DailyDose

సైబర్ మోసం యొక్క కొత్త రూపం- నేర వార్తలు

సైబర్ మోసం యొక్క కొత్త రూపం- నేర వార్తలు

కాకినాడలో ఓ వైద్యుడు ఆత్మహత్య

కాకినాడలో ఓ వైద్యుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఆస్తి విషయంలో తాను మోసపోయానంటూ అశోక్‌నగర్‌కు చెందిన నున్న శ్రీకిరణ్‌చౌదరి(32) శనివారం గడ్డిమందు తాగారు. గమనించిన కుటుంబసభ్యులు అతడిని కాకినాడ జీజీహెచ్‌హెచ్‌కు తరలించారు. శ్రీకిరణ్‌ అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందారు. ఆస్తి విషయంలో ఎమ్మెల్యే కన్నబాబు సోదరుడు, సినీ దర్శకుడు కల్యాణ్‌కృష్ణ, మరో అనుచరుడు పెదబాబు, వైకాపా నేతలు తన కుమారుడిని మోసం చేశారని మృతుడి తల్లి రత్నం ఆరోపించారు. భూవివాదం పరిష్కారానికి వైకాపా నేతలను ఆశ్రయిస్తే.. భూమి పత్రాలు తీసుకుని డబ్బు రాదని చెప్పారని తెలిపారు. వారి బెదిరింపులతోనే మనస్తాపానికి గురై తన కుమారుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆమె చెప్పారు.

సైబర్ మోసం యొక్క కొత్త రూపం

దేశవ్యాప్తంగా సైబర్ మోసాల కేసులు పెరుగుతున్నాయి. ప్రజలు ఎలాంటి మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉన్నప్పటికీ, మోసగాళ్లు మోసం చేయడానికి కొత్త కొత్త మార్గాలను కనిపెడుతున్నారు. అలాంటి ఘటనే ఒకటి కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది. ఇక్కడ 43 ఏళ్ల మహిళ వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు సైబర్‌ నేరగాళ్ల చేతిలో పడి మోసానికి గురైంది. ఎలాంటి ఓటీపీ, లింక్ పంపకుండానే మహిళ డిజిటల్ వాలెట్ నుంచి రూ.లక్ష నగదును దుండగులు డ్రా చేశారు. సైబర్ దుండగుల ఈ కొత్త పద్ధతి తెలిసి ప్రజలు, పోలీసులు కూడా ఆశ్చర్యపోతున్నారు.మహిళ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, బుధవారం సాయంత్రం 4.45 నుండి 5 గంటల మధ్య దుండగుడు తన తండ్రి పేరును వాడుకుని రూ. 1 లక్ష రూపాయలు స్వాహా చేసాడు. అందుకు సంబంధిచిన ఆమె ఎలాంటి లింక్‌ను క్లిక్ చేయలేదని చెప్పింది. ఎటువంటి OTP కూడా తనకు రాలేదని, ఎవరితోనూ ఎలాంటి ఓటీపీ నెంబర్‌ తను షేర్‌ చేయలేదని చెప్పింది. కానీ, మోసగాడు తన తండ్రికి సన్నిహితుడని చెప్పాడని బాధిత మహిళ తెలిపింది. ఆ తర్వాత అతడు తనను డబ్బు పంపమని అడిగాడు. ఈ మేరకు ఆమె ఫోన్‌కు ఓ మెసేజ్‌ పంపాడు. అంతే..తప్ప తాను ఎలాంటి ఓటీపీని షేర్ చేయలేదని, లింక్‌పై క్లిక్ చేయలేదని ఆ మహిళ చెప్పింది. ఇదిలావుండగా 15 నిమిషాల్లోనే ఆమె ఖాతా నుంచి లక్ష రూపాయలు డ్రా అయ్యాయని బాధిత మహిళ వాపోయింది.మహిళ ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్‌లో ఇది కొత్త ట్రెండ్‌గా పోలీసులు అభివర్ణిస్తున్నారు. డబ్బు చోరీకి అనుమతించే కోడ్‌తో టెక్స్ట్ సందేశాలు ఎన్‌క్రిప్ట్ చేయబడతాయని సైబర్ క్రైమ్ నిపుణులు తెలిపారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.కానీ, ఈ కేసులో పోలీసుల నిర్లక్ష్యమే కారణమని మహిళ ఆరోపించింది. గవర్నర్, సీఎం భద్రతతో బిజీగా ఉన్నామని చెప్పి పోలీసులు ఫిర్యాదు నమోదు చేయలేదని అంటున్నారు. డబ్బు పోగొట్టుకున్న గంటలోపే పోలీస్ స్టేషన్‌కు వెళ్లానని మహిళ చెప్పింది. మోసగాడి ఖాతాను స్తంభింపజేయాలని తాను పోలీసులను కోరానని చెప్పింది. కానీ, వారు ఆలస్యం చేశారని ఆమె ఆరోపించింది. పైగా పోలీసులకు హిందీ, ఇంగ్లీష్ తప్ప మరో భాష రాకపోవటంతో తాను చెప్పిన ఫిర్యాదును వారు అర్థం చేసుకోలేదని కూడా బాధిత మహిళ ఆరోపించింది. అంతేకాదు.. తాను పోలీస్ స్టేషన్‌లో ఉన్నప్పుడు కూడా ఆ దుండగుడు తనకు ఫోన్ చేస్తూనే ఉన్నాడని, మరుసటి రోజు తనకు 22 సార్లు ఫోన్ చేశాడని మహిళ చెప్పింది.  బేటా నా కాల్‌ని అటెండ్ చేయండి,  మీ ఖాతా నుండి బదిలీ అయిన డబ్బును నేను పంపుతాను అనే మెసేజ్ కూడా వచ్చిందని బాధిత మహిళ చెప్పింది.

హత్యకు దారితీసిన ఇన్‌స్టా రీల్స్

సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తోన్న కాలం ఇది. కొత్త దుస్తులు కొన్నా.. కొత్తగా ఫుడ్ చేసినా.. చివరికి ఎదురింట్లో తుమ్మినా.. దగ్గినా సోషల్ మీడియాలో పెట్టి వ్యూస్, లైక్‌ల కోసం ఆరాటపడుతుంది నేటి యువత. దీని వల్ల కొంత లాభం ఉన్నా.. నష్టమూ అంతకంటే ఎక్కువగానే ఉన్నది. ఓ ఇల్లాలు ఇన్ స్టా గ్రామ్ రీల్స్‌కు అలవాటు పడి ప్రాణాలనే పొగొట్టుకుంది. రీల్స్ చేయవద్దు.. చాటింగ్ చేయవద్దని భర్త ఎంత వారించినా పట్టించుకోకుండా హతమైంది. కోల్‌కతాలో వెలుగు చూసిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.కోల్‌కతా నగరంలో పరిమళ్ బైద్య ఆయన భార్య అపర్ణ (35) నివాసం ఉంటున్నారు. భర్త తాపీ మేస్త్రిగా పని చేస్తున్నారు. ఈ దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే ఇంటి వద్దనే ఉండే అపర్ణ ఇన్ స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తుంటుంది. దీంతో ఆమెకు వేలల్లో ఫాలోవర్స్ అయ్యారు. ఈ క్రమంలో వారిలో కొందరితో పరిచయాలై చాటింగ్ చేసేది. దాంట్లో పురుషులు కూడా ఉండటంతో ఆమె భర్త పరిమళ్ బైద్య హెచ్చరించాడు. ఇకపై రీల్స్ చేయవద్దని, మగాళ్లతో చాటింగ్ చేయవద్దని వార్నింగ్ ఇచ్చాడు. ఈ విషయంపై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగి.. పుట్టింటికి కూడా వెళ్లి వచ్చేది.

*  మధ్యప్రదేశ్‌లో రెచ్చిపోయిన ఇసుక మాఫియా

ఇసుక మాఫియా రెచ్చిపోయింది. (Sand Mafia) అక్రమ ఇసుక రవాణాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన అధికారిని ట్రాక్టర్‌తో తొక్కి చంపారు. మధ్యప్రదేశ్‌లోని షాహదోల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గోపాల్‌పూర్ ప్రాంతంలోని సోన్ నది సమీపంలో అక్రమంగా ఇసుకను తవ్వి రవాణా చేస్తున్నట్లు రెవెన్యూ శాఖ అధికారులకు తెలిసింది. దీంతో శనివారం అర్ధరాత్రి వేళ ప్రసన్ సింగ్‌ నేతృత్వంలోని ప్రభుత్వ ఉద్యోగుల పెట్రోలింగ్ బృందం ఆ ప్రాంతానికి చేరుకుంది.కాగా, ఒక ట్రాలీలో ఇసుకను అక్రమంగా అక్కడి నుంచి తరలిస్తున్న ట్రాక్టర్‌ను అడ్డుకునేందుకు అధికారి ప్రసన్ సింగ్‌ ప్రయత్నించాడు. అయితే డ్రైవర్‌ ఆ అధికారి మీదుగా ట్రాక్టర్‌ను నడిపి అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో తీవ్రంగా గాయపడిన సింగ్‌ అక్కడికక్కడే మరణించాడు.మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. రెవెన్యూ శాఖ అధికారి ప్రసన్‌ సింగ్‌ను ట్రాక్టర్‌తో తొక్కి హత్య చేసిన డ్రైవర్‌ను 25 ఏళ్ల శుభం విశ్వకర్మగా గుర్తించారు. ఆదివారం ఉదయం అతడ్ని అరెస్ట్‌ చేశారు. ఆ ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్‌ అధికారి తెలిపారు. ట్రాక్టర్‌ యజమానిని కూడా గుర్తించినట్లు చెప్పారు

ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య

నిర్మల్‌ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం చదువుతున్న ప్రవీణ్‌కుమార్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్‌ భవనంలోని నాలుగో అంతస్తులో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. నాగర్‌ కర్నూల్‌కు చెందిన ప్రవీణ్‌కుమార్ ఈడాదే ట్రిపుల్‌ ఐటీలో చేరాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం భైంసా ఆస్పత్రికి తరలించారు. ప్రవీణ్ కుమార్‌ వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు కళాశాల వర్గాలు వెల్లడించాయి. విద్యార్థి మృతి పట్ల వైస్‌ఛాన్సలర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఓటు వేయడానికి అవుట్‌పాస్ జారీ చేయాలని ప్రవీణ్‌కుమార్‌ అభ్యర్థించాడని, ఈ రోజు ఉదయం 10 గంటలకు ఔట్‌పాస్‌ తీసుకున్నాడని చెప్పారు. ఇవాళే బయల్దేరాల్సి ఉందని తెలిపారు. తాను ఉంటున్న గదిలో కాకుండా వేరే గదికి వెళ్లి ఉరివేసుకున్నట్లు చెప్పారు.

కారును ఎవరైనా తగలబెట్టారా?

నగర శివారులోని ఔటర్‌ రింగ్‌ రోడ్డు(ఓఆర్‌ఆర్‌)పై ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఆదిభట్ల సమీపంలోని ఓఆర్‌ఆర్‌పై కారులో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ మంటలకు కారులో ఉన్న వ్యక్తి సజీవదహనమయ్యాడు. కారు కూడా పూర్తిగా దగ్ధమైంది. మృతుడిని కోదాడకు చెందిన వెంకటేశ్‌గా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కారును ఎవరైనా తగలబెట్టారా? ప్రమాదమా? అనే కోణంలో విచారణ చేస్తున్నారు.

* రైల్వే స్టేషన్‌లో ఉన్న మహిళపై లైంగిక దాడి

పోలీసులుగా బెదిరించిన ఇద్దరు వ్యక్తులు రైల్వే స్టేషన్‌లో భర్తతోపాటు ఉన్న మహిళపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని అశోక్ నగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 30 ఏళ్ల మహిళ, భర్తతో కలిసి రాజస్థాన్‌లోని జైపూర్‌కు వెళ్లేందుకు ముంగవోలి రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. అయితే తాగుడుకు బానిస అయిన మహిళ భర్త మద్యం కోసం స్టేషన్‌ బయటకు వెళ్లాడు. అతడు ఆలస్యంగా రైల్వే స్టేషన్‌కు తిరిగి వచ్చాడు. దీంతో ఎక్కాల్సిన రైలును ఆ దంపతులు మిస్‌ అయ్యారు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి వేళ ఆ రైల్వే స్టేషన్‌లో ఉన్నారు.కాగా, ఇద్దరు వ్యక్తులు ఆ దంపతుల వద్దకు వచ్చారు. తాము పోలీసులమని చెప్పి బెదిరించారు. వారి టిక్కెట్లు తనిఖీ చేసి వివరాలు అడిగారు. ఆ వ్యక్తులు సివిల్‌ డ్రెస్‌లో ఉండటంతో ఐడీ కార్డు చూపించాలని వారు అడిగారు. ఈ నేపథ్యంలో మహిళ భర్త, ఆ వ్యక్తుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఒక వ్యక్తి మహిళ భర్తను అక్కడి నుంచి తీసుకెళ్లాడు. మరో వ్యక్తి మహిళను సమీపంలోని చెట్ల వద్దకు లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం రెండో వ్యక్తి కూడా ఆ మహిళపై అత్యాచారం చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో ప్రభుత్వ రైల్వే పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్‌ అధికారి తెలిపారు.

భార్యను దారుణంగా చంపిన భర్త

 సోషల్‌ మీడియా ఆ దంపతుల జీవితాల్లో విషాదం నింపింది. భార్య సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండడం భర్తకు నచ్చలేదు. ఈ విషయమై రోజూ ఇద్దరి మధ్య తీవ్ర గొడవ జరుగుతూ ఉండేది. ఈ క్రమంలోనే భర్త కూరగాయలు కోసే కత్తితో భార్య గొంతు కోసి చంపాడు. చంపిన తర్వాత ఇంట్లో నుంచి పారిపోయాడు. ఈ ఘటన పశ్చిమబెంగాల్‌లోని సౌత్‌ 24 పరగణాల జిల్లాలోని హరియాణాపూర్‌లో జరిగింది. ఈ దారుణమైన ఘటన గురించి ఆ దంపతుల మైనర్‌ కుమారుడు మీడియాతో మాట్లాడాడు. ‘మా అమ్మ, నాన్న పరిమల్‌, అపర్ణ బైద్య ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేవారు. నాన్న అమ్మ గొంతు కోస్తామని చాలాసార్లు బెదిరించాడు. హత్య జరిగిన రోజు నేను ఇంటికి వచ్చి చూసేసరికి అమ్మ రక్తంతో కింద పడి ఉంది. వెంటనే పక్కింటివారికి విషయం చెప్పాను’ అని దంపతుల కుమారుడు తెలిపాడు.  ‘అపర్ణ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండడంపై పరిమల్‌ తరచూ గొడవ పడుతుండేవాడు. సోషల్‌ మీడియాలో అపర్ణకు కొందరు ఆన్‌లైన్‌ ఫ్రెండ్స్‌ కూడా ఏర్పడ్డారు. ఈ కారణంతోనే పరిమల్‌ అపర్ణను చంపాడు. హత్య తర్వాత పరిమల్‌ పరారీలో ఉన్నాడు. అతడిని పట్టుకోవడానికి గాలింపు జరుగుతోంది’ అని పోలీసులు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z