Fashion

నిరాశలో మనోధైర్యం పొందడం ఎలా?

నిరాశలో మనోధైర్యం పొందడం ఎలా?

కొన్నిసార్లు జీవితం నిరాశాపూరితం అవుతుంది. ఒకటి రెండు వారాలవరకూ ఈ పరిస్థితిని తట్టుకోవచ్చు. అంతకుమించితే మాత్రం కుంగుబాటుగా పరిణమిస్తుంది. ఈ దశలో నిపుణుల సాయం అవసరం కావచ్చు.

కుంగుబాటు అనేది మితంగా, ఓ మోస్తరుగా, తీవ్రంగా.. ఇలా మూడు దశలలో ఇబ్బంది పెడుతుంది. సన్నిహితుల మరణాలు, నిరుద్యోగం, బంధాలకు బీటలు.. తదితర బాధాకర సంఘటనల కారణంగా కుంగుబాటు ఎదురవుతుంది. కుటుంబానికి, స్నేహితులకు దూరంగా, ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితి కూడా కుంగుబాటును పెంచుతుంది. దీనికి ఆరోగ్య సమస్యలు తోడైతే పరిస్థితి దారుణంగా మారుతుంది. బాల్యంలోని చేదు అనుభవాలు, అస్థిరమైన కుటుంబ వాతావరణం మనసును ప్రభావితం చేసి.. కుంగతీస్తాయి. కొన్నిసార్లు ఏ కారణమూ లేకపోయినా కుంగుబాటు మనల్ని పట్టి పీడించవచ్చు.

లక్షణాలు:అసంతృప్తి, నిరాశ, సామాజిక జీవితం పట్ల నిరాసక్తత, ఏకాగ్రత కుదరకపోవడం, ముఖ్య నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఆత్మవిశ్వాసం లోపించడం, అర్థంలేని అపరాధ భావం, తీవ్ర నిరాశ, ఆత్మహత్య ఆలోచనలు, అయోమయం, ఆందోళన, అలసట, అతినిద్ర, నిద్రలేమి, తలనొప్పి, దాంపత్య జీవితం పట్ల అనాసక్తత, అతి తిండి, అసలు తినక పోవడం, బరువు పెరగడం లేదా బాగా తగ్గడం.. ఇవన్నీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కుంగుబాటు లక్షణాలే.

ఎదుర్కోవడం ఎలా?సన్నిహితులతో మనసు విప్పి మాట్లాడాలి. మన భావాలను ఒక దగ్గర రాసుకోవాలి. వ్యాయామంతో మనల్ని మనం చురుగ్గా ఉంచుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలతో సమతుల ఆహారం తీసుకోవాలి. మద్యం, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి. నియమిత వేళల్లోనే నిద్రించాలి. యోగా, అరోమాపతి లాంటివి మనసుకు ఉపశమనం కలిగిస్తాయి. సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం.. ఇలా ఇష్టమైన వ్యాపకాలకు సమయం కేటాయించాలి. మనపట్ల మనం దయతో ఉండాలి. ఏదైనా సపోర్ట్‌ గ్రూప్‌లో చేరాలి. ఎట్టి పరిస్థితి లోనూ ఆశావాదాన్ని వదలకూడదు. జీవితం అమూల్యమైంది. కుంగుతూ కూర్చుంటే విజయాల నింగిని చేరుకోలేం.

వైద్యుల సాయం:కుంగుబాటు అనేది ఓ మోస్తరుగా లేదా తీవ్రంగా.. అదీ ఎక్కువ కాలం కొనసాగితే మానసిక వైద్యులను సంప్రదించాలి. నిపుణులు యాంటీడిప్రెసంట్స్‌నుసూచిస్తారు. వీలైనంత త్వరగా ఆ ఊబి నుంచి బయటపడొచ్చు. కొత్త జీవితాన్ని ఆరంభించవచ్చు