Business

పోస్టాఫీస్ పథకాల్లో వడ్డీ రేటు పెంపు

పోస్టాఫీస్ పథకాల్లో  వడ్డీ రేటు పెంపు

బ్యాంక్‌ డిపాజిట్లు అందిస్తున్న అధిక రేట్లకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం పోస్టాఫీసు రికరింగ్‌ డిపాజిట్‌తో సహా కొన్ని చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను 0.3 శాతం మేర పెంచింది. జూలై-సెప్టెంబర్‌ త్రైమాసికానికి ఈ పెంపుదల వర్తిస్తుందని శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఐదేండ్ల రికరింగ్‌ డిపాజిట్‌ (ఆర్‌డీ)పై 0.3 శాతం రేటు పెరుగుతుంది. ఆర్‌డీలు వేసినవారికి ప్రస్తుత 6.2 శాతం వడ్డీ రేటుకుగాను ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో 6.5 శాతం వడ్డీ లభిస్తుంది. ఇతర స్కీమ్‌లపై తాజా పెంపు వివరాలు

*  ఒక ఏడాది టర్మ్‌ డిపాజిట్‌పై 0.1 శాతం అధిక వడ్డీ లభిస్తుంది. దీనిపై వడ్డీ రేటు 6.9 శాతానికి చేరుతుంది.

*  రెండేండ్ల టర్మ్‌ డిపాజిట్‌పై రేటు 6.9 శాతం నుంచి 7 శాతానికి పెరుగుతుంది.

* మూడేండ్లు, ఐదేండ్ల పరిమితిగల టర్మ్‌ డిపాజిట్లపై మాత్రం రేటు యథాతథంగా 7%, 7.5% చొప్పునే కొనసాగుతుంది.

*  ప్రాచుర్యం పొందిన పీపీఎఫ్‌ (7.1 శాతం), సేవింగ్స్‌ డిపాజిట్‌ (4 శాతం)పై రేట్లను పెంచలేదు.

*  నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌పై వడ్డీరేటును సైతం యథాతథంగా 7.7 శాతం వద్దే స్థిరంగా ఉంచారు.

*  ఇటీవల ప్రవేశపెట్టిన బాలికల పొదుపు స్కీమ్‌ సుకన్య సమృద్ధిపైనా రేటు ప్రస్తుత 8 శాతం స్థాయిలోనే ఉంచారు.

*  కిసాన్‌ వికాస్‌ పత్రపై 8.2 శాతం, సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్స్‌ స్కీమ్‌పై 7.5 శాతం రేటు కొనసాగుతుంది.

*  7.4 శాతం రాబడినిచ్చే మంథ్లీ ఇన్‌కం స్కీమ్‌పై వడ్డీ రేటు పెంచలేదు.