Sports

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్

ఫ్లోరిడాలో జరుగుతున్న ఇండియా వర్సెస్ వెస్టిండీస్ నాలుగో టీ20లో టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ రోవ్‌మెన్ పావెల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నేటి మ్యాచ్‌లో భారత జట్టు ఎలాంటి మార్పులు లేకుండా బరిలో దిగుతోంది..

మొదటి రెండు టీ20ల్లో గెలిచిన వెస్టిండీస్, నేటి మ్యాచ్ గెలిస్తే సిరీస్ సొంతం చేసుకుంటుంది. మూడో టీ20లో గెలిచి కమ్‌బ్యాక్ ఇచ్చిన భారత జట్టు, సిరీస్ గెలవాలంటే మిగిలిన రెండు టీ20ల్లోనూ గెలవాల్సి ఉంటుంది. ఇషాన్ కిషన్ ప్లేస్‌లో మూడో టీ20లో ఆరంగ్రేటం చేసిన యశస్వి జైస్వాల్ 1 పరుగుకే అవుట్ అయ్యాడు. శుబ్‌మన్ గిల్ కూడా వెస్టిండీస్ టూర్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు..

మూడో వన్డేలో చేసిన 85 పరుగులు తప్ప, శుబ్‌మన్ గిల్ బ్యాటు నుంచి చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ రాలేదు. సూర్యకుమార్ యాదవ్, మూడో టీ20లో సెన్సేషనల్ పర్ఫామెన్స్‌తో టీమిండియాకి విజయాన్ని అందించాడు. 3 టీ20ల్లో 139 పరుగులు చేసిన తిలక్ వర్మ, టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. మిగిలిన రెండు టీ20ల్లోనూ తిలక్ వర్మ మంచి పర్ఫామెన్స్ ఇస్తే, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో చోటు దక్కించుకునేందుకు అవకాశాలు పెరుగుతాయి..

మూడో టీ20లో తిలక్ వర్మ 49 పరుగుల వద్ద ఉన్నప్పుడు, హార్ధిక్ పాండ్యా సిక్సర్ కొట్టి మ్యాచ్‌ని ఫినిష్ చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. అదీకాకుండా దాదాపు మ్యాచ్ ఫినిష్ అయిన సమయంలో సంజూ శాంసన్ కంటే హార్ధిక్ పాండ్యా క్రీజులోకి రావడం కూడా అతనిపై సెల్ఫిష్ అనే ట్రోల్స్ రావడానికి కారణమయ్యాయి..

భారత బౌలర్లు కుల్దీప్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, యజ్వేంద్ర చాహాల్ నాలుగేసి వికెట్లు తీశారు. అయితే భారత ఫాస్ట్ బౌలర్ల నుంచి మాత్రం ఆశించిన పర్ఫామెన్స్ రాలేదు. అర్ష్‌దీప్ సింగ్ 3 మ్యాచుల్లో 3 వికెట్లు తీయగా ముకేశ్ కుమార్ 2 వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్ అయితే అటు బ్యాటుతో కానీ, ఇటు బాల్‌తో కానీ ఇప్పటిదాకా ఆకట్టుకోలేకపోయాడు.

నేటి మ్యాచ్‌లో వెస్టిండీస్ మూడు మార్పులతో బరిలో దిగుతోంది. గాయం కారణంగా మూడో టీ20లో ఆడని జాసన్ హోల్డర్ తిరిగి జట్టులోకి రాగా షై హోప్, ఓడియన్ స్మిత్‌లకు తుది జట్టులో చోటు దక్కింది.

వెస్టిండీస్ జట్టు: బ్రెండన్ కింగ్, కైల్ మేయర్స్, షై హోప్, నికోలస్ పూరన్, రోవ్‌మెన్ పావెల్ (కెప్టెన్), సిమ్రాన్ హెట్మయర్, జాసన్ హోల్డర్, రొమారియో షెఫర్డ్, ఓడియన్ స్మిత్, అకీల్ హుస్సేన్, ఓబెడ్ మెక్‌కాయ్

భారత జట్టు: యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్ధక్ పాండ్యా (కెప్టెన్), సంజూ శాంసన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, యజ్వేంద్ర చాహాల్, ముకేశ్ కుమార్