Politics

రఘురామకృష్ణరాజుకు ఏపీ హైకోర్టులో ఊరట

రఘురామకృష్ణరాజుకు ఏపీ హైకోర్టులో ఊరట

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. సంక్రాంతికి తమ ఊరు వెళ్తానని.. రక్షణ కల్పించాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. పోలీసులు రఘురామపై 11 కేసులు పెట్టారని, మరో కేసు పెట్టే అవకాశం ఉందని ఆయన తరఫు న్యాయవాదులు ఉమేష్‌ చంద్ర, వైవీ రవిప్రసాద్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. ‘‘గతంలో సీఐడీ అధికారులు అరెస్టు చేసి చిత్రహింసలకు గురి చేశారు. మరోసారి తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేసే అవకాశముంది. పోలీసులు నిబంధనలు పాటించేలా ఆదేశాలు ఇవ్వండి’’ అని కోర్టును అభ్యర్థించారు.

రఘురామకృష్ణరాజు పిటిషన్‌కు విచారణ అర్హత లేదని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. కేసు నమోదై, ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే అవకాశం ఉన్న సెక్షన్లు అయితేనే 41ఏ నిబంధనలు వర్తిస్తాయన్నారు. తాజాగా ఆయనపై ఎలాంటి కేసులు పెట్టలేదని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. 41ఏ ప్రొసీజర్‌ ఫాలో అవుతూ రక్షణ కల్పించాలని, ఆర్నేష్‌ కుమార్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు పాటించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z