DailyDose

ఎవరిని తట్టినా ఇదే చర్చ

ఎవరు తట్టినా ఇదే చర్చ

అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన నాటి నుంచి గ్రామాల్లో ఎక్కడచూసినా ఎన్నికల వాతావరణం కనిపించింది. పోటీ చేయబోయే అభ్యర్థుల మొదలు ఏ పార్టీ నుంచి ఎవరెవరు బీఫామ్‌ దక్కించుకుంటారన్న చర్చలు తీవ్రంగా కొనసాగాయి. ఎవరికి ఏ పార్టీ బీఫామ్‌ ఇస్తుంది, ఏఅభ్యర్థి గెలుపొందుతాడు అనే చర్చ ప్రజల్లో తీవ్రంగా కొనసాగింది. తమ పార్టీ పలానా అభ్యర్థిని నిలబెడితే గెలుస్తాడని, తమ పార్టీ తాము సూచించిన అభ్యర్థిని నిలబెడితే మాత్రమే ప్రజల్లో ఉన్న ఆదరణతో గెలుపొందుతాడని చర్చించుకోవడం కనిపించింది. ప్రధాన పార్టీలతోపాటు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్‌ వేసిన వెంటనే తమతమ బల నిరూపన చూపెట్టుకోవడం కోసం సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల ఓట్లను తమవైపు తిప్పుకోవడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. ఉదయం లేచిందిమొదలు అర్ధరాత్రి వరకు నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో ప్రజలల్లో తిరుగుతూ ఎవరికివారు తమ పార్టీ నిలబెట్టిన అభ్యర్థికి ఓటువేసి గెలిపించాలని తిరగడంతో ఒక్కసారిగా గ్రామాల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కిపోయింది.

నామినేషన్‌ నుంచి పోలింగ్‌ వరకు
నామినేషన్లు వేసిన నాటి నుంచి పోలింగ్‌ ముగిసేవరకు గ్రామాల్లో ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి ప్రధాన పార్టీలతోపాటు స్వతంత్ర అభ్యర్థులు విశ్వ ప్రయత్నాలు చేశారు. దీంతో గ్రామాల్లో ఎక్కడచూసినా, ఎవరిని పలకరించినా ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపోటములపైనే చర్చలు కొనసాగించారు. కొన్నిచోట్ల ఏపార్టీ అభ్యర్థి మంచి మర్యాదలు చేస్తే ఆపార్టీ వెంట ఓటర్లు కనబడ్డారు. వారిని తమ వైపునకు తిప్పుకోవడం కోసం మరోపార్టీ నాయకులు ప్రయత్నాలు చేయడం ఎన్నికల సమయంలో సాధారనమైపోయింది. ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి వచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థులను ఓటర్లు ఒక సమూహంగా ఏర్పడి తమకు ఫలానా హామీ ఇవ్వాలని అలాగైతేనే తమ మద్దతు మీకే ఇస్తామని కండిషన్లు పెట్టడం.. దానికి ఆ ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిచిన వెంటనే మీ కోరిక నెరవేరుస్తానని హామీ ఇవ్వడం ప్రచారంలో ఓభాగమైపోయింది.

మూగబోయిన పాట
అభ్యర్థులు ఓటర్లను తమవైపు తిప్పుకోవడం కోసం ప్రచార నిమిత్తం ఏర్పాటు చేసిన ప్రచార వాహనాల పాటల సందడి అంతా ఇంతా కాదు. అభ్యర్థుల రాజకీయ చరిత్రతోపాటు కుటుంబ నేపథ్యంపై రాయించినపాటలు ఓటర్లను ఆకట్టుకోవడంలో ప్రధాన పాత్ర పోషించాయి. ప్రచార వాహనాలు గ్రామాల్లో తిరిగినప్పుడల్లా పెద్ద సందడిగా ఉండేది. ముఖ్యంగా గ్రామాల్లోని చావిడిలు, రచ్చబండలు, హోటళ్లు, కల్లు దుకాణాలు, కుల సంఘాల భవనాలు తదితర స్థలాల్లో ప్రజలంతా ఒకచోట చేరి ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపోటములపై ముచ్చట్లతో ఆ ప్రాంతమంతా సందడిగా ఉండేది. నిన్నటివరకు ఎన్నికల హడావిడి కొనసాగిన గ్రామాల్లో పోలింగ్‌ ముగిసిన తర్వాత ఎవరి పనుల్లో వారు నిమగ్నం అయ్యారు. దీంతో గ్రామాల్లో ఒక్కసారిగా చడీచప్పుడు లేకుండా పోయింది. ఇక అభ్యర్థుల గెలుపోటములపై అక్కడక్కడా చర్చించడం, సోషల్‌మీడియా, వాట్సాప్‌లలో చర్చించడం కనిపించింది.

ఫలితాల కోసం ఎదురుచూపులు
నిన్నటివరకు ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపు కోసం రాత్రింబవళ్లు కష్టపడ్డ నాయకులు, కార్యకర్తలతోపాటు ప్రజలు ఆదివారం వెలువడబోయే ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఎవరికివారు తమ అభ్యర్థి గెలుపొందుతాడని ధీమా వ్యక్తం చేస్తూ ఫలితాలకోసం వేచిచూస్తున్నారు. ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఫలితాలు ఏవిధంగా వస్తాయి, ఏపార్టీకి ఎంత మెజార్టీ వస్తుంది, ఎవరు గెలుపొందుతారన్నదే ప్రస్తుతం గ్రామాల్లో ప్రధాన చర్చగా మారింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z