NRI-NRT

ట్రంప్ కేసులో తీర్పు చెప్పిన న్యాయమూర్తులకు బెదిరింపులు

ట్రంప్ కేసులో తీర్పు చెప్పిన న్యాయమూర్తులకు బెదిరింపులు

రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump)ని కొలరాడో కోర్టు అనర్హుడిగా ప్రకటించింది. ఈ కేసులో తీర్పు వెలువరించిన న్యాయమూర్తులకు పలువురి నుంచి బెదిరింపులు మొదలైనట్లు తెలుస్తోంది. వారికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో తీవ్రమైన పదజాలంతో కొందరు పోస్టులు పెడుతున్నారని అడ్వాన్స్‌డ్‌ డెమోక్రసీ అనే ఎన్‌జీవో తెలిపింది.

‘‘మంగళవారం కొలరాడో న్యాయస్థానం తీర్పు వెలువరించిన నాటి నుంచి న్యాయమూర్తులు, డెమోక్రాట్‌లకు వ్యతిరేకంగా పలువురు పోస్టులు పెడుతున్నారు. ఈ రకమైన వ్యాఖ్యలు ఆందోళనకరం. న్యాయమూర్తులకు వారి కుటుంబ సభ్యులకు హాని తలపెట్టాలని రెచ్చగొట్టే పోస్టులు పెట్టడం, వారి వ్యక్తిగత సమాచారంతోపాటు ఇంటి చిరునామా వంటి వివరాలను కొందరు సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేస్తున్నారు’’ అని ఎన్‌జీవో అధ్యక్షుడు, మాజీ ఎఫ్‌బీఐ అధికారి డానియెల్‌ జే. జోన్స్‌ తెలిపారు. రాజకీయ నాయకులు ఇలాంటి పోస్టులకు వ్యతిరేకంగా మాట్లాడితేనే.. వారి మద్దతుదారుల్లో హింసాత్మక ధోరణి తగ్గుతుందని జోన్స్‌ అన్నారు. సామాజిక మాధ్యమ సంస్థలు కూడా ఇలాంటి వ్యాఖ్యలు ప్రచారం కాకుండా అడ్డుకోవాలని సూచించారు.

2021 నాటి యూఎస్‌ క్యాపిటల్‌ భవనంపై దాడికి సంబంధించిన కేసులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్రంప్‌ హింసను ప్రేరేపించారనడానికి బలమైన సాక్ష్యాలు ఉన్నాయని అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన అనర్హుడని కొలరాడో కోర్టు ప్రకటించింది. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ సెక్షన్‌ 3 నిబంధన ప్రకారం.. ఆయన ప్రైమరీ ఎన్నికల్లో పోటీకి అనర్హుడని తేల్చింది. ఈ నేపథ్యంలోనే తాజా తీర్పుపై ట్రంప్‌ అటార్నీ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసేందుకు సిద్ధమైంది. దీంతో ట్రంప్‌ భవితవ్యాన్ని అమెరికా సుప్రీంకోర్టు తేల్చనుంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z