Sports

న్యూజిలాండ్ పై భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం

న్యూజిలాండ్ పై భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం

ప్రపంచకప్‌లో భారత్ జైత్రయాత్ర సాగుతోంది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించి వరుసగా ఐదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. కివీస్ నిర్దేశించిన 274 పరుగుల లక్ష్యాన్ని భారత్ రెండు ఓవర్లు మిగిలుండగానే ఛేదించింది. విరాట్ కోహ్లీ (95; 104 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. రవీంద్ర జడేజా (39*; 44 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ శర్మ (46; 40 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) మరోసారి ఆకట్టుకున్నాడు. శుభ్‌మన్ గిల్ (26), శ్రేయస్ అయ్యర్ (33), కేఎల్ రాహుల్ (27) భారీ స్కోర్లు చేయలేకపోయారు. సూర్యకుమార్ యాదవ్ (2) ఘోరంగా విఫలమయ్యాడు. 191 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత్‌ను కోహ్లీ, జడేజా ఆదుకున్నారు. వీరిద్దరూ బాధ్యతాయుతంగా ఆడి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. కివీస్ బౌలర్లలో ఫెర్గూసన్ 2, ట్రెంట్ బౌల్ట్, మిచెల్ శాంట్నర్, మ్యాట్ హెన్రీ తలో వికెట్ పడగొట్టారు.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌట్‌ అయింది. డారిల్ మిచెల్ (130; 127 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లు) శతకం బాదాడు. రచిన్ రవీంద్ర (75; 87 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) కూడా భారీ ఇన్సింగ్స్ ఆడాడు. గ్లెన్ ఫిలిప్స్ (23), విల్ యంగ్ (17) పరుగులు చేయగా.. డేవాన్ కాన్వే (0), టామ్ లేథమ్ (5), మార్క్ చాప్‌మన్ (6), మిచెల్ శాంట్నర్ (1), హెన్రీ (0), ఫెర్గూసన్‌ (1) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. షమి ఐదు వికెట్లతో అదరగొట్టగా.. కుల్‌దీప్‌ యాదవ్ రెండు, బుమ్రా, సిరాజ్‌లకు చెరో వికెట్‌ దక్కింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z