Food

బ్లూబెర్రీస్ తినడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందా?

బ్లూబెర్రీస్ తినడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందా?

బ్లూబెర్రీలు పోషకాల గనులు. పొద్దున్నే టిఫిన్‌గా ఏదో ఓ రూపంలో తీసుకుంటే.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. మెదడుకు అండగా నిలిచే పండిది. వీటిలోని యాంటీఆక్సిడెంట్లు, ఇతర మూలకాలు శరీరంలో కణాల విధ్వంసానికి, వృద్ధాప్యానికి కారణమయ్యే ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ మీద పోరాడతాయి. బ్లూబెర్రీల్లో ఫ్లేవనాయిడ్లు, యాంథోసైనిన్లు అనే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.’

మెరుగైన జ్ఞాపకశక్తి

బ్లూబెర్రీ పండ్లను క్రమం తప్పకుండా తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందని ఓ పరిశోధన పేర్కొన్నది. పరిశోధకులు కొంతమందికి రోజూ బ్లూబెర్రీ రసం ఇస్తూ వారి ఆరోగ్య పరిస్థితులను అధ్యయనం చేశారు. పన్నెండు వారాల తర్వాత వారి జ్ఞాపకశక్తిలో మెరుగుదల కనిపించింది. బ్లూబెర్రీలు తింటే మెదడు పనితీరు మెరుగుపడుతుంది. జాగరూకత (అలర్ట్‌నెస్‌) చేకూరుతుంది.

నాడీ సంబంధ వ్యాధుల నుంచి రక్షణ

నాడుల క్షీణతకు సంబంధించిన అల్జీమర్స్‌, పార్కిన్సన్స్‌ వ్యాధుల ముప్పును కూడా బ్లూబెర్రీలు తగ్గిస్తాయట. అయితే, దీని గురించి మరింత అధ్యయనం జరగాల్సి ఉంది. మెదడులో విషపూరిత ప్రొటీన్లు పేరుకుపోకుండా బ్లూబెర్రీల్లోని యాంటీ ఆక్సిడెంట్లు సమర్థంగా అడ్డుకుంటాయని వెల్లడైంది.

వృద్ధాప్యానికి చెక్‌

మనుషుల్లో వయసు పైబడటం, మేధా సామర్థ్యం తగ్గుదల.. ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. బ్లూబెర్రీ ఈ సమస్య నుంచి రక్షణ కల్పిస్తుంది. ‘ఎనల్స్‌ ఆఫ్‌ న్యూరాలజీ’లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు తీసుకునే వారి మేధా సామర్థ్యం తగ్గుదల రెండున్నరేళ్లు వాయిదా పడుతుందట.

ఆహారంలో భాగంగా…

1. ఇవి ఏడాదంతా దొరుకుతాయి. తాజాగా తిన్నా, ఫ్రిజ్‌లో ఉంచి తిన్నా కూడా ఒకే రకం ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయి. ఉదయం వేళల్లో అయితే వీటికి ఓట్స్‌, యోగర్ట్‌ చేర్చుకోవచ్చు. లేదంటే స్మూతీగా తీసుకోవచ్చు.

2. యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధమైన బ్లూబెర్రీ టీ కూడా ఆరోగ్యానికి మంచిదే.

3. బ్లూబెర్రీలను ఒక బౌల్‌లో ఉంచి ఫ్రిజ్‌లో పెట్టుకుని ఆరోగ్యకరమైన స్నాక్‌గా ఎప్పుడంటే అప్పుడు తినేయొచ్చు.

4. మఫిన్స్‌, పాన్‌కేక్స్‌, డెజర్ట్‌ రూపంలో కూడా బ్లూబెర్రీలను తినొచ్చు.

5. ఊదారంగు బ్లూబెర్రీలను వేసుకుని సలాడ్లను మరింత వర్ణరంజితం చేసుకోవచ్చు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z