Business

నేడు స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు

నేడు స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు

అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల మధ్య దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు సెప్టెంబరు నెలకు స్వల్ప లాభాలతో స్వాగతం పలికాయి. ఉదయం 9:21 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 77 పాయింట్ల లాభంతో 64,921 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 44 పాయింట్లు లాభపడి 19,297 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.63 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 30 సూచీలో టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, పవర్‌గ్రిడ్‌, ఎంఅండ్‌ఎం, టాటా మోటార్స్‌, టెక్‌ మహీంద్రా, ఎస్‌బీఐ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఎన్‌టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

అమెరికా మార్కెట్లు గురువారం మిశ్రమంగా ముగిశాయి. ఐరోపా సూచీలు స్వల్ప నష్టాలతో సరిపెట్టుకున్నాయి. ఆసియా పసిఫిక్‌ సూచీలు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ఆగస్టులో పారిశ్రామిక కార్యకలాపాలు పుంజుకున్నాయన్న గణాంకాల నేపథ్యంలో చైనా మార్కెట్లు సానుకూలంగా కదులుతున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు గురువారం రూ.2,973 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. దేశీయ మదుపర్లు రూ.4,382 కోట్ల విలువ చేసే షేర్లను కొన్నారు. మన దేశ జీడీపీ వృద్ధి ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో 7.8 శాతంగా నమోదైంది. పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా భారత్‌ నిలిచింది.

అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్ల విలువలను గణనీయంగా పెంచేందుకు మారిషస్‌కు చెందిన ‘అజ్ఞాత’ పెట్టుబడి సంస్థలను ఉపయోగించి ప్రమోటరు కుటుంబానికి చెందిన సంబంధీకులు రహస్యంగా రూ.లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు ఓసీసీఆర్‌పీ ఆరోపించింది. దీంతో నిన్న గ్రూప్‌ కంపెనీల షేర్లు నష్టపోయాయి. నేడు కూడా మదుపర్లు వీటిపై దృష్టి సారించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన జెన్‌ టెక్నాలజీస్‌కు రూ.72.29 కోట్ల విలువ చేసే ఆర్డర్‌ లభించింది. జియోఫిన్‌ షేరును నేటి నుంచి ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈకి చెందిన అన్ని సూచీల నుంచి తొలగించనున్నట్లు స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా షేర్లపై మదుపర్లు దృష్టి సారించొచ్చు.