Agriculture

పోలవరం తొలిదశకు రూ. 12,911 కోట్లు

పోలవరం తొలిదశకు రూ. 12,911 కోట్లు

క్యాలెండర్‌ ప్రకారం రాష్ట్రంలోని రైతులకు సాగునీరు అందించాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. పోలవరం లెఫ్ట్‌ మెయిన్‌ కెనాల్‌పై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు.

సమీక్షలో భాగంగా అధికారులు పలు కీలక విషయాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ‘‘గైడ్‌బండ్‌లో కుంగిన ప్రాంతాన్ని కేంద్ర బృందం పరిశీలించింది. నేల స్వభావం వల్లే గైడ్‌బండ్‌ కుంగవచ్చని కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది. దెబ్బతిన్న ప్రాంతంపై కేంద్ర అధికారులు పలు సూచనలు చేశారు. పూర్తి విశ్లేషణ తర్వాత మరమ్మతులు సూచిస్తామని కమిటీ చెప్పింది. పోలవరం తొలిదశకు కేంద్రం రూ.12911.15 కోట్లు ఇచ్చేందుకు నిర్ణయించింది. కేబినెట్ నోట్‌పై సంప్రదింపులు కొలిక్కి వస్తున్నాయి. 8,288 మంది పోలవరం ముంపు బాధితుల తరలింపునకు ఏర్పాట్లు చేస్తున్నాం’’ అని అధికారులు సీఎంకు వివరించారు. ప్రభుత్వ ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు.వెలిగొండ, వంశధార, అవుకు సహా పలు ప్రాజెక్టులపైనా సీఎం సమీక్షించారు. అవుకు రెండో టన్నెల్‌ చివరిదశ లైనింగ్‌ జరుగుతోందని అధికారులు తెలిపారు. రెండో టన్నెల్‌ను ఆగస్టులో ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. వెలిగొండ పనుల పురోగతిపై అధికారులు సీఎంకు వివరించారు. రెండో టన్నెల్‌ పనులు కూడా కొలిక్కి వస్తున్నాయని వివరించారు. ఈ ఏడాది వంశధార ఫేజ్‌-2 పనులు పూర్తి చేస్తామని అధికారులు సీఎంకు తెలిపారు.