WorldWonders

గీతా ప్రెస్ అవార్డు ఓకే…కోటి నగదు మాత్రం వద్దు

గీతా ప్రెస్ అవార్డు ఓకే…కోటి నగదు మాత్రం వద్దు

ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar Pradesh)లోని గోరఖ్‌పుర్‌కు చెందిన గీతాప్రెస్‌ (Gita Press)కు కేంద్ర ప్రభుత్వం 2021 ‘గాంధీ శాంతి బహుమతి (Gandhi Peace Prize)’ని ప్రకటించిన విషయం తెలిసిందే. అవార్డు కింద రూ.కోటి నగదు, అభినందన పత్రం, జ్ఞాపిక, ప్రత్యేకమైన సంప్రదాయ హస్త కళాకృతులను అందించనుంది. అయితే, గీతాప్రెస్‌ సంస్థ రూ.కోటి నగదును తిరస్కరించినట్లు తెలుస్తోంది.‘ఈ ప్రతిష్ఠ్మాతక అవార్డుకు ఎంపికవడం చాలా గౌరవప్రదమైన విషయం. అయితే, ఎలాంటి విరాళాలు స్వీకరించకూడదనేది మా సూత్రం. కాబట్టి, నగదు రూపంలో అవార్డు ప్రోత్సాహకాన్ని తీసుకోకూడదని ట్రస్టీ బోర్డు నిర్ణయించింది’ అని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఆ మొత్తాన్ని వేరే చోట ఖర్చు చేయాలని కేంద్రాన్ని కోరింది. గీతాప్రెస్‌కు ఈ అవార్డు ఇవ్వడంపై వివాదం నెలకొన్న వేళ.. సంస్థ నుంచి ఈ నిర్ణయం వెలువడింది.

గాంధీ నేర్పిన శాంతి బాటన నడుస్తున్న వ్యక్తులు, సంస్థలను గుర్తించి గౌరవించేందుకు 1995లో కేంద్ర ప్రభుత్వం ‘గాంధీ శాంతి బహుమతి’ని ఏర్పాటు చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని అవార్డు ఎంపిక కమిటీ ఆదివారం సమావేశమై ఏకగీవ్రంగా గీతాప్రెస్‌ను ఎంపిక చేసింది. అయితే, కాంగ్రెస్‌ పార్టీ ఈ నిర్ణయాన్ని తప్పుబట్టింది. మరోవైపు భాజపా ఈ విమర్శలను తిప్పికొట్టింది.