NRI-NRT

భారత సంతతి వైద్యుడిని అరెస్ట్ చేసిన ఎఫ్‌బీఐ

భారత సంతతి వైద్యుడిని అరెస్ట్ చేసిన ఎఫ్‌బీఐ

అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్ బీఐ (ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) ఓ భారత సంతతి వైద్యుడ్ని అరెస్ట్ చేసింది. విమానంలో తన పక్క సీట్లో 14 ఏళ్ల టీనేజి బాలిక కూర్చుని ఉండగా, ఆ డాక్టర్ అసభ్యంగా ప్రవర్తించాడు. గతేడాది మే నెలలో హవాయి దీవుల్లోని హోనోలులూ నుంచి బోస్టన్ నగరానికి విమానం వెళుతుండగా ఈ ఘటన జరిగింది. అతడిని డాక్టర్ సుదీప్త మొహంతి అని గుర్తించారు. 33 ఏళ్ల ఆ భారత సంతతి వ్యక్తి బోస్టన్ లోని బెత్ ఇజ్రాయెల్ డీకోనెస్ మెడికల్ సెంటర్ ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్నాడు. ఓ మహిళతో కలిసి విమాన ప్రయాణం చేస్తున్న డాక్టర్ మొహంతి పక్క సీట్లో బాలిక కూర్చుని ఉండగా, దుప్పటి మెడవరకు కప్పుకుని హస్త ప్రయోగం చేశాడు.

ఆ టీనేజి అమ్మాయి తన బామ్మ, తాతయ్యతో కలిసి కలిసి బోస్టన్ వెళుతోంది. అయితే, పక్కసీట్లోని వ్యక్తి (డాక్టర్ మొహంతి) దుప్పటి కప్పుకున్నప్పటికీ, కాళ్లు, చేతులు పైకి కిందికీ కదులుతుండడం ఆమె గమనించింది. కాసేపటికి దుప్పటి కిందపడిపోవడంతో డాక్టర్ మొహంతి హస్తప్రయోగం చేస్తుండడాన్ని ఆ బాలిక స్పష్టంగా చూసింది. దాంతో హడలిపోయిన ఆ బాలిక ఆ విమానంలో మరో వరుసలో ఖాళీగా ఉన్న సీట్లోకి వెళ్లి కూర్చుంది. విమానం బోస్టన్ లో దిగిన తర్వాత డాక్టర్ చర్యలను తన తల్లిదండ్రులకు తెలిపింది. దాంతో ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే విమానంలో తానేమీ చేయలేదని డాక్టర్ మొహంతి బుకాయించే ప్రయత్నం చేశాడు. అంతేకాదు, అలాంటి ఘటన జరిగినట్టు తనకేమీ గుర్తు లేదని అన్నాడు.

ఆధారాలను బట్టి అతడు విమానంలో అసభ్యకరంగా ప్రవర్తించినట్టు గుర్తించారు. డాక్టర్ మొహంతిని గురువారం నాడు అరెస్ట్ చేసిన ఎఫ్ బీఐ పోలీసులు ఫెడరల్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో నేర నిరూపణ అయితే, ఆ డాక్టర్ కు 90 రోజుల జైలు, 5 వేల డాలర్ల జరిమానా, ఏడాది పాటు పోలీసుల పర్యవేక్షణలో సామాజిక జీవనం శిక్ష ఖరారు చేసే అవకాశాలున్నాయి.కాగా, ఈ కేసులో డాక్టర్ మొహంతికి వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ లభించడంతో విడుదలయ్యాడు. ఈ సందర్భంగా కోర్టు షరతులు విధించింది. బెయిల్ కాలంలో సదరు డాక్టర్ 18 ఏళ్ల కంటే తక్కువ వయసున్నవారికి దూరంగా ఉండాలి. 18 ఏళ్ల కంటే తక్కువ వయసున్నవారు గుమికూడే ప్రదేశాలకు కూడా అతడు వెళ్లరాదని కోర్టు స్పష్టం చేసింది.