Business

లాభాలతో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు

లాభాలతో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు మార్కెట్లకు దన్నుగా నిలుస్తున్నాయి. ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 375 పాయింట్ల లాభంతో 66,454 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 110 పాయింట్లు లాభపడి 19,800 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.22 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 30 సూచీలో అన్ని షేర్లు లాభాల్లో ఉండడం విశేషం. టాటా మోటార్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, విప్రో, యాక్సిస్‌ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్, ఇన్ఫోసిస్‌, ఎస్‌బీఐ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఎన్‌టీపీసీ, హెచ్‌యూఎల్‌, ఐటీసీ, ఇండస్ఇండ్‌ బ్యాంక్‌ అత్యధికంగా లాభపడుతున్న షేర్ల జాబితాలో ఉన్నాయి.

అమెరికా స్టాక్‌ మార్కెట్లు (Stock Market) మంగళవారం లాభాలతో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు సైతం అదే బాటలో పయనించాయి. నేడు ఆసియా- పసిఫిక్‌ మార్కెట్లు కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి. యుద్ధ భయాల నుంచి నిన్నే తేరుకున్న ప్రపంచ మార్కెట్లు ఆ ధోరణిని కొనసాగిస్తున్నాయి. మరోవైపు అమెరికా బాండ్ల రాబడులు దిగిరావడం, వడ్డీరేట్ల పెంపు తాత్కాలికంగా నిలిచిపోయే అవకాశం ఉందనే విశ్లేషణలు కూడా సూచీలకు దన్నుగా నిలుస్తున్నాయి. మన దేశ వృద్ధి రేటు అంచనాను 2023-24 ఆర్థిక సంవత్సరానికి స్వల్పంగా పెంచి 6.3 శాతంగా అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) పేర్కొంది. విదేశీ సంస్థాగత మదుపర్లు (FII) మంగళవారం రూ.1,005 కోట్లు విలువ చేసే భారత ఈక్విటీలను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.1,963 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

గమనించాల్సిన స్టాక్స్‌..

టీసీఎస్‌: సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసిక ఫలితాలను నేడు టీసీఎస్‌ ప్రకటించనుంది.

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా: మొబైల్‌ యాప్‌ ‘బీఓబీ వరల్డ్‌’పై ఆర్‌బీఐ ఆంక్షలు విధించింది. కొత్త వినియోగదారులను ఇందులో చేర్చుకోకూడదని మంగళవారం పేర్కొంది. కొన్ని అంశాలను పరిశీలించిన మీదట, బ్యాంకింగ్‌ నియంత్రణ చట్టం 1949, సెక్షన్‌ 35ఏ ప్రకారం ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

ఎంసీఎక్స్‌: కొత్త కమొడిటీ డెరైవేటివ్స్‌ ప్లాట్‌ఫామ్‌ను అక్టోబర్‌ 16 నుంచి ప్రారంభించినున్నట్లు ఎంసీఎక్స్‌ ప్రకటించింది.

బిర్లా కార్పొరేషన్‌: 2000- 2007 మధ్య మధ్యప్రదేశ్‌ నుంచి అధికంగా సున్నపురాయిని ఉత్పత్తి చేసినందుకు తమపై రూ.8.42 కోట్ల జరిమానా విధించినట్లు బిర్లా కార్పొరేషన్‌ వెల్లడించింది.

ఈఐహెచ్‌ అసోసియేటెడ్‌ హోటల్స్‌: శివ్‌ శంకర్‌ ముఖర్జీ తమ సంస్థ ఛైర్మన్‌, డైరెక్టర్‌ హోదా నుంచి వైదొలగినట్లు ఈఐహెచ్‌ హోటల్స్‌ వెల్లడించింది.