Business

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్-TNI నేటి వాణిజ్య వార్తలు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్-TNI నేటి వాణిజ్య వార్తలు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే హెచ్ఆర్ఏ పెరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మార్చిలోనే డీఏను పెంచడంతో అందుకు అనుగుణంగా హెచ్ఆర్ఏ పెరగనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ చివరిసారిగా 2021 జూలైలో పెరిగింది. అప్పుడు డీఏ తొలిసారి 25 శాతం దాటి 28 శాతానికి పెరిగింది. ఇప్పుడు కూడా డీఏను సవరించడంతో కొత్త స్థాయికి చేరుకుంది. దీంతో మళ్లీ హెచ్ఆర్ఏ కూడా పెంచాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఒక్క రోజులోనే 3.69 లక్షల ధ్రువపత్రాల జారీ

ఏపీ వ్యాప్తంగా ‘జగనన్న సురక్ష’ పథకం విజయవంతంగా కొనసాగుతోందని ప్రభుత్వం తెలిపింది. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా 1305 శిభిరాలు నిర్వహించి.. ప్రజలకు వివిధ రకాల 3,69,373 ధ్రువపత్రాలు జారీ చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. వీటిలో పెద్ద సంఖ్యలో ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు ఉన్నట్లు వెల్లడించింది. అటు శనివారం ప్రారంభించిన సురక్ష శిబిరాలను నెల రోజుల పాటు 15,004 సచివాలయాల్లో నిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపింది.

జూన్‌లో శ్రీవారి హుండీ ఆదాయం ఎన్ని కొట్లో తెలుసా?

శ్రీవారి హుండీ ఆదాయం మరో నెలలో రూ.వంద కోట్లను దాటింది. జూన్‌ మాసంలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా రూ.116.14 కోట్ల ఆదాయం లభించింది. గత సంవత్సరం ఏప్రిల్‌ నుంచి ప్రతి నెల రూ.వంద కోట్లకు పైగానే హుండీ కానుకలు వస్తున్నాయి.

* జీఎస్‌టీ వసూళ్లు రూ.1.61 లక్షల కోట్లు

ఈ ఏడాది జూన్‌ నెలకు వస్తు, సేవల పన్ను (జీఎ్‌సటీ) స్థూల వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 12 శాతం వృద్ధితో రూ.1,61,497 కోట్లకు చేరుకున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ శనివారం వెల్లడించింది. 2017 జూలై 1 నుంచి జీఎ్‌సటీ అమలులోకి వచ్చినప్పటి నుంచి నెలవారీ వసూళ్లు రూ.1.60 లక్షల కోట్ల పైస్థాయిలో నమోదు కావడం ఇది నాలుగోసారి. గత నెల మొత్తం ఆదాయంలో సెంట్రల్‌ జీఎ్‌సటీ రూ.31,013 కోట్లు, స్టేట్‌ జీఎ్‌సటీ రూ.38,292 కోట్లు, ఇంటిగ్రేటెడ్‌ జీఎస్‌టీ రూ.80,292 కోట్లుగా ఉంది. పరిహార సెస్సు రూపంలో మరో రూ.11,900 కోట్ల ఆదాయం లభించింది. ఈ ఏడాది మే నెలలో జీఎ్‌సటీ వసూళ్లు రూ.1.57 లక్షల కోట్ల స్థాయిలో ఉండగా.. ఏప్రిల్‌లో ఆల్‌టైం రికార్డు స్థాయి రూ.1.87 లక్షల కోట్లకు పెరిగాయి.

పోలవరం నిర్వాసితుల సమస్యలపై 5న చర్చలు

పోలవరం నిర్వాసితుల సమస్యలపై చర్చించేందుకు జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు సంబంధిత ఉన్నతాధికారులతో ఈనెల 5వ తేదీన సమావేశం ఏర్పాటు చేసినట్లు సీపీఎం రాష్ట్ర నాయకులు తెలిపారు. నిర్వాసితుల సమస్యలపై సీపీఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన మహాపాదయాత్ర, ఈనెల 4న విజయవాడలో మహాధర్నాతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కె.ఎస్‌.లక్ష్మణరావు, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎం.ఎ.గఫూర్‌, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరరావు తదితరులతో కూడిన ప్రతినిధి బృందం శనివారం మంత్రి అంబటి రాంబాబును గుంటూరులో కలిసి నిర్వాసితుల సమస్యలపై వినతి పత్రాన్ని సమర్పించింది. మంత్రి సానుకూలంగా స్పందిస్తూ ఈనెల 5న సమావేశం ఏర్పాటు చేసినట్లు సీపీఎం ప్రతినిధి బృందం తెలిపింది

పలు రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే

మరమ్మతులు చేస్తున్న కారణంగా సోమవారం నుండి కింది ట్రైన్లను జూలై 9 వరకు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. నెం.07755 డోర్నకల్-విజయవాడ, నెం. 07756 విజయవాడ- డోర్నకల్, నెం. 07278 భద్రాచలం- విజయవాడ, నెం. 07979 విజయవాడ- భద్రాచలం రైళ్లను జూలై 3 నుండి 9 వరకు రద్దు చేసామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఈ మేరకు తాజాగా ఒక ప్రకటన విడుదల చేసారు.

రిస్క్ లేకుండా రూ.100 పొదుపుతో రూ.55 లక్షలు పొందండి

డబ్బులను పొదుపు చెయ్యాలని చాలా మంది అనుకుంటారు.. అయితే అందుకోసం ఏదైనా స్కీమ్ లలో ఇన్వెస్ట్ చెయ్యాలని అనుకుంటారు.రిస్క్ లేకుండా రాబడి పొందాలంటే స్మాల్ సేవింగ్ స్కీమ్స్ ఎంచుకోవాలి. అదే రిస్క్ ఉన్న పర్లేదు అనుకుంటే.. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిల్లో డబ్బులు దాచుకోవచ్చు. ఇలా మీరు మీకు నచ్చిన ఆప్షన్ ఎంచుకోవచ్చు.. రిస్క్ తీసుకోవడానికి చాలా మంది ఇష్టపడరు..అందువల్ల మనం ఇప్పుడు రిస్క్ లేకుండా అదిరే బెనిఫిట్ కల్పించే ఒక స్కీమ్ గురించి తెలుసుకోబోతున్నాం. అదే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్… ఇందులో ఎన్నో రకాల స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి.. ఈ పథకంలో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్నాయని నిపుణులు అంటున్నారు.

ఢిల్లీ-మీరట్ ర్యాపిడ్ రైల్ ప్రాజెక్ట్

ఢిల్లీ-మీరట్ రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కారిడార్ ప్రాజెక్ట్ కోసం భూమి కేటాయింపునకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమోదం తెలిపారని రాజ్ నివాస్ అధికారులు శనివారం తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్‌మెంట్ బోర్డ్ (DUSIB)కి చెందిన జంగ్‌పురా వద్ద 297 చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయించడానికి ఢిల్లీ LG ఆమోదించింది. అధికారుల ప్రకారం, భూమి కేటాయింపు “గత రెండు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉంది” మరియు నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఎన్‌సిఆర్‌టిసి) నేతృత్వంలోని ఆర్‌ఆర్‌టిఎస్ ప్రాజెక్ట్ అమలుకు కీలకం. ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ RRTS కారిడార్‌లో సెమీ-హై-స్పీడ్ ప్రాంతీయ రైలు సర్వీస్ RAPIDX ఢిల్లీ నుండి మీరట్ మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.

మెట్రోలో రోజుకు 4.90 లక్షల మంది ప్రయాణం

 హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని మెట్రో రైలు ఎండీ NVS రెడ్డి తెలిపారు. మెట్రో ట్రైన్ సేవలు ప్రారంభమైన 2017 నవంబర్ 29 నుంచి ఇప్పటివరకు 40 కోట్ల మంది ప్రయాణం చేశారని చెప్పారు. ప్రస్తుతం పని దినాల్లో రోజుకు 4.90 లక్షల మంది మెట్రోలో వెళ్తున్నారని పేర్కొన్నారు. ప్రయాణికుల్లో ఎక్కువగా ఐటీ ఉద్యోగులు, విద్యార్థులే ఉన్నారని వివరించారు.