Politics

ప్రగతి భవన్‌లో కంప్యూటర్లు మాయమా?

ప్రగతి భవన్‌లో కంప్యూటర్లు మాయమా?

ప్రజా(ప్రగతి) భవన్ నుంచి నాలుగు కంప్యూటర్లు మాయమైనట్లు ప్రచారం జరుగుతున్నది. ఎలక్షన్ రిజల్ట్ రోజు రాత్రి వాటిని బయటికి వెళ్లినట్టు తెలుస్తున్నది. అందులో కీలకమైన డాటా ఉన్నట్టు అనుమానం వ్యక్తమవుతున్నది. అయితే ఎవరు చెబితే ఆ కంప్యూటర్లను తీసుకెళ్లారు? ఎక్కడికి తీసుకెళ్లారు? సొంత కంప్యూటర్లను తీసుకెళ్లారా? లేక ప్రభుత్వానివా? తీసుకెళ్లేముందు ఎవరి అనుమతి తీసుకున్నారు? అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నట్టు ప్రభుత్వ వర్గాల్లో టాక్.

రాత్రికి రాత్రే..

అసెంబ్లీ రిజల్ట్స్ వచ్చిన డిసెంబరు మూడో తేదీ రోజు ప్రగతిభవన్‌లో బీఆర్ఎస్ లీడర్లు, అధికారులతో హడావుడిగా ఉన్నది. మధ్యాహ్నం రెండు గంటల తరువాత ఫలితాలపై స్పష్టత వచ్చిన వెంటనే అక్కడున్న లీడర్లు, అధికారులు ఒక్కొక్కరుగా బయటకు వెళ్లిపోయారు. అదే రోజు సాయంత్రం మాజీ సీఎం కేసీఆర్ తన సొంత కారులో ఫామ్ హౌజ్‌కు వెళ్లారు. అక్కడ పనిచేసే కొద్దిమంది సిబ్బంది మాత్రమే భవన్ లో ఉన్నారు. ఎప్పటి మాదిరిగానే బయట పోలీసు పహారా ఉంది. అయితే అదే రోజు రాత్రి 8 గంటల తర్వాత ఓ వ్యక్తి ప్రగతిభవన్‌కు కారులో వచ్చి నాలుగు కంప్యూటర్లు తీసుకెళ్లినట్టు తెలుస్తున్నది. రెగ్యులర్‌గా వచ్చే వ్యక్తి కావడంతో ఎవరూ కూడా అభ్యంతర పెట్టలేదని సమాచారం. అయితే అంత రాత్రి వేళ కంప్యూటర్లను తీసుకెళ్లాల్సిన అవసరం ఏమిటనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సీసీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డ్

నాలుగు కంపూటర్లు తీసుకెళ్తున్న విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డ్ అయినట్టు తెలిసింది. ఆ దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత సదరు వ్యక్తికి నోటీసులు ఇచ్చే చాన్స్ ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. అయితే ఆ వ్యక్తి ఎందుకు ఆ కంప్యూటర్లు తీసుకెళ్లారు? ఒక వేళ సొంత కంప్యూటర్లు అయితే ఎవరి అనుమతి తీసుకున్నారు? అనే కోణంలో భవన్ ఇన్ చార్జిగా ఉన్న అధికారి నుంచి వివరాలు రాబట్టిన తరువాత తదుపరి చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లు భావిస్తున్నట్లు సమాచారం.

‘భవన్’పై ఫోకస్ పెట్టని సీఎస్

రిజల్ట్ వచ్చిన వెంటనే సీఎస్ శాంతి కుమారి సెక్రటేరియట్ కదలికలపై నిఘా పెట్టారు. అనుమతి లేకుండా కంపూటర్లు, ఫైల్స్, పెన్ డ్రైవ్స్, చివరికి ఓ చిన్న కాగీతం కూడా బయటికి వెళ్లనివ్వొద్దని ఆదేశాలు జారీ చేశారు. దీంతో సెక్యూరిటీ స్టాఫ్ ప్రతి బ్యాగును చెక్ చేసి పంపారు. ఎవరైనా ఆఫీసర్లు కాగీతాలు తీసుకెళ్తుంటే, వెనక్కి పంపారు. అయితే ప్రగతిభవన్ కదలికలపై సీఎస్ ఎందుకు దృష్టి పెట్టలేదని చర్చ అధికార వర్గాల్లో జరుగుతున్నది. రిజల్ట్ వచ్చిన రోజునే ప్రగతిభవన్ కదలికలపై కూడా ఫోకస్ పెడితే బాగుండుననే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

ఐటీ శాఖకు చెందిన కంప్యూటర్లు

సెక్రటేరియట్, ప్రగతిభవన్‌లో కంప్యూటర్లను ఐటీ శాఖనే ఏర్పాటు చేస్తున్నది. ఎక్కడ ఎన్ని కంప్యూటర్లు ఏర్పాటు చేశారు? ఏ కంపెనీకు చెందిన కంప్యూటర్లు? ఎంత కాన్ఫిగరేషన్ ఉన్నది? (కీ బోర్డు, మౌస్, ప్రింటర్స్, పెన్ డ్రైవ్స్, జీరాక్స్ మిషన్స్) అనే వివరాలు ఐటీ శాఖ వద్ద ఉంటాయి. అలాగే కంప్యూటర్లు అమర్చిన చోట, అక్కడి అధికారి నుంచి అక్నాలెడ్జ్ మెంట్ తీసుకుంటారు. ప్రగతిభవన్‌లో ఏర్పాటు చేసిన కంప్యూటర్లను లెక్కించినప్పుడు 4 సిస్టమ్స్ మాయమైనట్లు టాక్ ఉంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z