Politics

ప్రధాని అధికారిక నివాసం 10 డౌనింగ్‌ స్ట్రీట్‌లో శునకం-పిల్లి కొట్లాట

ప్రధాని అధికారిక నివాసం 10 డౌనింగ్‌ స్ట్రీట్‌లో శునకం-పిల్లి కొట్లాట

చారిత్రక నేపథ్యం ఉన్న ఆ ఇంట్లో శునకం-పిల్లి మధ్య పోరు కొనసాగుతోందట. అదెక్కడో కాదు.. బ్రిటన్‌ ప్రధాని అధికారిక నివాసం 10 డౌనింగ్‌ స్ట్రీట్‌ లోని ఈ రహస్యాన్ని ప్రధాని రిషి సునాక్‌ సతీమణి అక్షతామూర్తి స్వయంగా వెల్లడించారు. అసలు విషయం ఏమిటంటే..!

తాజాగా అక్షతా మూర్తి పాఠశాల విద్యార్థుల కోసం స్కై కిడ్స్‌ ఛానల్‌కి ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా అధికారిక నివాసానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. లాబ్రడార్‌ జాతికి చెందిన తన పెంపుడు శునకం నోవా, ఆ చారిత్రక ప్రాంతంలో ఉండే ల్యారీ (Cat) మధ్య ఎన్నో భావోద్వేగ సంఘటనలను వివరించారు.

‘275 ఏళ్లుగా ఎంతోమంది ప్రధానమంత్రులకు అధికారిక నివాసంగా ఉంటోంది. ఈ చారిత్రక భవనాన్ని చూడటం, ఇక్కడ నివసిస్తుండటాన్ని చాలా అదృష్టంగా, గొప్పగా భావిస్తున్నాను. అయితే, మా శునకం నోవాకు మాత్రం మిశ్రమ భావోద్వేగాలు ఉన్నాయి. ఇక్కడ ఉండే ల్యారీ (Cat)తో కలిసిపోదు. వాటి మధ్య వాగ్వాదం జరుగుతుంది. అందులో ల్యారీదే పైచేయి అవుతుంది’ అని అక్షతా మూర్తి పేర్కొన్నారు.

ప్రధాని నివాసంలో ఎలుకలను రాకుండా ల్యారీ కీలక పాత్ర పోషిస్తుందట. గత 12ఏళ్లుగా అక్కడే ఉంటోందట. ఈ కాలంలో డేవిడ్‌ కామెరూన్‌, థెరెసా మే, బోరిస్‌ జాన్సన్‌, లిజ్‌ ట్రస్‌, రిషి సునాక్‌.. ఈ ఐదుగురు ప్రధానులుగా పనిచేశారు. అయితే, ఎంతో చారిత్రక నేపథ్యంలో ఉన్న ఆ వీధిలోని శునకాలతో తగువులాడుతుందట. ఇందుకు సంబంధించి అనేక వీడియోలు సోషల్‌ మీడియాలో వచ్చాయి.