Movies

‘కుమారి శ్రీమతి’ వెబ్‌సిరీస్‌ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది

‘కుమారి శ్రీమతి’ వెబ్‌సిరీస్‌ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది

‘మన ఇల్లు మనకు వచ్చే వరకూ నేను పెళ్లి చేసుకోను’ అంటోంది నిత్యామేనన్‌. ఆమె కీలక పాత్రలో గోమఠేష్‌ ఉపాధ్యాయ దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్‌ వెబ్‌సిరీస్‌ ‘కుమారి శ్రీమతి’. గౌతమి, తిరువీర్‌, నిరుపమ్‌, తాళ్లూరి రామేశ్వరి, ప్రణీత పట్నాయక్‌, ప్రేమ్‌ సాగర్‌, నరేష్‌, మురళీమోహన్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సిరీస్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా సెప్టెంబరు 28వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఈ సందర్భంగా సినీ నటుడు నాని ఈ వెబ్‌సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. తాతల నాటి ఇంటిని తిరిగి దక్కించుకునేందుకు ఇటికెల పూడి శ్రీమతి (నిత్యామేనన్‌) బార్‌ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఈ క్రమంలో ఆమెకు ఎదురైన సవాళ్లు ఏంటి? మరి ఇంటిని దక్కించుకుని, పెళ్లి చేసుకుందా? తెలియాలంటే సిరీస్‌ చూడాల్సిందే!

ఆద్యంతం అలరించేలా సున్నితమైన హాస్యంతో సిరీస్‌ను తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది. ‘అబ్దుల్‌ కలాం.. రజనీకాంత్‌.. ఇటికెలపూడి శ్రీమతి..’ అంటూ నిత్యామేనన్‌ చెప్పే డైలాగ్‌ అలరిస్తోంది. దర్శకుడు-నటుడు శ్రీనివాస్‌ అవసరాల ఈ సిరీస్‌కు స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ‘కుమారి శ్రీమతి’ స్ట్రీమింగ్‌ కానుంది. ఎర్లీ మాన్‌సూన్‌ టేల్స్‌, స్వప్న సినిమాస్‌ ఈ సిరీస్‌ను నిర్మించాయి.

మరోవైపు ‘కుమారి శ్రీమతి’ సిరీస్‌ బృందం వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది. మొదటి ఎపిసోడ్‌ను థియేటర్‌లో ప్రదర్శించనున్నారు. సెప్టెంబరు 24న, సాయంత్రం 4 గంటలకు కాకినాడ (పద్మ ప్రియ కాంప్లెక్స్‌), భీమవరం(నటరాజ్‌ థియేటర్‌)లలో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇందుకోసం రిజిస్ట్రేషన్స్‌ ఆహ్వానిస్తోంది.