NRI-NRT

మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో చైనా మాజీ దౌత్యాధికారి సంచలన వ్యాఖ్య

మోదీ  అమెరికా పర్యటన నేపథ్యంలో చైనా మాజీ దౌత్యాధికారి సంచలన వ్యాఖ్య

ప్రధాని మోడీ తొలి అధికారిక అమెరికా పర్యటన ప్రారంభమైన నేపథ్యంలో చైనా తన అక్కసు వెళ్లగక్కింది. చైనా దూకుడుకు భారత్‌ను అడ్డుగోడలా వాడుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని చైనా మాజీ దౌత్యవేత్త వ్యాంగ్ యీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు చైనా ప్రభుత్వ కనుసన్నల్లో నడిచే గ్లోబల్ టైమ్స్ పత్రికలో ఓ వ్యాసం రాసుకొచ్చారు. మూడు దేశాల దౌత్య సంబంధాలపై ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

‘‘ 2014లో మోడీ ప్రధాని అయిన నాటి నుంచీ ఇది ఆయనకు ఆరో అమెరికా పర్యటన, తొలి అధికారిక పర్యటన. చైనా పురోగతిని అడ్డుకునేలా భారత్‌ను ఉసిగొల్పేందుకు అమెరికా ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. చైనాపై వేధింపులకు దిగుతోంది. మోదీకి దగ్గరవ్వాలన్న అమెరికా ప్రయత్నాలను ఫైనాన్షియల్ టైమ్స్ ఇటీవలే విమర్శించింది. ఈ ప్రయత్నాలకు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది. చైనా దూకుడుకు అడ్డుగోడగా భారత్‌ను వినియోగించుకోవాలన్న అమెరికా ప్రయత్నాలపై భారతీయ ప్రముఖులు కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యూహం విఫలం కాక తప్పదు. గ్లోబల్ సప్లై చైన్‌లో చైనా పోషిస్తున్న పాత్రను భారత్‌ సహా మరే ఇతర ఆర్థికవ్యవస్థతోనూ భర్తీ చేయలేరు’’ అని వ్యాఖ్యానించారు.