DailyDose

ఇసుక తవ్వకాలకు అనుమతులు తప్పనిసరి!

ఇసుక తవ్వకాలకు అనుమతులు తప్పనిసరి!

కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ నుంచి పర్యావరణ అనుమతులు, ఇన్‌ల్యాండ్‌ వాటర్‌వేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఐడబ్ల్యూఏఐ) నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) పొందకుండా రాష్ట్రంలో ఇసుక రీచ్‌లలో తవ్వకాలు చేపట్టడం సరికాదని హైకోర్టు అభిప్రాయపడింది. పర్యావరణ అనుమతులు, ఎన్వోసీ లేని నేపథ్యంలో టెండర్‌ను ఎవరికీ అప్పగించకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని ఓ దశలో స్పష్టంచేసింది. దీంతో పర్యావరణ అనుమతులు, ఎన్వోసీ లేకుండా రాష్ట్రంలో ఇసుక తవ్వకాలకు అనుమతించబోమని హైకోర్టుకు ప్రభుత్వం నివేదించింది. టెండర్‌ ప్రక్రియ ద్వారా ఇసుక తవ్వకాలకు అనుమతి పొందిన కాంట్రాక్ట్‌ ఏజన్సీలకు ఇప్పటికే లెటర్‌ ఆఫ్‌ ఇండెంట్‌ జారీచేశామని.. అయినప్పటికీ పర్యావరణ అనుమతులు, ఎన్వోసీ పొందాకే తవ్వకాలకు అనుమతిస్తామని కోర్టుకు ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్‌ హామీ ఇచ్చారు. దీన్ని న్యాయస్థానం నమోదు చేసింది. ఇసుక తవ్వకాలకు పర్యావరణ అనుమతులు, ఎన్వోసీ తప్పనిసరి అని గుర్తుచేసింది. ఇసుక తవ్వకాలపై రాష్ట్ర ప్రభుత్వం, జయప్రకాశ్‌ వెంచర్స్‌, టర్న్‌కీ సంస్థలకు తామేమీ క్లీన్‌చిట్‌ ఇవ్వడం లేదని వ్యాఖ్యానించింది. మరోవైపు రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) విచారణ జరుపుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై తాము సమాంతరంగా విచారణ జరపడం సరికాదని అభిప్రాయపడింది. అక్రమ తవ్వకాల వ్యవహారాన్ని ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్లేందుకు పిటిషనర్‌కు వెసులుబాటు ఇచ్చింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌, జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. పిల్‌ను పరిష్కరించింది. రాష్ట్రంలో ఇసుక తవ్వకాల లీజు గడువు ఈ ఏడాది మే 2తో ముగిసినా జయప్రకాశ్‌ పవర్‌ వెంచర్స్‌, టర్న్‌కీ ఎంటర్‌ప్రైజ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలు అక్రమంగా ఇసుక తవ్వకాలు కొనసాగిస్తున్నాయంటూ పల్నాడు జిల్లా అమరావతి మండలం ధరణికోటకు చెందిన దండా నాగేంద్రకుమార్‌ హైకోర్టులో పిల్‌ వేశారు. ఇసుక తవ్వకాల టెండర్‌ ప్రక్రియను రద్దు చేయాలని అభ్యర్థించారు.

గడువు ముగిసినా జేపీ, టర్న్‌కీ తవ్వకాలు చేస్తున్నాయి
బుధవారం విచారణలో పిటిషనర్‌ తరఫున న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. ఐడబ్ల్యూఏఐ నుంచి ఎన్వోసీ పొందకుండా ఇసుక ఈ-టెండర్‌ నోటిఫికేషన్‌ ఇవ్వడం చట్ట విరుద్ధమన్నారు. టెండర్‌ ప్రక్రియను నిలువరించాలని కోరారు. లీజు గడువు ముగిసినా జయప్రకాశ్‌ సంస్థ, సబ్‌కాంట్రాక్ట్‌ తీసుకున్న టర్న్‌కీ సంస్థలు భారీ యంత్రాలతో ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్న దృశ్యాల ఫొటోలను కోర్టులో సమర్పించామన్నారు. అమరావతి మండలం వైకుంఠపురం దగ్గర వెంకన్న కొండలను తవ్వేసి కృష్ణా నదీ ప్రవాహానికి అడ్డంగా బండ్‌లు ఏర్పాటు చేశారన్నారు. దీన్ని ఇన్‌ల్యాండ్‌ వాటర్‌వేస్‌ అథారిటీ తప్పుపట్టిందన్నారు. ఏజీ శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. ‘ఇసుక అక్రమ తవ్వకాలపై పిటిషనర్‌ ఎన్జీటీని ఆశ్రయించారు. ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ పర్యవేక్షిస్తోంది. లీజ్‌ గడువు మే 2తో ముగియడంతో ఆ తర్వాత రీచ్‌ల నుంచి ఇసుక తవ్వడం లేదు. జయప్రకాశ్‌ సంస్థ గతంలో తవ్వి తీసి స్టాక్‌ యార్డుల్లో నిల్వ చేసిన ఇసుకను మాత్రమే తరలిస్తున్నారు. నదికి అడ్డంగా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బండ్‌లను ఇసుక తవ్వకాల తర్వాత తొలగిస్తున్నాం’ అని తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు.. పర్యావరణ అనుమతులు, ఎన్వోసీ తీసుకున్నాకే ఇసుక తవ్వకాలు చేపట్టాలని పేర్కొంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z