిజాం వంట గదిలో రోజుకు 2,000 మందికి భోజనం వండాల్సి వచ్చేది. నిజాం గ్యారేజీలో రోల్స్ రాయిస్ లాంటి విలువైన కార్లు ఉండేవి. వీటికి పెట్రోలకు అప్పట్లోనే ఏడాదికి 90,000 అమెరికా డాలర్లు ఖర్చయ్యేది’’అని ఆయన చెప్పారు.

అయితే, 1968లో ముకరం జాకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తొలి ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంపదను వారసులంతా సమానంగా పంచుకోవాలని కోర్టు చెప్పింది. ఈ కేసును ముకరం జా సోదరి షెహజాదీ పాషా దాఖలు చేశారు.

ఆ తర్వాత రెండేళ్లకు తన భార్య ఎస్రా, పిల్లలు ఇంగ్లండ్‌కు వెళ్లిపోయారు. హైదరాబాద్‌లో తన ఆస్తిని కాపాడుకునేందుకు ఉన్న మార్గాలన్నీ ఒక్కొక్కటిగా మూసుకుపోయాయి.

ఇంజినీరింగ్, మోటార్ మెకానిక్స్ అంటే ముకరం జాకు చాలా ఇష్టం. నిజాం విధుల నుంచి ఖాళీ దొరకినప్పుడల్లా గ్యారేజీలోని 56 కార్లకు ఆయన మరమ్మతులు చేసేవారు.

ఆ తర్వాత, పశ్చిమ ఆస్ట్రేలియాలో వైద్యుడిగా పనిచేస్తున్న తన కేంబ్రిడ్జ్‌ మిత్రుడు జార్జ్ హాబ్‌డేను ముకరం జా కలిశారు. ఆ తర్వాత ఆయన జీవితం చాలా మారింది. ఆయన హైదరాబాద్‌కే కాదు.. తన సంపదకు కూడా దూరం జరిగారు.

పశ్చిమ ఆస్ట్రేలియాలోని పెర్త్ ఆయనకు చాలా నచ్చింది. అక్కడ ఒక ఫామ్ హౌస్‌ కూడా కొనుక్కున్నారు. దీనిపై టైమ్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముకరం జా మాట్లాడుతూ.. ‘‘ముర్చిసన్ నదిలో నీలంగా ప్రవహించే నీరు కొండల మధ్య నుంచి ప్రవహిస్తూ నాకు హైదరాబాద్ చుట్టుపక్కల నా చిన్నప్పుడు చూసిన వాతావరణాన్ని గుర్తుచేస్తుంటుంది. చిన్నప్పుడు తాతయ్యతో కలిసి నేను అక్కడ జంతువులను వేటాడే వాడిని. ఇప్పుడు మళ్లీ అలాంటి పచ్చని వాతావరణాన్ని చూస్తున్నాను’’అని చెప్పారు.

ఆ తర్వాత ఆస్ట్రేలియాకు చెందిన హెలెన్ సైమన్స్‌ను ఆయన పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. అయితే, హెలెన్ ఎయిడ్స్‌తో మరణించారు. ఆమెకు పుట్టిన కుమారుడు, ప్రిన్స్ ఒమర్ జా డ్రగ్స్‌ను విపరీతంగా తీసుకోవడంతో మరణించారు.

ఆ ముర్చిసన్ హౌస్ స్టేషన్‌లో ఒకవైపు హిందూ మహాసముద్రం మరోవైపు పర్వతాలు, గుహలు కనిపించేవి. హైదరాబాద్‌లో ఆయన భవనాలను ఇతరులు ఆక్రమించడం క్రమంగా పెరిగింది. అయితే, ఆయన ఆస్ట్రేలియాలో మిలియన్ డాలర్ల విలువైన కొత్త ఆస్తులను కొనుగోలు చేశారు. భారీ బుల్డోజర్లు, ఒక భారీ షిప్, లాండ్‌మైన్‌లను కనిపెట్టే యంత్రాలు ఇలా చాలా కొనుగోలు చేశారు.

‘‘అయితే, వీటి వల్ల చాలా ఖర్చులు పెరిగాయి. దీంతో విలువైన వజ్రాలు, ఆభరణాలను స్విట్జర్లాండ్‌కు ఆయన విక్రయించారు. దీని నుంచి వచ్చిన డబ్బులతో తన సిబ్బందికి, ఇతర ఖర్చులకు పెట్టేవారు. ఆస్ట్రేలియాలో ఖర్చులు నానాటికీ పెరిగాయి’’అని జుబ్రిస్కీ రాసుకొచ్చారు.

అలా అప్పులు పెరగడందో ముకరం జా దివాళా తీసే పరిస్థితికి వచ్చారు. అప్పుడు నిజాం ట్రస్టుకు చెందిన విలువైన ఆస్తులను విక్రయించకుండా భారత ప్రభుత్వం ఆంక్షలు విధించింది.

1996నాటికి ఆస్ట్రేలియా, యూరప్‌లలోని ఆస్తులను కూడా మొదట ఆయన తనఖా పెట్టారు. ఆ తర్వాత వాటిని అమ్మేయాల్సి వచ్చింది. ఆయన నౌకను అక్కడి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బుల్డోజర్లు, కార్లను కూడా విక్రయించాల్సి వచ్చింది.

దీనిపై ఆస్ట్రేలియాకు చెందిన ‘‘ద వెస్ట్రన్ మెయిల్’’ ఒక కథనం ప్రచురించింది. ‘‘ముకరం జాకు సిబ్బంది లెక్కలను తప్పుగా చూపించేవారు. కొన్ని మోసాలకు కూడా పాల్పడ్డారు. పిల్లల విషయంలోనూ ఆయన భారీ పరిహారం చెల్లించాల్సి వచ్చింది’’అని పేర్కొంది.

ఒకరోజు శుక్రవారం ప్రార్థనలకు వెళ్తున్నానని పెర్త్‌లోని తన సెక్రటరికీ చెప్పి బయటకు వెళ్లారు. కానీ, ఆయన తిరిగి రాలేదు. తనపై కేసుల్లో చర్యలు తీసుకుంటారేమోనని భయపడి ఆయన తుర్కియేకు వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆయన జీవితం అక్కడే గడిచింది.

ఆ తర్వాత మరో రెండు పెళ్లిళ్లు ఆయన చేసుకున్నారు. కానీ, ఏవీ ఎక్కువ కాలం నిలబడలేదు.

2002లో నిజాం ట్రస్టు నుంచి తీసుకున్న ఆభరణాల కోసం 22 మిలియన్ డాలర్లను ఆయనకు భారత ప్రభుత్వం ఇచ్చింది. కానీ, మార్కెట్‌ విలువలో ఇది కేవలం నాలుగో వంతు మాత్రమే.

2023 ఆరంభంలో ముకరం జా మరణం అనంతరం ఆయన మృతదేహాన్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. పూర్తి లాంచనాలతో అంత్యక్రియలను నిర్వహించారు.

దీనికి ముందు, చివరిసారిగా 2012లో ఆయన హైదరాబాద్‌కు వచ్చి, మక్కా మసీదు ప్రార్థనల్లో పాల్గొన్నారు.

జీవితంలో మీరు ఏదైనా చేయాలని అనుకొని చేయలేనిది ఏదైనా ఉందా? అని జుబ్రిస్కీ అడిగినప్పుడు.. ‘‘కొన్ని సంవత్సరాల క్రితం ఇంగ్లండ్‌లో ఒక స్నేహితుడితో మాట్లాడాను. అతడి దగ్గర రెండో ప్రపంచ యుద్ధంనాటి జలాంతర్గామి ఒకటి ఉండేది. అది నీకేమైనా కావాలా? అని ఆయన అడిగారు. నేను కావాలని చెప్పాను. కానీ, ఆ తర్వాత నేను దాన్ని కొనలేకపోయాను’’అని ఆయన సమాధానం ఇచ్చారు.