DailyDose

పాకిస్థాన్‌లో 3వేలు దాటిన గ్యాస్ సిలిండర్ ధర

పాకిస్థాన్‌లో 3వేలు దాటిన గ్యాస్ సిలిండర్ ధర

పాకిస్థాన్‌ ఆర్థిక పరిస్థితి మరింతగా దిగజారుతున్నది. నెల నెలకు ద్రవ్యోల్బణం పెరుగుతున్నది. ద్రవ్యోల్బణం రేటు ఆగస్టులో 27.4 శాతం ఉండగా సెప్టెంబర్‌లో 31.4 శాతానికి చేరింది. నెలవారీ ప్రాతిపదికన పరిశీలిస్తే ఆగస్ట్‌లో ద్రవ్యోల్బణం 1.7 శాతం, సెప్టెంబర్‌లో 2 శాతం మేర పెరిగింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌లో నిత్యవసరాలతోపాటు ఇంధనం, గ్యాస్‌ ధరలు మరింతగా పెరిగాయి. ఆ దేశానికి చెందిన ఆయిల్ అండ్ గ్యాస్ రెగ్యులేటరీ అథారిటీ (OGRA) లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) ధరను కిలోకు రూ.20.86 చొప్పున పెంచింది. ఆ తర్వాత ఎల్పీజీ ధరను కిలోకు రూ. 260.98గా నిర్ణయించింది. అలాగే డొమెస్టిక్ సిలిండర్ ధర కిలోకు 246.15 చొప్పున పెంచింది. దీంతో గ్యాస్‌ సిలిండర్‌ ధర ప్రస్తుతం రూ.3,079.64కు చేరింది. మరోవైపు పాకిస్థాన్‌లో నెలకొన్న రాజకీయ, ఆర్థిక సంక్షోభం వల్ల నిత్యవసర వస్తువుల ధరలు నింగిని తాకాయి. ఈ నేపథ్యంలో ఏమీ కొనలేని స్థితిలో ఉన్న ఆ దేశ ప్రజలు అల్లాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రముఖ ఫుడ్‌ సంస్థలు ఆహార పదార్థాల సైజును తగ్గిస్తున్నాయి. సాధారణంగా ఆరు, 12 అంగుళాల సైజ్‌లో శాండ్‌విచ్‌లు ఉండగా ప్రస్తుతం సబ్‌వేలో మూడు అంగుళాల శాండ్‌విచ్‌ను కొత్తగా ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.