ScienceAndTech

సెల్‌ఫోన్‌లో టీఎస్ఆర్టీసీ బస్ ట్రాకింగ్ యాప్

సెల్‌ఫోన్‌లో టీఎస్ఆర్టీసీ బస్ ట్రాకింగ్ యాప్

సాంకేతికతను అందిపుచ్చుకుని ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) మరో ముందుడుగు వేసింది. ప్రయాణికులు ఎలాంటి ఇబ్బంది పడకుండా సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు సంస్థ అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. అందుకు అత్యాధునిక ఫీచర్లతో బస్ ట్రాకింగ్ యాప్ ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చింది.

ఈ బస్ ట్రాకింగ్ యాప్‌నకు ‘గమ్యం’గా నామకరణం చేసింది. హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ ప్రాంగణంలో ‘గమ్యం’ యాప్ ను శనివారం సంస్థ ఉన్నతాధికారులతో కలిసి టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు ప్రారంభించారు. యాప్ సంబంధించిన లోగోను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముందుగా టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో వీలినం చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెబుతూ టీఎస్ఆర్టీసీ చైర్మన్ శ్రీ బాజిరెడ్డి గోవర్దన్ గారికి కూడా సంస్థ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ప్రభుత్వం తీసుకున్న ఈ గొప్ప నిర్ణయాన్ని సంస్థ స్వాగతిస్తూ.. రెట్టించిన ఉత్సాహంతో ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించగలమనే విశ్వాసం తనకుందన్నారు.

రెండేళ్లుగా ప్రజలకు ప్రజా రవాణా వ్యవస్థను దగ్గర చేసేందుకు ఎన్నో విప్లవాత్మక మార్పులకు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం శ్రీకారం చుట్టిందని, ప్రతి రోజు 45 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్న సంస్థ మార్కెట్ లోని పోటీని దీటుగా ఎదుర్కోనేందుకు ఈ మధ్యకాలంలో అత్యాధునిక హంగులతో కూడిన 776 కొత్త బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు.

ఆపై యాప్ ప్రయోజనాలను వివరిస్తూ అరచేతిలో స్మార్ట్  ఫోన్ ఉంటే.. టీఎస్ఆర్టీసీ బస్సుల సమాచారన్నంతా తెలుసుకోవచ్చని ఆయన తెలిపారు. ఇకపై బస్సు ఎక్కడుందో, ఎప్పుడొస్తుందో అని వేచిచూడాల్సిన అవసరం లేదని, అత్యాధునిక ఫీచర్లు గల ‘గమ్యం’ యాప్ తో ఆర్టీసీ బస్సు మన వద్దకు రావడానికి ఎంత సమయం పడుతుందో తెలుసుకోవచ్చని స్పష్టం చేశారు. “ప్రస్తుతం టీఎస్ఆర్టీసీకి చెందిన 4,170 బస్సులకు ట్రాకింగ్ సదుపాయం కల్పించాం. హైదరాబాద్ లోని పుష్ఫక్ ఎయిర్ పోర్ట్, మెట్రో ఎక్స్ ప్రెస్ సర్వీసులకు ట్రాకింగ్ సౌకర్యం అందుబాటులో ఉంది. అదే విధంగా జిల్లాల్లో పల్లె వెలుగు మినహా అన్ని బస్సులకు ఈ సదుపాయం కల్పించబడింది. అక్టోబర్ నెల నుంచి మిగతా సర్వీసులన్నింటికీ ట్రాకింగ్ సదుపాయాన్ని అనుసంధానం చేయబోతున్నాం.