NRI-NRT

ఇమ్మిగ్రేషన్‌ విధానం మార్చాలి అన్న బైడెన్‌ వర్గం

ఇమ్మిగ్రేషన్‌ విధానం మార్చాలి అన్న బైడెన్‌ వర్గం

అమెరికాలో కాలం చెల్లిన ఇమ్మిగ్రేషన్‌ విధానాన్ని (US Immigration System) మార్చాలని బైడెన్‌ కార్యవర్గం దేశ కాంగ్రెస్‌ను కోరింది. ఈ విషయాన్ని శ్వేత సౌధం సోమవారం వెల్లడించింది. ప్రస్తుత విధానంలో కొన్ని తాత్కాలిక వీసాలపై ఉన్న ఉద్యోగులు ఉపాధి కోల్పోతే.. కొత్త ఉద్యోగం వెతుక్కోవడం, వేరే రకం వీసా పొందడం లేదా స్వదేశానికి వెళ్లడానికి కేవలం 60 రోజుల వ్యవధి మాత్రమే ఉంటోంది.‘‘కాలం చెల్లిన దయనీయమైన ఇమ్మిగ్రేషన్‌ విధానాన్ని మార్చాలని ఇప్పటికే చాలా సార్లు కాంగ్రెస్‌కు చెప్పాం. 20 ఏళ్ల క్రితం మార్పులు జరిగిన తాత్కాలిక వీసా విధానం మొత్తాన్ని అప్‌డేట్‌ చేసే విషయంలో మేము చాలా స్పష్టంగా ఉన్నాం. కాంగ్రెస్‌ దానిపని అది పూర్తి చేసి.. చట్టాన్ని ఆమోదించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం మనం ఉన్న 21వ శతాబ్దానికి అనుగుణంగా వీసా విధానాలను మార్చాల్సిన అవసరం ఉంది ’’ అని శ్వేత సౌధం ప్రెస్‌ సెక్రటరీ కరీన్‌ జేన్‌ రోజువారీ ప్రెస్‌మీట్‌లో పేర్కొన్నారు.

జోబైడెన్‌ అధికారంలోకి వచ్చిన తొలిరోజే ఇమ్మిగ్రేషన్‌ చట్టంలో నాలుగో సవరణను ముందుకు తీసుకొచ్చారని కరీన్‌ గుర్తు చేశారు. ఆయన ఇమ్మిగ్రేషన్‌లో మార్పులపై చాలా పట్టుదలతో ఉన్నారన్నారు. ఈ కాలం చెల్లిన వ్యవస్థ మారాల్సిన అవసరం ఉందని బైడెన్‌ బలంగా భావిస్తున్నారన్నారు.