Health

డాక్టర్స్‌ డే జూలై 1న ఎందుకు జరుపుకుంటారు?

డాక్టర్స్‌ డే జూలై 1న ఎందుకు జరుపుకుంటారు?

ప్రపంచవ్యాప్తంగా వైద్యులకు ఉన్న ప్రత్యేకత మనందరికీ తెలిసిందే. తల్లిదండ్రులు జన్మనిస్తే డాక్టర్లు పునర్జన్మని ఇస్తారు, అందుకే వైద్యులను భగవంతుడితో పోల్చుతుంటారు. అనేక రకాల అనారోగ్య విపత్తులను ధైర్యంగా ఎదుర్కొంటూ, చాలా సందర్భాల్లో తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టి లక్షలాదిమంది ప్రాణాలను కాపాడే వారే వైద్యులు. ప్రపంచాన్ని ఓ ఆట ఆడుకున్న కరోనా వైరస్ ను ముందుండి ఎదుర్కొని ప్రపంచ మానవాళికి ఉపశమనం కలిగించింది డాక్టర్లు మాత్రమే. మానవ జీవితంలో ఎంతో ప్రత్యేకతను కలిగి ఉన్న డాక్టర్ల గురించి, వారి సేవల గురించి జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా గుర్తు చేసుకుందాం.

మన భారతీయులు డాక్టర్ ను దేవుడితో పోల్చుతారు కాబట్టి, వైద్యో నారాయణో హరి అని అంటుంటారు. తల్లిదండ్రులు, గురువు తర్వాత దేవుడిగా భావించేది ఒక్క వైద్యుడినే. మానవాళికి పెను సవాలు విసిరిన కరోనా కష్ట సమయంలో తాము అనారోగ్య పాలవుతామని తెలిసినా, ప్రజలకు సేవలు అందించి కాపాడుకున్నారు. మాస్కులతో, పి పి ఈ కిట్లతో ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అవుతున్న, శానిటైజర్లతో తమ చేతులు ఒరిసిపోతున్న అంకిత భావంతో పనిచేసి రోగులను చిరునవ్వులతో ఇంటికి పంపిన ఘనత డాక్టర్లది

బీసీ రాయ్ జన్మదినమే జాతీయ వైద్యుల దినోత్సవం..డాక్టర్ బిధన్ చంద్ర రాయ్  పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రి. ఈయన హయాంలోనే అనేక వైద్య సంస్థలు పురుడు పోసుకున్నాయి. కమలా నెహ్రు మెమోరియల్ ఆసుపత్రి, విక్టోరియా ఇన్స్టిట్యూట్, జాదవ్ పూర్ టీబీ ఆసుపత్రి, చిత్తరంజన్ సేవాసదన్, చిత్తరంజన్ క్యాన్సర్ హాస్పిటల్, చిత్తరంజన్ సేవాసదన్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ తదితర సంస్థలన్నీ ఆయన హయాంలోనే మొదలయ్యాయి.అంతేకాక మహిళలకు నర్సింగ్ లో, సామాజిక సేవలో శిక్షణ ఇప్పించడానికి చొరవ చూపి ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయించారు. వైద్యరంగంలోనే కాకుండా కలకత్తా మేయర్ గా, కలకత్తా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గా సమాజానికి విశేష సేవలు అందించిన బీపీ రాయ్ జన్మదినమైన జులై 1 ని జాతీయ వైద్యుల దినోత్సవంగా( National Doctors Day ) జరుపుకుంటారు.సమయ సందర్భాలు ఎంచక, అలసటను చూపక ప్రమాదకర స్థితిలో వచ్చిన రోగికి వైద్య చికిత్స అందించాలనే తపనతో డాక్టర్లు ఉంటారు. అనేక క్లిష్ట సమయాల్లో కఠిన పరిస్థితులను ఎదుర్కొని నియమ, నిబద్ధతతో, త్యాగనిరతితో, సహనంతో రోగులకు సేవలు చేసే వైద్యులను, వారి సేవలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.