Health

ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం!

ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం!

ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స అవసరమైన 26 ఏళ్ల యువకుడికి ప్రాణం పోసేందుకు మహారాష్ట్రలోని పుణె నుంచి బయలుదేరిన వైద్యబృందం మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంతో గాయాలపాలైనా కర్తవ్య నిర్వహణలో వెనకడుగు వేయకుండా వృత్తిధర్మాన్ని పూర్తిచేసిన ఉదంతమిది. పుణె సమీపంలోని ఓ ఆసుపత్రి నుంచి సేకరించిన ఊపిరితిత్తులతో నవీ ముంబయి అపోలో ఆసుపత్రి చీఫ్‌ కార్డియోథొరాసిక్‌ (గుండె, ఊపిరితిత్తుల) సర్జన్‌ డాక్టర్‌ సంజీవ్‌ జాదవ్‌ బృందం సోమవారం తమిళనాడు రాజధాని చెన్నైకు బయలుదేరింది. పుణెలోని లోహ్‌గావ్‌ విమానాశ్రయానికి ఈ బృందం అంబులెన్సులో వెళుతుండగా పింపరీ – చించ్‌వాడ్‌ టౌన్‌షిప్‌ వద్ద వీరు ప్రయాణిస్తున్న అంబులెన్సు హైరిస్‌ వంతెన మీదకు వచ్చేసరికి టైరు పేలి రెయిలింగును ఢీకొని ఆగిపోయింది. వాహనం ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో జాదవ్‌కు తలపైన, చేతులు.. మోకాళ్లకు దెబ్బలు తాకాయి. బృందంలోని ఇతర సభ్యులూ గాయపడ్డారు. గాయాలు బాధపెడుతున్నా వైద్యబృందం వెనుక వస్తున్న మరో వాహనం ఎక్కి విమానాశ్రయానికి చేరుకొంది. ఛార్టర్డ్‌ విమానం ఎక్కి, చెన్నైలోని అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న యువకుడి (19) నుంచి సేకరించిన ఆ ఊపిరితిత్తులను చెన్నైలో ఆపరేషన్‌ టేబులుపై సిద్ధంగా ఉన్న మరో యువకుడి దేహంలోకి మార్చేందుకు విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేశారు.