DailyDose

పాలిటెక్నిక్‌కు కొత్త సిలబస్‌

పాలిటెక్నిక్‌కు కొత్త సిలబస్‌

రాష్ట్రంలో పాలిటెక్నిక్‌ విద్యకు వచ్చే విద్యాసంవత్సరం (2024-25) నుంచి కొత్త సిలబస్‌ అమలు కానుంది. తొలిసారిగా విదేశాల్లోని డిప్లొమా చదువులకు అమలు చేస్తున్న పాఠ్యప్రణాళికను కూడా పరిశీలించి.. వచ్చే అయిదేళ్ల కోసం నూతన సిలబస్‌ను రూపొందించనున్నారు. ఈ మేరకు వచ్చే ఏడాది జూన్‌/జులైలో ప్రారంభమయ్యే పాలిటెక్నిక్‌ తొలి సంవత్సరం విద్యార్థులకు కొత్త పాఠ్యప్రణాళిక అమలవుతుంది. ఇందుకు రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి (ఎస్‌బీటెట్‌) ఇటీవలే ఒక్కో డిప్లొమా బ్రాంచీకి ఒక్కో నిపుణుల కమిటీ చొప్పున మొత్తం 24 కమిటీలను నియమించింది. ఒక్కో కమిటీలో ఆరుగురు సభ్యులుండగా.. అందులో ముగ్గురు పాలిటెక్నిక్‌ నిపుణులు; ఎన్‌ఐటీ, ఐఐటీల నుంచి ఇద్దరు; పారిశ్రామిక రంగాలకు చెందిన ఓ నిపుణుడు ఉన్నారు. ఈ కసరత్తు అంతా సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌, ఎస్‌బీటెట్‌ ఛైర్మన్‌ అయిన వాకాటి కరుణ ఆధ్వర్యంలో కొనసాగుతోంది. ఈ సిలబస్‌ 2028-29 విద్యాసంవత్సరం వరకు అమల్లో ఉంటుంది. ఆ తర్వాత అప్పటి పరిస్థితులకు అనుగుణంగా మారుస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏటా సుమారు 34 వేల మంది విద్యార్థులు డిప్లొమా కోర్సుల్లో చేరుతున్నారు.

్య కమిటీల సభ్యులు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా, మార్కెట్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకొని దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని పాలిటెక్నిక్‌ సిలబస్‌లతో పాటు ప్రపంచవ్యాప్తంగా 24 దేశాల్లోని ప్రముఖ డిప్లొమా కోర్సులను అందించే విద్యాసంస్థల సిలబస్‌లను కూడా అధ్యయనం చేసి అవసరమైన అంశాలను చేరుస్తారు. సింగపూర్‌, జర్మనీ, అమెరికా, చైనా తదితర 24 దేశాల్లోని సిలబస్‌లను ఆయా కమిటీలు పరిశీలిస్తున్నాయి. పాలిటెక్నిక్‌ విద్యలో ఇంటర్న్‌షిప్‌, ఆన్‌లైన్‌ మూల్యాంకనం, ఓపెన్‌బుక్‌ విధానం తదితర ఎన్నో వినూత్న సంస్కరణలను అమలు చేయడంలో ఎస్‌బీటెట్‌ ఇప్పటికే ముందుంది. సిలబస్‌లోనూ ఆదర్శంగా ఉండాలన్న సంకల్పంతో ఇతర దేశాల పాఠ్యప్రణాళికలను కూడా అధ్యయనం చేయాలని నిర్ణయించారు.

కొత్త పాఠ్యప్రణాళికను మార్చి 15వ తేదీ నాటికి సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకు అనుగుణంగా కమిటీ భేటీలు, కార్యశాలలు నిర్వహిస్తున్నాం. 2024లో పాలిటెక్నిక్‌లో చేరే విద్యార్థులు కొత్త సిలబస్‌ను చదవాల్సి ఉంటుంది. అప్పటికే ద్వితీయ, తృతీయ సంవత్సరం చదివేవారికి పాత సిలబస్సే ఉంటుంది. మొత్తం 58 ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలకు గాను 28 కళాశాలల్లోని పలు కోర్సులకు నేషనల్‌ బోర్డు ఆఫ్‌ అక్రిడిటేషన్‌ (ఎన్‌బీఏ) గుర్తింపు సాధించి దేశంలో ముందంజలో ఉన్నాం. అఖిల భారత సాంకేతిక విద్యామండలి మోడల్‌ కరిక్యులమ్‌ ప్రకారం సిలబస్‌ను, ఇతర కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. గతంలో ఆంగ్లం, గణితం సబ్జెక్టులకు ఓపెన్‌బుక్‌ విధానం అమలు చేయగా ప్రస్తుత విద్యాసంవత్సరం ఇండస్ట్రియల్‌ మేనేజ్‌మెంట్‌ సబ్జెక్టుకు కూడా అమలు చేస్తున్నాం.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z