DailyDose

విమానంలో అసభ్యకర చర్యలకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్

విమానంలో అసభ్యకర చర్యలకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్

విమానంలో (Flight) ఎయిర్‌ హోస్టెస్‌కు (Air Hostess) ముద్దు పెట్టేందుకు యత్నించి ఓ బంగ్లాదేశీయుడు (Bangladeshi National) అరెస్టైన ఘటన ముంబయిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 6న విస్తారా విమానం ‘యూకే 234’ మస్కట్‌ నుంచి ఢాకా బయలుదేరింది. గురువారం తెల్లవారు జామున ఆ విమానాన్ని ముంబయిలో ల్యాండ్‌ చేయాల్సి ఉంది. కాసేపట్లో విమానం ముంబయి చేరుతుందనగా.. అందులో ప్రయాణిస్తున్న మహమ్మద్‌ దులాల్‌ అనే వ్యక్తి తన సీటు నుంచి లేచాడు. పక్కనే ఉన్న ఎయిర్‌ హోస్టెస్‌ను  కౌగిలించుకున్నాడు. ఆమె తేరుకునే లోపే ముద్దు పెట్టేందుకు యత్నించాడు. ఈ హఠాత్పరిణామాన్ని చూసి మిగతా ప్రయాణికులు అతడిని వారించే ప్రయత్నం చేశారు. విమానయాన సిబ్బంది మందలించినా.. వారితోనూ అసభ్యంగా ప్రవర్తించాడు. చివరికి కెప్టెన్‌ జోక్యం చేసుకొని రెడ్ వార్నింగ్‌ కార్డ్‌ చదివాడు. అతడిని వికృత ప్రయాణికుడిగా ప్రకటించాడు.

ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహరాజ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ల్యాండ్‌ అయిన తరువాత నిందితుణ్ని భద్రతా సిబ్బందికి అప్పగించారు. వారు అతడిని సహర్‌ పోలీస్‌స్టేషన్‌ను తరలించారు. ఎయిర్‌ హోస్టెస్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుణ్ని అరెస్టు చేశారు. స్థానిక న్యాయస్థానంలో హాజరుపరచగా.. శుక్రవారం వరకు పోలీసు కస్టడీలో ఉంచాలని న్యాయమూర్తి ఆదేశించారు. విస్తారా తమ ప్రయాణికులు, సిబ్బంది భద్రతకు ప్రాధాన్యత ఇస్తుందని ఆ విమానయాన సంస్థ ప్రకటించింది. వికృత ప్రవర్తన వంటి చర్యలను ఎంత మాత్రం సహించబోదని స్పష్టం చేసింది.