విభూతి ఎలా ధరించాలి?
భస్మధారణ పుణ్యప్రదమని, సంపదలు వస్తాయి, పవిత్రత చేకూరుతుంది, రోగాలు రావు, దోషాలను నివారిస్తుంది, లోకం వశమౌతుందని- శాస్త్రవచనం.
శ్రీకరంచ పవిత్రం చ శోకమోహ వినాశనం
లోకవశ్యకరం చైవ భస్మం త్రైలోక్య పావనం
అనే శ్లోకాన్ని స్మరించి పావనమైన ఈ భస్మాన్ని ధరిస్తున్నాను- అనుకుంటూ విభూతి పెట్టుకుంటే అధిక ఫలితం ఉంటుంది. స్త్రీలు, స్వాములు నీళ్లలో తడపని విభూతి ధరించాలి. విభూతిని నుదురు, ఉదరం, చేతుల మీద పెట్టుకోవాలి. చాలామంది విభూతిని మూడు వేళ్లతో పెట్టుకుంటారు. అది సరికాదు. గృహస్తులు విభూతిని నీటితో తడిపి మృగముద్ర పట్టాలి. ఆ మృగముద్రను జాగ్రత్తగా పరిశీలిస్తే అది జింక కొమ్ములతో నిలబడినట్లుంటుంది. మూడువేళ్లు కలుస్తాయి, రెండు వేళ్లు నిలబడతాయి. భస్మాన్ని తడిపి ముందుగా మధ్యవేలు, ఉంగరపు వేళ్లను ముంచి, తర్వాత బొటనవేలును ముంచి, కుడి నుంచి ఎడమవైపుకి బొటనవేలు పట్టగలిగినంత దూరం విడిచిపెట్టి నుదుటిమీద ప్రయాణం చెయ్యాలి. తర్వాత ఆ రెండువేళ్లు గీసిన విభూతిరేఖల మధ్యలోంచి విభూతిలో అద్దిన బొటన వేలును లలాటం మీద రాస్తూ వెనక్కి తీసుకురావాలి. ఇదే శాస్త్రోక్త విభూతి ధారణ. బ్రహ్మ రాసిన రాత చెరిగిపోదని నమ్ముతాం. కానీ ఆ రాతను పోగొట్టగల శక్తి భస్మానికి ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి. స్కాంద పురాణంలో విభూతి ధరించిన వ్యక్తిని పట్టుకున్నంత మాత్రాన.. ఒక బ్రహ్మరాక్షసుడికి శాప విమోచనమైంది. విభూతికి ఉన్న శక్తి అంత మహిమాన్వితం.
👉 – Please join our whatsapp channel here –