Health

వైద్య ఆరోగ్యశాఖపై జగన్‌ సమీక్ష

వైద్య ఆరోగ్యశాఖపై జగన్‌ సమీక్ష

వైద్య, ఆరోగ్యశాఖపై తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్‌ 2పై సమావేశంలో చర్చించారు. ఆరోగ్యశ్రీని ఎలా వినియోగించుకోవాలనేదానిపై ముమ్మరంగా ప్రచారం చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో గుర్తించిన రోగులకు వైద్యచికిత్సలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి సకాలంలో మందులు అందించాలన్నారు. ప్రతి ఇంటినీ జల్లెడ పట్టి అవసరమైన వారికి క్యాంప్‌ల ద్వారా వైద్యసేవలు అందించాలని సీఎం సూచించారు. ప్రివెంటివ్‌ కేర్‌ అనేది చాలా ముఖ్యమని.. గ్రామంలో ప్రతి ఇల్లూ మ్యాపింగ్‌ జరగాలని, ప్రతి ఆరు నెలలకోసారి డేటా అప్డేట్‌ చేయాలన్నారు. ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీపై అధికారులను సీఎం ఆరా తీశారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా రూ. 25 లక్షల వరకూ వైద్యసేవలు, ఈ సేవలు ఎలా పొందాలన్న విషయంలో ఎవ్వరికీ సందేహాలు ఉండకూడదని వైద్య, ఆరోగ్య శాఖ సమీక్షలో సీఎం జగన్‌ మరోసారి స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే…
ఆరోగ్యశ్రీ వినియోగంపై ముమ్మరంగా ప్రచారం చేయాలి, ఆరోగ్యశ్రీ సేవలను ఎలా వినియోగించుకోవాలన్న అంశంపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని సీఎం ఆదేశించారు. ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ ప్రగతిని అధికారులను అడిగి సీఎం తెలుసుకున్నారు. మెగా ఆరోగ్యశ్రీ అవేర్‌నెస్‌ క్యాంపెయిన్‌ స్టేటస్‌ను అధికారులు వివరించారు. నిర్ణీత టార్గెట్‌లోగా ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఆరోగ్యశ్రీ యాప్‌ డౌన్‌లోడ్‌ స్టేటస్‌ గురించి అధికారులు సీఎంకు వివరించారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా రూ. 25 లక్షల వరకూ వైద్యసేవలు అందించాలని.. ఈ సేవలు ఎలా పొందాలన్న విషయంలో ఎవ్వరికీ సందేహాలు ఉండకూడదన్నారు. ఈ సమాచారం తెలియని వారు ఉండకూడదన్నారు. నెట్‌ వర్క్‌ ఆస్పత్రులకు ఎలా వెళ్లాలన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలియాలన్నారు. అవేర్‌నెస్‌ అనేది పెంచాలి, ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి అనేది బాగా అవేర్‌నెస్‌ పెరగాలన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష అమలు, పురోగతిని సీఎంకు అధికారులు వివరించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో గుర్తించిన రోగులకు చేయూతనిచ్చే కార్యక్రమం ఎలా జరుగుతుందన్న దానిపై నిరంతరం సమీక్ష చేయాలని సీఎం ఆదేశించారు.

సీఎం జగన్‌ మాట్లాడుతూ.. “ప్రివెంటివ్‌ కేర్‌ అనేది ముఖ్యం, ప్రతి ఇంటిని జల్లెడ పట్టి క్యాంపుల ద్వారా అవసరమైన వారికి వైద్యసేవలు అందాలి. గ్రామాన్ని జల్లెడ పట్టాలి, ప్రతి ఆరునెలలకోసారి ఇది జరగాలి. విలేజ్‌ శాచురేషన్‌ మోడ్‌లో జరగాలి. ప్రతి ఇల్లు కవర్‌ అవ్వాలి ఇదే మన ప్రధాన ధ్యేయంగా ఉండాలి. ఏ గ్రామంలో ఎంతమందికి బీపీ, షుగర్‌ ఉన్నాయి, ఎంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు, వారికి అందే వైద్యసేవలు తదితర డేటా మ్యాపింగ్‌ అనేది జరగాలి. బీపీ, షుగర్, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను గుర్తించి ప్రివెంటివ్‌ కేర్‌ లో భాగంగా చికిత్సలు అందించడం, మందులు ఇవ్వడం, మంచానికి పరిమితమైన వారికి కావాల్సిన మందులు ఇవన్నీ కూడా మ్యాప్‌ చేయాలి. ప్రతి 6 నెలలకోసారి మీ రికార్డులు అప్డేట్‌ చేయాలి. శాచురేషన్‌ కాన్సెప్ట్‌ ఉండాలి, గ్రామంలో 100 శాతం జరగాలి, ఎక్కడైనా ఆరోగ్యశ్రీ కార్డు మిస్‌ అయినా వారికి కూడా వైద్యం అందాలి. ప్రైమరీ ఇన్వెస్టిగేషన్‌లో ఐడెంటిఫై చేసిన వారికి రీకన్ఫర్మేషన్‌ టెస్ట్‌లు చేయండి. సెకండ్‌ క్యాంప్‌ తర్వాత ప్రతి కేసుకు సంబంధించి టెస్ట్‌లు పూర్తి కావాలి, టెస్ట్‌లు అవసరముంటే మళ్ళీ తప్పకుండా చేయాలి. క్యాంప్‌లపై సీరియస్‌ గా దృష్టిపెట్టాలి. ప్రతి సచివాలయాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని డ్రైవ్‌ చేయాలి. స్టెమీ కార్యక్రమం విలేజ్‌ క్లీనిక్‌ దగ్గర నుంచి మొదలవ్వాలి, అవసరమైన ఓరియెంటేషన్‌ ఇవ్వాలి, పబ్లిక్‌ అవేర్‌నెస్‌పై మరింత ఫోకస్‌ పెట్టాలి.” అని సీఎం అధికారులకు సూచించారు.

నూతన మెడికల్‌ కాలేజీలకు సంబంధించిన స్టేటస్‌ను అధికారులు వివరించారు. వాటికి అవసరమైన ఎక్విప్‌మెంట్‌పై దృష్టి పెట్టాలన్న సీఎం సూచించారు. జిల్లాల వారీగా జగనన్న ఆరోగ్య సురక్ష 2 స్టేటస్‌ వివరించిన అధికారులు, మొత్తం 1338 క్యాంప్‌లు నిర్వహించగా, క్యాంప్‌లలో స్పాట్‌ టెస్టింగ్‌ 98,210 మందికి నిర్వహించినట్లు, 4,27,910 మంది ఓపీ ద్వారా వైద్యసేవలు పొందారని అధికారులు సీఎంకు వివరించారు. జేఏఎస్‌ 1 కంటివెలుగు కళ్ళద్దాల పంపిణీ స్టేటస్‌ రిపోర్ట్‌ను అధికారులు వివరించారు. మొత్తం 5,76,493 మందికి కళ్ళద్దాలు అవసరం కాగా, 67 శాతం పంపిణీ జరిగిందని, మిగిలిన కళ్ళద్దాల పంపిణీ కూడా త్వరితగతిన పూర్తిచేయనున్నామని తెలిపారు. వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో 12 ఎస్‌ఎన్‌సీయూలు, 5 ఎన్‌ఐసీయూలు ప్రారంభానికి సిద్దంగా ఉన్నాయని అధికారుల వెల్లడించారు. విశాఖలో మెంటల్‌ కేర్‌ ఆసుపత్రి, విజయవాడ, తిరుపతిలో సిటీ డయాగ్నోస్టిక్‌ సెంటర్స్, రీజనల్‌ డ్రగ్‌ స్టోర్స్, తిరుపతి ఎస్‌వి మెడికల్‌ కాలేజ్‌లో పీజీ మెన్స్‌ హాస్టల్, అనంతపురం జీజీహెచ్‌లో బర్న్స్‌ వార్డ్, కర్నూలులో స్టేట్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్, జీఎంసీ కర్నూలులో ఎగ్జామినేషన్‌ హాల్‌ ప్రారంభానికి సిద్దంగా ఉన్నాయని అధికారులు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z