Business

ఎలక్ట్రిక్ బస్సులను అద్దెకు తీసుకోనున్న టీఎస్ఆర్టీసీ

ఎలక్ట్రిక్ బస్సులను అద్దెకు తీసుకోనున్న టీఎస్ఆర్టీసీ

రాష్ట్రంలో నాన్‌ ఏసీ విద్యుత్‌ బస్సుల్ని రోడ్డు ఎక్కించేందుకు ఆర్టీసీ సిద్ధమవుతోంది. దాదాపు 500 బస్సుల్ని అద్దెకు తీసుకోవాలని సంస్థ నిర్ణయించింది. తొలిసారిగా ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ విభాగాల్లో విద్యుత్‌ బస్సుల్ని ప్రవేశపెట్టనుంది. బుధవారం హరియాణా వెళ్లిన ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ఆ బస్సుల తయారీ సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. కొత్త బస్సుల నిర్మాణాన్ని ఆయన పరిశీలించారు. డిసెంబరు నుంచి నాన్‌ ఏసీ ఎలక్ట్రిక్‌ బస్సుల్ని దశలవారీగా ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చేలా ఆర్టీసీ ప్రణాళికలు రూపొందిస్తోంది.

1860 బస్సులకు ఆర్డర్‌
ఆర్టీసీలో నాలుగింట మూడొంతులు కాలం చెల్లిన బస్సులే ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా సంస్థ కొత్త బస్సుల్ని కొనుగోలు చేయకుండా డీజిల్‌ బస్సులను అద్దెకు తీసుకుంటోంది. ఇటీవల విద్యుత్‌ బస్సుల వైపు మొగ్గు చూపుతోంది. ప్రస్తుతం ఆర్టీసీలో ఏసీ సర్వీసుల్లో మాత్రమే ఎలక్ట్రిక్‌ బస్సులుండగా.. నాన్‌ ఏసీలోనూ వాటిని ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో వివిధ సంస్థలకు మొత్తం 1,860 ఎలక్ట్రిక్‌ బస్సులకు ఆర్డర్‌ ఇచ్చింది. వీటిని అద్దె పద్ధతిలో తీసుకోనుంది. బస్సులు తిరిగిన దూరానికి కిలోమీటర్ల వారీగా చెల్లింపులుంటాయి. వీటిలో 10 విద్యుత్‌ డబుల్‌ డెక్కర్‌ బస్సుల్ని హైదరాబాద్‌లో నడపనుంది. హరియాణాకు చెందిన జేబీఎం సంస్థ 500 బస్సుల్ని అందించనుంది. ఆ సంస్థ తయారు చేస్తున్న ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌, సూపర్‌లగ్జరీ బస్సుల నిర్మాణాన్ని సజ్జనార్‌ పరిశీలించారు. జేబీఎం సంస్థ హెడ్‌ సేల్స్‌ (నార్త్‌) ముఖేశ్‌శర్మ, జీఎం ఆపరేషన్స్‌ ప్రశాంత్‌శర్మలతో చర్చించి పలు సూచనలు చేశారు. ‘జేబీఎం సంస్థ విద్యుత్‌ బస్సుల్ని ఒప్పందం ప్రకారం ఆర్టీసీకి ఇస్తుంది. సౌకర్యవంతమైన ప్రయాణంతో పాటు ఈ బస్సుల్లో ప్రయాణికుల్ని లెక్కించే సదుపాయం, సీసీ కెమెరాలు, అగ్ని నిరోధక వ్యవస్థ, గమ్యస్థానం వివరాలు తెలిపే ఎల్‌ఈడీ బోర్డుల వంటి అధునాతన హంగులుంటాయి’ అని ఎండీ సజ్జనార్‌ ఒక ప్రకటనలో వివరించారు. ఎండీ వెంట ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ ఈడీ వెంకటేశ్వర్లు, రంగారెడ్డి ఆర్‌ఎం శ్రీధర్‌ కూడా ఉన్నారు.

👉 – Please join our whatsapp channel here

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z