DailyDose

కైలాసగిరి కొండ దిగువన తవ్వకాలపై ఏపీ హైకోర్టు స్టేటస్‌ కో ఆదేశాలు

కైలాసగిరి కొండ దిగువన తవ్వకాలపై ఏపీ హైకోర్టు స్టేటస్‌ కో ఆదేశాలు

విశాఖ కైలాసగిరి కొండ దిగువన తవ్వకాలపై ఏపీ హైకోర్టు స్టేటస్‌ కో ఆదేశాలు ఇచ్చింది. తెన్నేటి పార్క్‌.. పార్కింగ్‌ కోసం కొండను తవ్వుతున్నట్టు దాఖలైన పిటిషన్‌పై బుధవారం ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. నిబంధనలకు విరుద్ధంగా కొండను తవ్వి పార్క్‌ కోసం నిర్మాణం చేపట్టారని హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం అక్రమ నిర్మాణాలు చేపడుతోందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కేఎస్ మూర్తి కోర్టుకు తెలిపారు. దీనిపై కౌంటరు దాఖలు చేయాలని విశాఖ మున్సిపల్‌ అధికారులకు హైకోర్టు ఆదేశాలిచ్చింది. అప్పటి వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది.

మూడు డిస్కమ్‌ల ఎండీలకు హైకోర్టు నోటీసులు…
ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ సహా ఏపీలోని మూడు డిస్కమ్‌ల ఎండీలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వ్యవసాయ విద్యుత్‌ స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేసే కాంట్రాక్టులో అవకతవకలు జరిగాయని ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఆధారంగా కోర్టు నోటీసులు ఇచ్చింది. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌లో అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో అధిక ధరలకు స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేశారని కోర్టుకు పిటిషనర్‌ తరఫు న్యాయవాది తెలిపారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు కోసం.. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు పాటించడం లేదని.. మీటర్ల ఏర్పాటుపై స్టే విధించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం తరపు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. తదుపరి విచారణను హైకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z