Sports

పారిస్ ఒలంపిక్స్‌కు బెజవాడ ఆర్చర్

పారిస్ ఒలంపిక్స్‌కు బెజవాడ ఆర్చర్

తెలుగు కుర్రాడు బొమ్మదేవర ధీరజ్‌ అదరగొట్టాడు. కొంతకాలంగా రికర్వ్‌ ఆర్చరీలో నిలకడగా రాణిస్తున్న ఈ విజయవాడ ఆర్చర్‌.. వచ్చే ఏడాది జరిగే పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ఆసియా కాంటినెంటల్‌ క్వాలిఫికేషన్‌ టోర్నీలో రజతంతో ఒలింపిక్స్‌ కోటా స్థానం సొంతం చేసుకున్నాడు. శనివారం రికర్వ్‌ వ్యక్తిగత విభాగం ఫైనల్లో 22 ఏళ్ల ధీరజ్‌ షూటాఫ్‌లో 9-10 తేడాతో జి సియాంగ్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో పోరాడి ఓడాడు. అంతకుముందు అసలు పోరు 5-5 (29-28, 27-29, 28-28, 30-28, 25-26)తో సమమైంది. అయితే తుదిపోరు చేరడం ద్వారా ధీరజ్‌ 2023 పారిస్‌ ఒలింపిక్స్‌ బెర్తును కైవసం చేసుకున్న భారత తొలి ఆర్చర్‌గా నిలిచాడు. మరోవైపు తెలుగు రాష్ట్రాల నుంచి ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన మొట్టమొదటి ఆర్చర్‌గా ధీరజ్‌ చరిత్ర సృష్టించాడు. చిన్నవయస్సులోనే విలువిద్యపై ఇష్టం పెంచుకున్న అతను.. మొదట్లో తండ్రి శిక్షణలోనే రాటుదేలాడు. అనంతరం చెరుకూరి ఓల్గా ఆర్చరీ అకాడమీలో చేరి.. గురి తప్పకుండా బాణాలు విసరడంపై పట్టు సాధించాడు. క్రమంగా అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. ఈ ఏడాది సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటికే ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో టీమ్‌ రజతంతో పాటు వ్యక్తిగత కాంస్యం నెగ్గాడు. ఇప్పుడు ఒలింపిక్స్‌ కోటా స్థానం పట్టేశాడు. టోక్యో ఒలింపిక్స్‌ ట్రయల్స్‌లో నాలుగో స్థానంలో నిలవడంతో అప్పుడు ఈ మెగా క్రీడల్లో తలపడే అవకాశాన్ని తృటిలో కోల్పోయిన ధీరజ్‌.. ఈ సారి పట్టు వదల్లేదు.