Business

13,878.11 కోట్ల లోటు అంచనా

13,878.11 కోట్ల లోటు అంచనా

రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థలు తమ ఆర్థికలోటును రూ.13,878.11 కోట్లుగా అంచనా వేస్తున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సర వార్షిక ఆదాయ అవసరాల నివేదిక(ఏఆర్‌ఆర్‌)లో ఈ లెక్కలు చూపాయి. ఈ మొత్తాన్ని ప్రభుత్వం సబ్సిడీగా ఇవ్వకపోతే.. భారమంతా ప్రజలపైనే పడుతుంది. ఇప్పటికే ట్రూఅప్‌, ఒకటికి రెండు ఇంధన సర్దుబాటు ఛార్జీల (ఎఫ్‌పీపీసీఏ), వివిధ పేర్లతో ప్రభుత్వం ఏటా రూ.10వేల కోట్లకు పైగా భారాన్ని ప్రజలపై వేసింది. 2023-24లో డిస్కంలు సమర్పించిన ఏఆర్‌ఆర్‌లో లోటు రూ.11,800 కోట్లుగా అప్పట్లో అంచనా వేశాయి. దాన్ని రూ.10,135.22 కోట్లుగా రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) తేల్చింది. ఈ లెక్కన గత ఏడాదితో పోలిస్తే వచ్చే ఏడాది ఆర్థికలోటు రూ.3,742.89 కోట్లు అదనంగా పెరగనుంది. విద్యుత్‌ విక్రయాల ద్వారా వచ్చే ఆదాయం కంటే.. విద్యుత్‌ కొనుగోలు, వడ్డీలు, రుణాలకు చెల్లించే వాయిదా మొత్తాలు భారీగా పెరగడంతో ప్రస్తుత ఏడాదితో పోలిస్తే వచ్చే ఏడాది లోటు 27% పెరగబోతోంది. డిస్కంలు సమర్పించిన ఏఆర్‌ఆర్‌ లెక్కలను మదింపు చేసిన తర్వాత ఏపీఈఆర్‌సీ ఆర్థికలోటు కింద వచ్చే ఏడాది వినియోగదారుల నుంచి ఎంత మొత్తం వసూలుకు అనుమతిస్తుంది? అందులో ప్రభుత్వం సబ్సిడీగా ఎంత భరిస్తుందనే లెక్కలు తేలాల్సి ఉంది. తర్వాత ప్రజలపై ట్రూఅప్‌ రూపేణా పడే భారం ఎంత అనేదానిపై స్పష్టత వస్తుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న శ్లాబ్‌లు, యూనిట్‌ ధరల్లో ఎలాంటి మార్పులను డిస్కంలు ఏఆర్‌ఆర్‌లో ప్రతిపాదించలేదు.

వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2024-25) 83,118.13 ఎంయూ విద్యుత్‌ కొనుగోలుకు రూ.39,017.60 కోట్లు ఖర్చవుతుందని డిస్కంలు అంచనా వేశాయి. దీనికి ట్రాన్స్‌మిషన్‌, లోడ్‌ డిస్పాచ్‌, పంపిణీ నెట్‌వర్క్‌ ఖర్చులు, ఇతర ఖర్చులు (సిబ్బంది జీతాలు, వడ్డీలు, రుణాల వాయిదాలు) కలిపితే మొత్తం రూ.56,576.03 కోట్లు అవసరం ఉంటుంది.

అమలులో ఉన్న విద్యుత్‌ టారిఫ్‌ ప్రకారం ప్రతినెలా బిల్లుల వసూలు, నాన్‌ టారిఫ్‌ (వినియోగదారులపై వేసే జరిమానాలు, సర్వీసు ఛార్జీలు), ఇతరత్రా కలిపి ఏడాదిలో రూ.42,697.92 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. అంటే ఖర్చులకు ఇంకా రూ.13,878.11 కోట్లు అవసరం. ఈ మొత్తాన్ని ఆర్థికలోటుగా డిస్కంలు చూపాయి.

2024-25లో 83,118.13 ఎంయూల విద్యుత్‌ కొనాలని డిస్కంలు అంచనా వేశాయి. ఇందులో విక్రయించేది 74,522.67 ఎంయూలు కాగా.. ప్రసార, పంపిణీనష్టాలు 8,595.45 ఎంయూలుగా ఉంటాయని భావిస్తున్నాయి. సరఫరా నష్టాలు 2.6%, పీజీసీఐఎల్‌, అంతర్రాష్ట్ర పంపిణీ నష్టాలు 0.9%, పంపిణీ నష్టాలు 6.84% కలిపి.. మొత్తం 10.34%గా అంచనా.

విద్యుత్‌ కొనుగోలు, ఇతర ఖర్చులు కలిపి ఒక్కో యూనిట్‌కు అయ్యేది రూ.6.81గా డిస్కంలు అంచనా వేస్తున్నాయి. ప్రతిపాదించిన టారిఫ్‌ ప్రకారం ఒక యూనిట్‌ విక్రయంతో రూ.5.14 వసూలవుతుంది. ఈ లెక్కన యూనిట్‌కు రూ.1.67 నష్టం వస్తుంది. మూడు డిస్కంలు కలిపి ఏడాదిలో 74,522.67 ఎంయూల విద్యుత్‌ విక్రయించేలా ప్రతిపాదించాయి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z